మిడిల్ ఈస్ట్‌లో మళ్లీ బాంబుల మోత మొదలైంది. హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందం ముగియడంతో ఇజ్రాయెల్ ఆర్మీ మళ్లీ తన పని మొదలుపెట్టింది. నిజానికి రెండో దశ కాల్పుల విరమణకు సంబంధించిన చర్చలు ముందుకు సాగడం లేదు. దీంతో ఇజ్రాయెల్ ఆర్మీ మళ్లీ గాజాపై బాంబులు జార విడిచాయి. దీంతో 200 మందికిపైగా గాజా వాసులు మృతి చెందారు.
నిజానికి కాల్పుల విరమణ ఒప్పందం మొదటి దశలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా విజయవంతంగానే కొనసాగింది. ఇజ్రాయెల్ ఆర్మీ చాలా ప్రాంతాలను ఖాళీ చేసింది. బందీల అప్పగింతలు కూడా జరిగాయి. దీంతో చాలా మంది గాజా వాసులు తిరిగి ఇళ్లకు చేరుకోవడం ప్రారంభించారు. కానీ రెండో దశ అమలుపై చర్చలు ముందుకు జరగడం లేదు కొన్ని రోజులుగా. దీంతో ఇజ్రాయెల్ మళ్లీ దాడులు ప్రారంభించింది.
ఇప్పటివరకు ఇజ్రాయెల్ దాడుల్లో 235 మంది వరకు చనిపోయారని పాలస్తీనా అధికారులు తెలిపారు. మృతుల్లో చాలా మంది చిన్నారులు, మహిళలు ఉన్నట్టు ప్రకటించారు. ఈ దాడిని అమెరికా కూడా ధ్రువీకరించింది. దాడికి ముందు ఇజ్రాయెల్ అమెరికాకు సమాచారమందించిందని తెలిపింది. ఈ ఉగ్రవాదాన్ని ఇంకా ఎన్నాళ్ల పాటు చూస్తూ కుర్చోవాలి.. ఇప్పటికే హమాస్, ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.. ఇప్పుడు దానికి అనుగుణంగానే చర్యలు ఉన్నాయని వైట్ హౌస్ ఓ ప్రకటన రిలీజ్ చేసింది.
ఇజ్రాయెల్ దాడులపై హమాస్ స్పందించింది. వెంటనే మళ్లీ బందీల ప్రస్తావన తీసుకొచ్చింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ఏకపక్షంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారని.. ఇప్పుడీ చర్యలు బందీల జీవితాలను ప్రమాదంలో పడేశాయని ప్రకటించింది హమాస్.
బందీలను విడిచిపెట్టాలని ఇప్పటికే ఇజ్రాయెల్, అమెరికా వార్నింగ్‌లు ఇస్తూనే ఉన్నాయి. బందీలు తమ చెరలో ఉంటేనే పరిస్థితి ఇలా ఉంది.. లేదంటే ఏంటి సంగతన్నది హమాస్ ఆలోచన. బందీలను విడిచిపెట్టినా.. విడిచిపెట్టకున్నా.. మీపై దాడులు తప్పవు అన్నట్టుగా ఇజ్రాయెల్, అమెరికా చర్యలు ఉన్నాయి. చర్చల విషయంలో ఎంత ఆలస్యం చేస్తే.. మీకే అంత నష్టం అనే తీరుగా ఇజ్రాయెల్ చర్యలు కనిపిస్తున్నాయి.
మొత్తానికైతే ఇటు హమాస్, అటు ఇజ్రాయెల్ మధ్యలో తీవ్రంగా నష్టపోతున్నది గాజా ప్రజలు. ఉగ్రవాదానికి గాజా ప్రజలు సహకరించినంత కాలం ఇదే అవస్థ ఉంటుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.