తెలంగాణ స్పెషల్ పోలీస్ 17వ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్‌గా పనిచేస్తున్న తోట గంగారాం (58) లిఫ్ట్ ప్రమాదంలో గాయపడి మృతి చెందారు. అయన గతంలో తెలంగాణ సచివాలయానికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఓ అపార్ట్ మెంట్‌లో సోమవారం అర్ధరాత్రి డిన్నర్ చేశారు.
అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు లిఫ్ట్ వద్ద కొద్దిసేపు వెయిట్ చేశారు. ఏదో సౌండ్ రావడంతో లిఫ్ట్ వచ్చిందనుకొన్నారు గంగారాం. లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసి లోపలికి అడుగు పెట్టారు. దీంతో, లిఫ్ట్ రాకముందే కింద పడ్డారు. తీవ్ర గాయాలపాలైన ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రిలో ఆయనను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే గంగారాం చనిపోయారని నిర్ధారించారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సిద్దులం గ్రామానికి చెందిన గంగారామ్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. గంగారాం మృతితో పోలీస్ శాఖలో విషాదం నెలకొంది. ఆయన మరణ వార్త తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.