- రీల్స్ పిచ్చలో కెరీర్, డబ్బు చివరికి ప్రాణాలు కోల్పోతున్న యువత
- కంటెంట్ పై నో కంట్రోల్
- ఎలా పడితే అలా.. ఏది పడితే అది…
- ఫ్యాషన్, వైవిధ్యం పేరుతో వెర్రితలలు.
- యూత్ ను ఊపేస్తున్న సోషల్ మీడియా ప్రభావం
- మంచికి, చెడుకీ, అన్నింటికీ అదే
- నేరమయ జీవితాలకి పునాదులుగా సోషల్ మీడియా
- నేటి తరం అనుభవిస్తున్న భావదారిద్రం ఇదేనా..
బీహార్‌కు చెందిన సుభాష్ శర్మ..ఇప్పుడు ఉరిశిక్ష బారిన పడ్డాడు. ఈ సుపారీ కిల్లర్ 13 ఏళ్ల వయసు నుంచే ఇలా డబ్బులకు హత్య చేసిపెట్టే ఒక పనిని ఎంచుకుని అందులో స్థిరపడ్డాడు. ఇతగాడికి ఉరిశిక్ష పడటం వెనక కారణం ఒక కుల దురహంకార హత్యలో ప్రధాన నిందితుడు కావడమే. నల్గొండకు చెందిన ప్రణయ్, అమృత అందరికీ గుర్తుండే ఉంటారు. ప్రేమ పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన కూతురిని వెనక్కు తెచ్చుకోడానికి కక్షకట్టిన తండ్రి చేయించిన దారుణం. సొంత అల్లుడిని అత్యంత దారుణంగా సుపారీ ఇచ్చి మరీ చంపించడం. ఆ పని చేసి పెట్టినది సుభాష్ శర్మ కావడం. నిజానికి రేపటి తరం ఇలా డబ్బు సంపాదనకు అత్యంత ప్రమాదకరమైన మార్గాలను ఎంచుకోవడం సమాజంలో పెరుగుతున్న పెడ ధోరణులను సూచిస్తున్నాయి. ఇవేకాదు చదువు చట్టుబండలు లేకుండా కొందరు జులాయిలుగా మారుతుంటే, చదువుకున్నయువత కూడా డ్రగ్ బిజినెస్ లు గుట్టుగా గంజాయి వ్యాపారాలు చేసుకుంటున్నాయి. ఇది ఎంతలా పెచ్చరిల్లిందంటే గతంలో హైదరాబాద్ నగరంలోనే ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గంజాయి మొక్కలను మామూలుగా తన ఇంట్లో సంప్రదాయ మొక్కల్లా కుండీల్లో పెంచి అమ్ముతుండటం షాక్ కు గురి చేసింది. టెకీలు కూడా చివరకు డబ్బుల వేటలో ఇలా నైతిక నియమాలకు తిలోదకాలిచ్చి నీచమైన పనులకు పాల్పడుతున్నారు.
డబ్బు సంపాదనకు ఒక్కొక్కరిదీ ఒక్కో మార్గం. చాలామందికి నేడు సోషల్ మీడియా డబ్బు సంపాదనా మార్గం. కానీ ఇది ఒరవడి మారిపోయి వికృతాల కేంద్రంగా డేంజరస్ యావగేషన్ గా మారిపోయింది.
ఇలా వచ్చి.. అలా మాయమై..
