తెలంగాణ ప్రభుత్వం స్కూల్స్‌కు వెళ్లే పిల్లల తల్లిదండ్రుల్లో సంతోషం నింపుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న గురుకుల పాఠశాలల్లో వసతులు మెరుగు పరచడం, మెస్ చార్జీలు పెంచడం వంటి నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు బడ్జెట్లో కూడా పెద్దపీట వేసింది. రేవంత్ సర్కారు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు.
రాష్ట్రంలో మొత్తం 58 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్‌లు నిర్మించ బోతున్నామన్న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క.. వాటి నిర్మాణం, నిర్వహణ కోసం రూ.11,600 కోట్లు కేటాయిస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో వివరించారు.
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఆలోచన చారిత్రాత్మకమని, ఒక్కో ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబోతున్నట్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా విద్యను అందించే విధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌లో ఆధునిక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. ఆడిటోరియాలు, డైనింగ్ హాల్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, క్రీడా మైదానాలు, క్రికెట్, ఫుల్ బాల్ గ్రౌండ్స్ వంటి సదుపాయాలు ఈ పాఠశాలల్లో ఉంటాయని తెలిపారు. ఈ స్కూల్స్ ఆవరణల్లోనే ఉపాధ్యాయులు, ఇతర ఇబ్బంది నివసించేలా, ఎప్పుడూ విద్యార్థులకు అందుబాటులో ఉండేలా క్వార్టర్స్ కూడా నిర్మాణం చేస్తున్నామని భట్టి విక్రమార్క వివరించారు. ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌లో విద్యుత్ కోసం సోలార్, విండ్ పవర్ ప్లాంట్లు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయ చెప్పారు.
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌లో పిల్లలకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫాం ఇస్తారని.. కాంపిటీషన్‌కు తగ్గట్టు ఐఐటీ, జేసీసీ, నీట్ వంటి పోటీ పరీక్షలకు కూడా పిల్లలను సిద్ధం చేస్తారని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు.