తెలంగాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ ఆహ్వానం పలికారు. లోక్‌సభ నియోజక వర్గాల పునర్విభజనకు సంబంధించి.. చోటు చేసుకునే పరిణామాలపై చర్చించేందుకు, వాటిల్లబోయే నష్టాలను నివారించేందుకు ఏం చేయాలో మాట్లాడుకునేందుకు ఉద్దేశించిన అఖిల పక్ష సమావేశానికి హాజరు కావాలంటూ తమిళ నాడు సీఎం స్టాలిన్ ఆహ్వానం పంపించారు.
న్యూఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తమిళనాడు ముఖ్యమంత్రి తరపున మంత్రి టి.కె.నెహ్రూ నేతృత్వంలోని డీఎంకే ప్రతినిధి బృందం మర్యాద పూర్వకంగా కలిసింది. తమ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ పంపించిన ఆహ్వాన పత్రాన్ని రేవంత్ రెడ్డికి అందించింది. ఈ సందర్భంగా డీఎంకే ప్రతినిధి బృందం సీఎం రేవంత్‌ను సత్కరించింది. రేవంత్ రెడ్డి కూడా తమిళనాడు మంత్రి నెహ్రూను సత్కరించారు.
ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలకు లోక్‌సభ నియోజక వర్గాల పునర్విభజనతో కనిపించని నష్టం జరుగుతుందనేది స్టాలిన్ వాదన. కేంద్రం పిలుపుతో కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా అమలు చేశాయి దక్షిణాది రాష్ట్రాలు. దీంతో ఉత్తర భారతంతో పోల్చుకుంటే.. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తక్కువగా ఉంది. ఇప్పుడు లోక్‌సభ నియోజక వర్గాల పునర్విభజనలో తీవ్రంగా నష్టపోతామని స్టాలిన్ మాత్రమే కాదు.. దక్షిణ భారత రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలన్నీ అంగీకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దక్షిణ భారత దేశం తరపున కార్యాచరణ రూపొందించేందుకు, లేదంటే.. నియోజక వర్గాల పునర్విభజన జనాభా ప్రాతిపదికన చేయొద్దంటూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చే లక్ష్యంతో స్టాలిన్ దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈనెల 22వ తేదీన చెన్నైలో ఈ సమావేశం జరుగుతుంది.