ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు, జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయానికి జనసేన కార్యకర్తలు, నాయకులే కారణమన్నారు. ఎవరైనా పవన్ కల్యాణ్ విజయానికి తామే కారణమని అనుకుంటే వాళ్ల ఖర్మ అని తీవ్రస్థాయిలో నొక్కి చెప్పారు.
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురం చిత్రాడలో జరిగిన జనసేన జయకేతనం సభలో మాట్లాడుతూ నాగబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం టీడీపీ ఇన్‌చార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మపైనే పరోక్షంగా నాగబాబు ఈ విధంగా వ్యాఖ్యానించారని అందరికీ అర్థమయ్యింది. గతంలో రామ్ గోపాల్ వర్మ – ఖర్మ అంటూ తనకు తానే విమర్శించుకోవడం అందరికీ తెలిసిందే. ఇప్పుడు నాగబాబు వాళ్ల ఖర్మ అనడం వెనుక పిఠాపురం వర్మనే అని టీడీపీ వర్గాలే కాదు.. జనసేన కార్యకర్తలు కూడా చర్చించుకున్నారు. ఏకంగా సభా వేదికపైఉన్నవాళ్ల మధ్య కూడా ఇదే చర్చ జరిగింది.
పిఠాపురంలో టీడీపీ అభ్యర్థి వర్మ కాకుండా.. పొత్తులో భాగంగా జనసేన నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేశారు. అయితే, ఆ సమయంలోనే టీడీపీ శ్రేణులు ఆగ్రహానికి గురయ్యాయి. అయితే, టీడీపీ వర్గాలకు వర్మనే నచ్చజెప్పి పవన్ కల్యాణ్‌కు సపోర్ట్ చేశారు. పవన్ కల్యాణ్ గెలుపు నల్లేరుమీద నడక అయ్యేందుకు కారణం వర్మనే అని పిఠాపురంలో కూడా చెప్పుకుంటున్నారు. అయితే, వర్మ ఈ ప్రచారం చేసుకుంటున్నారన్న ఉద్దేశ్యంతోనే నాగబాబు నీ ఖర్మ అంటూ వర్మ ముఖం మీదే చెప్పినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే, నాగబాబు అంతటితో ఆగకుండా.. ఎన్నికల సమయంలో పిఠాపురంలో ప్రచారానికి తనను, మిత్రుడు అజయ్‌కుమార్ తదితరుల్ని పవన్ కల్యాణ్ పంపాడని చెప్పారు. అయితే పిఠాపురంలో రాజకీయ వాతావరణం చూస్తే, విజయం ఖాయమైనట్టు అప్పుడే కనిపించిందన్నారు. కానీ, చంద్రునికో నూలుపోగులా పవన్‌కల్యాణ్ విజయంలో తమను భాగస్వామ్యం చేశారని నాగబాబు వ్యాఖ్యానించారు.
నాగబాబు ప్రసంగంలో పవన్ కల్యాణ్ గెలుపునకు కారకులైన వాళ్లలో కనీసం టీడీపీ శ్రేణులను కూడా కలపలేదు నాగబాబు. పైగా.. వర్మది ఖర్మ అన్నట్లు మాట్లాడారు. అంటే.. నాగబాబు ఉద్దేశ్య పూర్వకంగానే ఇలా మాట్లాడారన్న చర్చ నడుస్తోంది. అంత పెద్ద సభలో.. నాగబాబు.. తెలుగుదేశం పార్టీని అవమానించేలా మాట్లాడారన్న అభిప్రాయం వినిపిస్తోంది. పిఠాపురంలో టీడీపీ, జనసేన మధ్య అంతర్గతంగా ఉన్న విభేదాలకు నాగబాబు వ్యాఖ్యలు నిదర్శనంగా నిలిచాయంటున్నారు.