హైదరాబాద్‌లో ఓ మహిళ తన భర్త సెల్‌లో వీడియో కాల్ మాట్లాడి.. కాశీకి వెళ్లిపోయింది. తన అనారోగ్యం కారణంగా కాశీకి వెళ్లి చనిపోతానంటూ పేర్కొంది. దీంతో, భర్తతో పాటు.. కుటుంబసభ్యులు తీవ్రంగా ఆందోళన చెందుతుండగా.. పోలీసులకు ఈ కేసు సవాల్‌గా మారింది. మహిళా దినోత్సవం నాడే.. బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈసంఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. పోలీసులు వివరాలు బయటకు చెప్పకుండా గోప్యత పాటించారు.
‘నాకు క్యాన్సర్ ఉంది. నేను ఎలాగూ కోలుకోలేను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలచుకోలేదు. అందుకే నేను కాశీకి వెళ్లి తనువు చాలించాలని అనుకుంటున్నా. నాకోసం వెతక్కండి. బాబును స్కూలు వద్ద దింపి వెళ్తున్నా…’ అంటూ భర్తకు వీడియో కాల్‌లో చెప్పింది ఆ మహిళ. అప్పటినుంచి ఆమె అదృశ్యమయ్యింది.
బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బాల్‌రెడ్డినగర్‌లో నివసించే ధన్యాకుల రమేష్‌బాబు, ఉమారాణి దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. ఉమారాణి కొంత కాలం నుంచి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. చాలా రోజుల నుంచి క్యాన్సర్‌కు చికిత్స చేయించుకున్నప్పటికీ వ్యాధి నయం కావడం లేదు. దీంతో, కలత చెందిన ఉమారాణి తన భర్తను కష్ట పెట్టకూడదని డిసైడ్ అయ్యింది. సరిగ్గా మహిళా దినోత్సవం రోజే.. తమ కుమారుడిని స్కూలులో దింపి కఠిన మైన నిర్ణయం తీసుకుంది.
కుమారుడిని స్కూల్‌లో దింపేస్తానని సెల్‌ఫోన్ తీసుకొని వెళ్లింది. ఇక, తిరిగి రాలేదు. చాలా సేపటి వరకు ఉమారాణి కోసం ఎదురుచూసిన భర్త.. తాను కిరాణా షాపుకు వెళ్లి ఉంటుందని భావించి ఆఫీసుకు లేట్ అవుతుండటంతో ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. అయితే మధ్యాహ్నం సరిగ్గా 12.47 గంటలకు భర్తకు వీడియో కాల్ చేసింది ఉమారాణి. ‘నా అనారోగ్యం కారణంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని నిర్ణయించుకున్నాను. నేను తనువు చాలించాలనుకుంటున్నాను. కాశీకి వెళుతున్నా.. నాకోసం వెతకొద్దు..’ అంటూ 3 నిముషాలు మాట్లాడి సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. ఆ వెంటనే పలు చోట్ల వెతికినా ఆమె ఆచూకీ తెలియక పోవడంతో రమేష్ బాబు బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా.. ఉమారాణి సెల్‌ఫోన్ నెట్‌వర్క్ ఆధారంగా బాలానగర్ పోలీసులు కాశీకి వెళ్లారు. అక్కడి పోలీసులతో కలిసి ఆమె కోసం వెతుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఉమారాణి సెల్ నెట్‌వర్క్ చివరిసారిగా కాశీ చూపించినప్పటికీ ఎటువంటి అఘాయిత్యం చేసుకుని ఉండదని భావిస్తున్నారు. మరెక్కడికైనా వెళ్లిందేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు.