నియోజకవర్గాల పునర్విభజన అంశంపై అసెంబ్లీలోని మీటింగ్ హాల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి పలు పార్టీల నాయకులు హాజరయ్యారు. వాళ్లందరితో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ తినకుండా ఏం చేయాలన్న అంశాలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చర్చిస్తున్నారు.
డీ లిమిటేషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి కె.జానారెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కే.కేశవరావు, ఎంఐఎం శాసనసభక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా నాయకులు హనుమేష్, సూర్యం, మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి, పల్లా వెంకట్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు నెల్లికంటి సత్యం, రిపబ్లిక్ ఆన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి సిహెచ్ బాలకృష్ణ, రాష్ట్ర అధ్యక్షులు బి మహేష్ బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం దుర్గాప్రసాద్‌తో పాటు.. పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం మరికొద్ది రోజుల్లో నియోజక వర్గాల పునర్విభజన చేపట్టబోతోంది. అయితే, జనాభా ప్రాతిపదికన ఈ పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందన్న చర్చ కొద్ది రోజులుగా నడుస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై దృష్టిపెట్టింది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కేబినెట్‌లో ఈ అంశం గురించి ప్రస్తావించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఈ బాధ్యతను చూడాల్సిందిగా సూచించారు. దీంతో, అప్పటినుంచీ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీనియర్ నేత జానారెడ్డితో సమాలోచనలు చేస్తూ.. అఖిల పక్ష సమావేశానికి రూపకల్పన చేశారు. దీనికోసం అన్ని పార్టీల ముఖ్య నాయకులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్వయంగా ఫోన్ లో మాట్లాడారు. ఆ తర్వాత ఇవాళ అసెంబ్లీ మీటింగ్ హాల్‌లో అఖిల పక్ష సమావేశానికి కార్యాచరణ రూపొందించారు. ప్రస్తుతం ఆ సమావేశం కొనసాగుతోంది.