హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు, వాహన దారుల ట్రాఫిక్ కష్టాలు తగ్గించేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే పలు ప్రతిపాదనలు ఉన్నప్పటికీ బడ్జెట్‌లో కూడా భారీగా కేటాయింపులు చేసింది.
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ట్రాఫిక్ రద్దీ వాహన దారులకు నరకం చూపిస్తోంది. ఇలాంటి పరిస్థితులు నివారించేందుకు పలు నిర్ణయాలు తీసుకుంది. రాజధాని నగరంలో మౌలిక సదుపాయాలు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో వివరించారు.
హైదరాబాద్ నగరానికి సంబంధించిన కొత్త కార్యాచరణ ప్రణాళికలో భాగంగా సిటీ నలుమూలలా ఇప్పటికే ఉన్నవాటికి తోడు కొత్తగా 31 ఫ్లై ఓవర్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అలాగే, వివిధ ప్రాంతాల్లో 17 అండర్ పాస్‌లు కూడా నిర్మించ బోతున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. వీటికి అదనంగా హైదరాబాద్‌లోని పది రహదారులను విస్తరించి, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేయబోతున్నామని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లో కొత్త ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు, రహదారుల విస్తరణ కోసం రూ.7,032 కోట్లు అంచనా వ్యయంతో పనులు ప్రారంభించబోతున్నట్లు మంత్రి భట్టి వెల్లడించారు. మరో రూ.150 కోట్లతో హైదరాబాద్ నగర సుందరీకరణ పనులు కూడా ప్రారంభించినట్లు ఆయన అసెంబ్లీలో తెలియజేశారు.
హైదరాబాద్ నగరంలో భవిష్యత్తు అవసరాలు, రాబోయే రోజుల్లో పెరగనున్న బైక్‌లు, కార్లు, ఇతర వాహనాల రద్దీకి అనుగుణంగా హై సిటీ ప్రణాళికలో భాగంగా కొత్త ఫై ఓవర్లు, అండర్ పాస్‌లను నిర్మిస్తున్నట్లు భట్టి విక్రమార్క.. తన బడ్జెట్ ప్రసంగంలో వివరించారు.