డబ్బు సంపాదనకు ఒక్కో తరం ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటోంది. అందుబాటులో ఉన్న టెక్నాలజీ, డిమాండ్ ను బట్టి ఒక్కోతరానిది ఒక్కోతీరు. సినిమా ఇండస్ట్రీనే తీసుకుంటే కొందరు రెండు, మూడు సినిమాలలో హీరోగా చేసి ఫేడ్ అవుట్ అయిపోతుంటే.. మరికొందరు లాంగివిటీ ఉన్న రోల్స్ ను ఎంచుకుంటూ జాగ్రత్తగా అడుగులేస్తున్నారు. అప్పుడప్పుడే సినిమాల్లో ట్రై చేస్తున్న కుర్ర హీరోలవి ఇలాంటి అనుభవాలే. వరుస హిట్ లు కొడుతూ వెనక్కు తిరిగి చూడాల్సిన అవసరం లేని హీరోలెవరూ నేడు లేరు. ఒకళ్లిద్దరు కెరీర్ ను చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ ముందుకెడుతున్నారు. అందుకే సినిమా ఇండస్ట్రీకి బదులు ప్రత్యామ్నాయ దారులు వెతుక్కుంటున్నారు. ఉదయ్ కిరణ్ బాగా రాణిస్తున్నటైమ్ లోనే సూసైడ్ చేసుకున్నాడు. అతని ఆత్మహత్యకు కారణాలనేకం. అందులో ఒకటి అవకాశాలు కొంచెం తగ్గడం, సరైన మనీ బ్యాకింగ్ లేకపోవడం. ఇక హీరో రాజశేఖర్ అంకుశం లాంటి సినిమాలతో తనదైన ముద్ర కనపరిచారు. కానీ ఆ తర్వాత అవకాశాలు తగ్గిపోయాయి. ఇక్కడ డబ్బు సమస్య కాదు.. ఇండస్ట్రీలో ఫేమ్ ఫేడవుట్ అయిపోవడం. మూస సినిమాలు జనం ఆదరించకపోవడం. ఇలా అన్నీ ఉన్న అగ్రహీరోలే దెబ్బ తినేసి మానసికంగా బలహీనపడుతున్నారు. అగ్ర హీరోల తీరు ఇలా తడబడుతుంటే కుర్ర హీరోలు కొందరు మాత్రం కాస్త రాణిస్తున్నారు. అందుకు కారణం బిగ్ బడ్జెట్ మూవీస్ కోసం వేచి చూడకుండా.. మిడిల్ క్లాస్ బడ్జెట్ మూవీస్ చేసేందుకు సిద్ధపడుతున్నారు. అలా తరం మారుతోంది. ఇలియానా, కమలిని,సోనాలీబింద్రే లాంటి తారలు చాలా త్వరగా ఫేడవుట్ అయిపోయారు.
సినిమాల్లో ఫేడవుట్ అవుతున్న తారలంతా చేస్తున్న బిజినెస్ సొంత యూ ట్యూబ్ ఛానెళ్లు పెట్టుకోడం, లేదా ఫుడ్ బిజినెస్ లోకి దిగడం.. ఎందులో ఉన్నా.. దాని పబ్లిసిటీకి ఒక సొంత ఛానెల్ ఉండాలి కాబట్టి ఫుడ్ బిజినెస్ రాణించడానికి కూడా కొందరు సొంతంగా యూ ట్యూబ్ ఛానెళ్లు పెడుతున్నారు. ఈ అగ్ర తారల అవకాశాలే అంతంత మాత్రంగా ఉన్నాయి.
అందరూ 18 ఏళ్ల నుంచి 30ఏళ్ల మధ్య వయస్కులు.. డబ్బు, పరపతి లేని వారంతా సోషల్ మీడియాలో ముందు పాపులర్ అయ్యాకే వెండి తెరకి, లేదా బుల్లి తెరకి ఎక్కుతున్నారు.. వారి తాహతును బట్టి, వారి వారి సామర్ధ్యాలను బట్టి..ఇలా ఫేడవుట్ అవుతున్న వారికి, కొత్తగా ఎమర్జ్ అవుతున్న వారికి కూడా సోషల్ మీడియానే వేదికగా మారుతోంది.
