-
2030 నాటికి 20వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యం
-
పెట్టుబడులకు ముందుకొచ్చిన కంపెనీలు
-
అద్భుతమైన గ్రీన్ పవర్ పాలసీ తెచ్చిన ప్రజా ప్రభుత్వం
-
రాష్ట్రానికి తక్కువ ధరకే కాలుష్య రహితంగా విద్యుత్తు
రాష్ట్రానికి తక్కువ ధరతో, కాలుష్య రహితంగా విద్యుత్తును అందించడమే లక్ష్యంగా సమగ్ర గ్రీన్ పవర్ పాలసీని ప్రజా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు వచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రీన్ పవర్ పాలసీకి పెట్టుబడుదారులు ఆకర్షితులై రూ. 80,000 నుంచి లక్ష కోట్ల వరకు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారని ఇప్పటికే కొన్ని కంపెనీలు ఎంఓయూలు చేసుకున్నాయని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీపై తెలంగాణ శాసన మండలిలో ఎమ్మెల్సీలు బల్మూరు వెంకట్, మహేష్ కుమార్ గౌడ్, కల్వకుంట్ల కవిత, భాను ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సుదీర్ఘ సమాధానం ఇచ్చారు.
ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ రంగంలో అనేక మార్పులు వచ్చినప్పటికీ గత 10 సంవత్సరాలు ఈ రంగంలో ఒక పాలసీ అనేది లేదని వివరించారు. 2030 నాటికి 20,000 మెగావాట్లు, 2040 నాటికి 40 వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలిపారు. సౌర, పవన, గ్రీన్ హైడ్రోజన్ వంటి విభాగాల ద్వారా విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. గ్రీన్ పవర్ లో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు సింగిల్ విండో పద్ధతుల్లో అనుమతులు మంజూరు చేస్తున్నామన్నారు. స్టాంప్ డ్యూటీని రియంబర్స్‌మెంట్ చేస్తున్నామని, నాలా కన్వర్షన్ కూడా సులభతరం చేశామని తెలిపారు.
రాష్ట్రంలో రోజురోజుకు విద్యుత్తు డిమాండ్ ఊహించిన రీతిలో పెరిగి పోతోందని, దానిని అందుకునేందుకు ప్రభుత్వ ఖాళి భూముల్లో, దేవాదాయ శాఖ ఖాళీ భూముల్లో, సాగునీటి శాఖలో సోలార్, ఫ్లోటింగ్ సోలార్ ద్వారా గ్రీన్ పవర్ ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలిపారు.
స్వయం సహాయక సంఘాల మహిళలతో వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి జెన్‌కోతో ఎంఓయూ కుదుర్చుకున్నామని వివరించారు. ప్రభుత్వ ఖాళీ భూములను స్వయం సహాయక సంఘాల మహిళలకు లీజుకు ఇచ్చి పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహిస్తున్నామన్నారు. మహిళ సంఘాలు ఉత్పత్తి చేసిన విద్యుత్తును రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఈ రంగాల్లో యువతను ప్రోత్సహిస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలు రానివారు బ్యాంకుల సహకారంతో స్వయం ఉపాధికి గ్రీన్ పవర్‌ను ఉత్పత్తి చేసేందుకు అవకాశం ఉందన్నారు.
రాష్ట్రంలోనే కాదు.. దేశంలో ఎక్కడ గ్రీన్ పవర్ ఉన్నా అంది పుచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అందులో భాగంగా ఇటీవల రాజస్థాన్ ప్రభుత్వంతో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఒప్పందాలు చేసుకున్నామని తెలిపారు.
రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు రిజిస్ట్రేషన్‌లో టాక్స్ ఫ్రీ చేశామని ఫలితంగా రాష్ట్రంలో ఎలక్ట్రికల్ వాహనాల విక్రయాలు పెరిగాయని వివరించారు.
దావోస్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుల పర్యటనతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు మన రాష్ట్రానికి వచ్చారన్నారు. వాళ్లంతా క్షేత్రస్థాయిలో సర్వే చేసుకుంటున్నారని, సర్వే పూర్తయ్యాక రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8,938 మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి జరుగుతుందని 2040 నాటికి 40 వేల మెగావాట్లు మన రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తామని తెలిపారు.
దూర ప్రయాణం చేసే వారిని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా ముందుకు వస్తే ఎలక్ట్రికల్ చార్జింగ్ స్టేషన్ లు పెట్టుకునేందుకు అన్ని అనుమతులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు.
తీవ్రమైన వాతావరణ కాలుష్యం మూలంగా ఢిల్లీ పట్టణ ప్రజలు ఒక సీజన్‌లో మూడు నెలల పాటు వలస వెళ్లిపోతున్నారని, ఆ పరిస్థితి హైదరాబాద్‌కు రాకుండా చూడాలని ఎలక్ట్రికల్, బ్యాటరీ బేస్డ్ బస్సులు ప్రవేశ పెడుతూ, డీజిల్ బస్సులను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నామని భట్టి విక్రమార్క వివరించారు. హైదరాబాద్ సిటీలో కొత్తగా డీజిల్ ఆటోలకు అనుమతి ఇవ్వడం లేదన్నారు. బ్యాటరీతో నడిచే ఆటోలను ప్రోత్సహిస్తున్నామని వివరించారు. కాలుష్య కారక వాహనాలను నగరం నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వెలుపలకు తరలించాలని ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలిపారు.
గ్రీన్ పవర్ పాలసీకి సంబంధించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కోరితే ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. రాష్ట్రం కొత్తగా తీసుకువచ్చిన గ్రీన్ పవర్ పాలసీకి సంబంధించిన పూర్తి సమాచారం ఆన్‌లైన్‌లో ఉందని వివరించారు.