22 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

కుమారులను హత్యచేసి… తాను ఆత్మహత్య చేసుకుని…

  • కాళ్లూ చేతులూ కట్టేసి.. తలలు బకెట్లలో ముంచేసి
  • ఇద్దరు కుమారులను చంపేసిన.. తండ్రి ఉరి వేసుకొని ఆత్మహత్య
  • పిల్లలు పోటీ ప్రపంచంలో రాణించలేకపోతున్నారని సూసైడ్‌ నోట్‌

కిండర్‌ గార్డెన్‌ చదివే వయసులో ఉన్న కుమారులు చదువుల్లో రాణించలేకపోతున్నారని వారిని అత్యంత కిరాతకంగా హత్యచేసి తానూ ఉరిపెట్టుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కాకినాడ నగరంలో జరిగింది. హోలీ పండుగ రోజు జరిగిన ఈ క్రూరమైన సంఘటన కాకినాడ సుబ్బారావు నగర్‌ పరిసరాల్లో తీవ్ర విషాదం నింపింది. పిల్లలకు విద్యా, బుద్దులు నేర్పించి, జీవన గమనాల్లో తోడుండాల్సిన తండ్రే ఈ విధంగా పసి వయసులో ఉన్న తన కుమారులను దారుణంగా చంపడం కాకినాడ వాసులను కలచి వేసింది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడానికి చెందిన వానపల్లి చంద్రకిశోర్‌ అనే వ్యక్తి కాకినాడ జిల్లా వాకలపూడి ఓఎన్‌జీసీ కార్యాలయంలో ఎకౌంట్స్‌ అసిస్టెంట్‌ గా పని చేస్తున్నాడు. కాకినాడలోని ఓ ఆపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న చంద్రకిశోర్‌కి భార్య తనూజ, జోషిల్‌, నిఖిల్‌ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు ఒకటో తరగతి చదువుతుండగా రెండో కుమారుడు యూకేజీ చదువుతున్నాడు. వారిద్దరూ సరిగ్గా చదవడం లేదని ఇటీవలే స్కూలు కూడా మార్చాడు చంద్రకిశోర్‌.

అయితే తన కుమారులిద్దరూ సరిగ్గా చదవడం లేదనే ఆలోచనల్లో తీవ్రంగా మదన పడుతున్న చంద్రకిశోర్‌ హోలీ రోజు భార్యా, పిల్లలను తీసుకుని హోలీ ఆడటానికి తన కార్యాలయానికి తీసుకువెళ్ళాడు. అక్కడ భార్యను ఉండమని పిల్లలిద్దర్నీ టైలర్‌ దగ్గరకు తీసుకువెళ్లి యూనిఫామ్‌ కి కొలతలు ఇప్పించి పది నిమిషాల్లో వస్తానని నమ్మబలికి కుమారులిద్దరినీ తీసుకు వెళ్లాడు. ఎంతకీ భర్తా పిల్లలు రాకపోవడం, ఫోన్‌ కూడా ఎత్తక పోవడంతో తనూజ భర్త సహ ఉద్యోగులను తీసుకుని ఇంటికి వెళ్ళి బలవంతంగా తలుపులు తెరిచి చూడగా చంద్రకిశోర్‌ ఫ్యానుకి ఉరివేసుకుని మృతి చెందిఉన్నాడు. ఇక పిల్లలు ఇద్దరూ కాళ్ళూ చేతులు తాళ్ళతో కట్టివేయబడి నీళ్ళు నిండా ఉన్న బకెట్లో తలలు మునిగి ఉన్నారు. ఈ ఘోరమైన దృశ్యాలు చూసిన తనూజ అక్కడే కుప్పకూలిపోయారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో తన పిల్లలు పోటీ పడలేక పోతున్నారని, వారికి భవిష్యత్తు లేదని, అందుకే ఇద్దరు పిల్లలను చంపి తాను కూడా చనిపోతున్నానని చంద్రకిశోర్‌ సూసైడ్‌ నోటులో రాసినట్లు పోలీసులు తెలిపారు. అయితే తన తమ్ముడికి ఆర్థిక ఇబ్బందులేమీ లేవని, ఆస్తులు ఉన్నాయని, ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని మృతుడి సోదరుడు వాపోయారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com