29.7 C
Hyderabad
Saturday, April 18, 2026

Live Video

spot_img

విచ్చలవిడిగా వర్శిటీలకు అనుమతులు

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు మంత్రి నారా లోకేష్. ముఖ్యంగా విశాఖలో ఏఐ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. అదే సమయంలో అమరావతిలో డీప్ టెక్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.

ఐఐటి మద్రాస్, టోక్యో యూనివర్సిటీ, ఎల్ అండ్ టి సంస్థల సహకారంతో అమరావతి ప్రాంతంలో యూనివర్సిటీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ఏపీ ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్  రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ఆ రంగానికి సంబంధించి విశాఖలో ఏఐ యూనివర్సిటీ నెలకొల్పే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా నారా లోకేష్ ఈ విషయంలో పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చారు. ఏపీ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన, క్రమబద్ధీకరణ చట్ట సవరణ బిల్లును నారా లోకేష్ మంగళవారం ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం విద్యా రంగ అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

అయితే ప్రైవేటు విశ్వవిద్యాలయాల రాకపై విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం గొప్పగా చెపుతున్న ప్రైవేటు యూనివర్శిటీలు సామాన్యులకు అక్కరకు రావని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీరు సామాన్యులకు ఉపయోగపడకపోగా బడాబాబులకు కొమ్ము కాసే విధంగా ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం రంగంలో విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయాకుండా… ప్రైవేటుకు గేట్లు తెరవడం దేనికి సంకేతమని ప్రశ్నిస్తున్నారు.

ప్రైవేటు యూనివర్శిటీలు సొంత నిబంధనలు రూపొందించుకుని విద్యార్థులను వేధిస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే ఉన్న SRM, KL తదితర యూనివర్శిటీల్లో అటెండెన్స్‌ పేరుతో  విద్యార్థులకు హాల్‌ టికెట్‌ ఇవ్వకుండా ఆపేయటం…భారీగా పెనాల్టీలు కట్టించుకుని హాల్‌ టికెట్స్‌ ఇస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అమరావతిలో ఓ ప్రైవేటు యూనివర్శిటీ ఏకంగా 600 మంది విద్యార్థులను కొద్ది రోజులుగా ఇబ్బందిపెడుతోందని విశ్వసనీయ సమాచారం.

వీటిల్లో ఫెయిల్‌ అవడానికి తావులేదు. భారీగా సొమ్ములు చెల్లించి వచ్చే విద్యార్థుల్లో పది శాతం మాత్రమే విద్యపై ఫోకస్‌ చేస్తుండగా 90 శాతం కేవలం స్టేటస్‌ సింబల్‌ కోసం వీటిల్లో చేరుతున్నారు. ప్రభుత్వ యూనివర్శిటీల్లో సామాజిక, ఆర్థిక అంతరాలు కనిపిస్తాయి. పిల్లలకు అవి తెలియకుండా ఉండేందుకుప్రైవేటు వైపు తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు. ఇది దేశ ప్రయోజనాలకు విఘాతమని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు.

సామాజిక అవగాహనకు ఇక్కడ తావులేదు. ప్రైవేటు యూనివర్శిటీల్లో చదివిన వారు కార్పొరేట్‌ కంపెనీలకు సేవ చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని వివిధ నివేదికల్లో బయటపడింది. అంగ్లేయుల కాలంలో లార్డ్‌ మెకాలే విద్యావిధానానికి, ప్రైవేటు విద్యా విధానానికి పెద్ద తేడా లేదని సామాజిక ఉద్యమకారులు విమర్శిస్తున్నారు.

దేశ ప్రయోజనాల కోసం కాకుండా… కార్పొరేట్‌ అవసరాల కోసమే ప్రైవేటు యూనివర్శిటీలు భవిష్యత తరాన్ని తీర్చిదిద్దుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ అజమాయిషీ నామమాత్రం కావడంతో ప్రైవేటు యాజమాన్యాలు ఆడిందే ఆట అన్న తీరుగా వ్యవహరిస్తున్నాయి. అధునీకరణ పేరుతో ప్రైవేటు రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం సరికాదని విశ్లేషణ జరుగుతోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com