డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక టారీఫ్‌ల పేరుతో ప్రపంచ దేశాలను వణికిస్తున్నాడు. పెద్దన్నగా చెప్పుకునే ట్రంప్ మూడో ప్రపంచ దేశాలకు చేసే సాయాన్ని నిలిపివేశాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం(UNDP) తదితర సంస్థలకు సాయంలో కోత విధిస్తున్నాడు. దీంతో వివిధ దేశాల్లో అమెరికా అంటే ఏవగింపు పెరుగుతోంది. అమెరికా ఉత్పత్తులను కొనుగోలు చేయొద్దని పిలుపు ఇస్తున్నారు. ప్రస్తుతం బాయ్‌కాట్ అమెరికా నినాదం వివిధ దేశాల్లో ట్రెండింగ్‌లో ఉంది.
డెన్మార్క్‌కు చెందిన పాక్షిక స్వయం ప్రతిపత్తి ప్రాంతం గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకోవాలన్న ట్రంప్ ప్రయత్నాలు కూడా ఈ వ్యతిరేకతకు ఒక కారణంగా చెప్పవచ్చు. డెన్మార్క్‌కు చెందిన ఫేస్‌బుక్ గ్రూపులో దాదాపు 73,000 మంది సభ్యులు ఉండగా లగ్జెంబర్గ్ తర్వాత అత్యధిక సెర్చ్‌లు ఈ పేజీకే ఉన్నాయి. గూగుల్‌లో బాయ్‌కాట్ అమెరికా కోసం అత్యధికంగా సెర్చ్‌లు జరుగుతున్న దేశాలలో స్వీడన్ నాలుగవ స్థానంలో ఉంది.
అమెరికా వస్తువులకు వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు అత్యుత్తమ సాధనంగా ఫేస్‌బుక్ పేజ్ ఉపయోగపడుతోంది. బాయ్‌కాట్ అమెరికా: బై ఫ్రెంచ్ అండ్ యూరోపియన్ పేరిట ఫ్రాన్స్ నిర్వహిస్తున్న ఫేస్‌బుక్ పేజీ 20,000 మంది సభ్యులతో గూగుల్ సెర్చెస్‌లో 3వ స్థానంలో ఉంది. కెనడా ఇప్పుడు బాయ్‌కాట్ అమెరికా ప్రచారంలో ముందు వరుసలో ఉంది. గూగుల్ సెర్చెస్‌లో 5వ స్థానంలో నిలిచింది.
చైనాలో ఇప్పటికే అమెరికా వస్తువులను బహిష్కరించటం మొదలైంది. మెక్సికలో అసంతృప్తి సెగలు మొదలయ్యాయి. భారత్ మీద విధించే సుంకాల తీరు పరిశీలించాక స్పందించాలనేది ఇక్కడి పార్టీలు వేచి చూస్తున్నాయి. అమెరికా ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా కెనడా, యూరోప్, జపాన్ ఉత్పత్తులను వాడాలనే డిమాండ్ పెరుగుతోంది.
అమెరికా ఏకచత్రాధిపత్యానికి ముగింపు పలికే రోజు దగ్గరలోనే ఉన్నట్టుగా కనిపిస్తోంది. బాయ్‌కాట్ అమెరికా నినాదానికి ఆ దేశానికే చెందిన గూగుల్, ఫేస్‌బుక్, ఎక్స్ తదితర సోషల్ మీడియా వేదికలను వాడుకోవడం విశేషం.