గాజాలో మళ్లీ పాత సీన్స్ రీపిట్ అవుతున్నాయి. చాలా రోజులుగా ఇక్కడ గన్ గర్జించలేదు. కారణం హమాస్- ఇజ్రాయెల్ మధ్య కుదిరిన కాల్పులు విరమణ ఒప్పందం. కానీ ఇప్పుడు మళ్లీ గాజాపై బాంబుల వర్షం కురిపిస్తోంది ఇజ్రాయెల్. అంతేకాదు ఇప్పుడు గ్రౌండ్ ఆపరేషన్ కూడా ప్రారంభించింది. దీంతో మళ్లీ గాజాలో పాత సీన్స్ రీపిట్ అవుతున్నాయి.
గాజాపై ఇజ్రాయెల్ జరిపిన ఏరియల్ స్ట్రైక్స్‌లో 400 మంది మృతి చెందారని హమాస్ ప్రకటించింది. అంతేకాదు తాము బఫర్ జోన్ క్రియేట్ చేసేందుకు గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభించినట్టు IDF అధికారికంగా ప్రకటించింది. గాజాను ఉత్తర, దక్షిణ ప్రాంతాలుగా విడదీసే కీలక ప్రాంతాల్లో ఇప్పుడు ఇజ్రాయెల్ తన దళాలను మోహరించింది. ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందం పేరుతో హమాస్ మళ్లీ తన బలాన్ని పెంచుకుంటుందని అందుకే చర్యలు తీసుకోకతప్పడం లేదని ఇజ్రాయెల్ వాదిస్తోంది. బందీలను విడిచిపెట్టేందుకు అస్సలు ఆసక్తి చూపించడం లేదని.. మధ్యవర్తులు విధించిన నిబంధనలను పాటించడం లేదని ఇజ్రాయెల్ ఆరోపిస్తుంది.
గాజా ప్రజలు హమాస్‌ను తరిమికొట్టేందుకు ఇదే చివరి అవకాశం అంటూ ఓ వార్నింగ్ ఇచ్చింది ఇజ్రాయెల్. ఇప్పటికైనా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్టు వెంటనే హమాస్‌ను పారద్రోలి.. గాజాను అభివృద్ధి చేసుకోవాలని సూచించింది.
గాజా ప్రజలను కవచంలా వాడుకుంటూ హమాస్ తమ అక్రమాలను కొనసాగిస్తుందన్నదని ఇజ్రాయెల్ వాదన. హమాస్ గాజాను వదిలిపెట్టకపోతే తమ పూర్తి స్థాయి మిలటరీ ఆపరేషన్ ప్రారంభమవుతుందని తేల్చి చెప్పింది. చర్చల ద్వారానే ఈ సమస్య పరిష్కరించుకోవాలని చూస్తున్నామని.. హమాస్ అలా చేసేందుకు అంగీకరించడం లేదు. పరిస్థితి ఇలానే కొనసాగితే గాజాను పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకుంటామని తేల్చి చెప్పింది.