ఓ తరం పైకి రావాలన్నా.. ఉన్న పేరు పోవాలన్నా సోషల్ మీడియాలే వేదికలవుతున్నాయి. దుష్ప్రచారానికి, తాహతును మించి ప్రమోషన్ కి కూడా.. చిన్న స్థాయి తారల్లా మెరిసిపోడానికి.. లేదా నటులవ్వాలన్న తమ మెరుపు కలలు తీరే అవకాశం లేని వారికి ఈ మీడియా వరంగా మారుతోంది. ఎంతమంది ఈ మధ్య కాలంలో సినిమా పాటలకి స్టెప్పులేసి రీల్స్ చేసి ఇన్ స్టా లో పెడుతున్నారో లెక్కే లేదు. ఫేస్ బుక్, వాట్సప్, ట్విట్టర్ లాంటి మాధ్యమాల స్థాయి దాటిపోయి ఇప్పడు ఇన్ స్టా గ్రామ్ అందరికీ బ్రహ్మాండమైన వరం లా మారింది. ఊరు పేరు లేని వారు సైతం ఒక అక్కౌంట్ ని మెయిన్ టెయిన్ చేయడం.. తమకు వచ్చిన విద్యను ప్రదర్శించి పాపులర్ కావాలని చూడటం కామన్ అయిపోయింది. వినీలాకాశంలో తారల్లా మెరిసిపోవాలని భావించే అమ్మాయిలకి రీల్స్ పెద్ద ఆయుధం..ఇక మరికొందరు పైట జారుస్తూ.. విపరీత హావభావాలు ప్రదర్శిస్తూ రీల్స్ చేసి వదులుతున్నారు. తమ టాలెంట్ ను చూసిన దర్శకులెవరైనా అవకాశాలు ఇవ్వకపోతారా అని.. అంతెందుకు మొన్నటి మహాకుంభమేళాలో మెరిసిన మోనాలీసా అలాంటి బాపతే.
ఈతరం తెగులు ఇదేనా?
కానీ సాధారణ వ్యక్తులు సైతం పాపులర్ అవడానికి బ్రహ్మాస్త్రాలుగా భావించే ఈ సోషల్ మీడియా వేదికలు అందరికీ మేలు చేస్తున్నాయా? వారంతా పాపులర్ అయి, సొమ్ము సంపాదించుకుంటున్నారా అంటే నిస్సందేహంగా కాదు. అగ్ర తారలనో, తమకిష్టమైన వారివో వీడియోలు, రీల్స్ లేదా ఇతర కంటెంట్ చూసి మక్కీకి మక్కీ కాపీ కొట్టి పాపులర్ అవ్వాలని ప్రయత్నించి భంగ పడిన వారే ఎక్కువ..
మినిమం ఫార్ములా పై నో నాలెడ్జ్
సక్సెస్ అందరికీ సులభంగా రాదు. ప్రతీ వ్యక్తికీ ఒక హిడెన్ టాలెంట్.. దానిని అలవోకగా బయటపెట్టడం, అందంగా చెప్పగలగడం, అర్ధవంతంగా, ఆకర్షణీయంగా కంటెంట్ వేగంగా, సూటిగా చెప్పగలగడం ఇవన్నీ కూడా మినిమం వ్యూస్ సాధించడానికి సోపానాలు. అలా అని బాగా చెప్పిన అందరినీ జనం ఆదరిస్తారని కాదు. చెప్పే కంటెంట్ లో వైవిధ్యం ఉండాలి. చూసిన వ్యూయర్ దానిని ఒక్క క్లిక్ లోనే తనకు తెలియని, లేదా నచ్చిన, లేదా తనలో ఉన్న భావాలకు సరిగ్గా సరిపోయే విధంగా చెప్పారన్న నమ్మకం కలిగితేనే లైక్ చేయడం, సబ్ స్క్రైబ్ చేయడం చేస్తున్నారు.
మెజారిటీ యువత ఈ విషయం తెలియక ఇష్టాను సారం వీడియోలు చేసేసి అప్ లోడ్ చేసేస్తున్నారు. కొందరైతే మినిమం పట్టు తెలియకుండా అట్టహాసంగా కెమెరాలు, ఎడిటింగ్ పరికరాలు, కొనేసి సెటప్ పెట్టేస్తున్నారు. తీరా చేసిన ప్రయోగాలన్నీ అప్ సెట్ అయి అప్పులు మిగిలితే ఎక్కడలేని నిస్పృహ వస్తోంది. దాంతో నయానో, భయానో సాధించాలన్న పట్టుదలతో క్వాలిటీ లెస్ వీడియోలు, సభ్యత దిగజారి అంగాంగ ప్రదర్శనలు, బూతు వీడియోలు, బూతు సంభాషణలు రికార్డు చేయడం, నగ్న ప్రదర్శనలకు లైవ్ పెట్టడం లాంటివి చేసి డబ్బు సంపాదిస్తున్నారు. వీటికి తోడు నాణ్యత లేని, దిగజారుడు ప్రోగ్రాములు కూడా యువతను పెడదారి పట్టిస్తున్నాయి.ఒకడెవడో వెర్రి మొర్రి వేషాలు వేసి అప్ లోడ్ చేస్తే దానికి మిలియన్ వ్యూస్ రావడం.. దాంతో మరికొందరు దానికి తమ క్రియేటివిటీ జోడించి మరీ తెగబడటం ఇదీ నేటి తీరు. రీల్స్ చేస్తే కోట్లు గడించొచ్చన్నది ఒక తప్పుడు ఫార్ములా. అసలిలాంటి వాటిలో క్లిక్ అయ్యి నిలదొక్కుకున్న వారు మూడు, నాలుగు శాతానికి మించి లేరు.
విద్య తెలియకుండానే..
అసలు ఒక వీడియో నచ్చడానికి, బాగా ప్రమోట్ అవడానికి అందులో కంటెంట్ ,వీడియో, ఆడియో ఎస్సెన్స్, దానికి పెట్టిన థంబ్ నైల్, దానిని అప్ లోడ్ చేసిన టైమ్ ఇలా ఎన్నో అంశాలుంటాయి.ఆల్గరిథమ్ ఫాలో అవుతూ థంబ్ నైల్ క్లుప్తంగా, సంక్షిప్తంగా, సూటిగా, అట్రాక్టివ్ గా పెట్టాలన్న స్పృహ, కంటెంట్ లో వైవిధ్యం కావాలన్న స్పృహ ఈ తరానికి లేనే లేదు. అందుకే సోషల్ మీడియాలో నానా చెత్తా ప్రమోట్ అవుతోంది. చివరకు హత్యలు ఎలా చేయాలి? ఆత్మహత్యలు ఎలా చేసుకోవాలి అనే వీడియోలు కూడా రాబట్టే నేరాలు పెరుగుతున్నాయి. చంపడానికి, చంపి తప్పించుకోడానికి మార్గాలు కూడా అందులోనే ఉంటున్నాయి. నేరమయ జీవితాలకు ఈ సాధనాలే ప్రేరకంగా పనిచేస్తున్నాయి.
కరోనా కాటేసింది..
కరోనా కాలంలో లోనే ఈ వికృతాలకు బీజం పడింది. ఇల్లు కదిలే వీలులేదు. కాలక్షేపం కావాలి.. తన వీడియోలు నలుగురూ చూడాలి. యూ ట్యూబ్ నుంచి సిల్వర్ బటన్లు, డబ్బులు వస్తాయి అన్న నాలెడ్జి పెరిగి అది వేలం వెర్రిగా మారింది. ఎంతలా అంటే చిన్నపిల్లలు కూడా ఏదో ఒక విద్యను ప్రదర్శిస్తూ వీడియోలు అప్ లోడ్ చేస్తున్నారు.చదువు, సంధ్యా లేదు. సంపాదనా మార్గం దొరికిందిగా… ఇక చదువు అవసరమేముంది అనుకుంటున్నారు.చివరకు ఇందులో పోటీ పెరిగి వ్యూస్, సబ్ స్క్రైబర్లను సాధించే క్రమంలో విలువల, వలువలు గాలికొదిలేస్తున్నారు.ఏది పడితే అది ఎలా పడితే అలా.. ఒళ్లమ్ముకోడం దగ్గర నుంచి, డార్క్ కంటెంట్ పేరుతో, హాస్య ప్రోగ్రామ్ పేరుతో బూతుల వీడియోల వరకూ తెగబడిపోతున్నారు.అశ్లీలం,బూతు సాహిత్యం పరమ రొటీన్ అయిపోయాయి.