ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసుల్లో నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై రాష్ట్రవ్యాప్తంగా పలు కేసులు నమోదు చేశారు. అయితే, ఈ కేసుల్లో పోసానికి బిగ్ రిలీఫ్ దొరికింది. గుంటూరు జిల్లా నరసరావుపేటలో పోసాని కృష్ణ మురళిపై నమోదైన కేసులో నరసరావుపేట కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ కోసం రూ.10 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.
అటు.. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెలో నమోదైన కేసులో కూడా వారం రోజుల క్రితమే పోసానికి కడప కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా, ప్రస్తుతం ఓబులవారిపల్లె, నరసరావుపేట పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో బెయిల్ లభించినా.. మరి కొన్ని కేసులో మాత్రం పోసాని కృష్ణ మురళి మరి కొన్ని రోజులు జైలులోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు బెయిల్ వచ్చింది రెండు కేసుల్లో మాత్రమే.. మరికొన్ని కేసుల్లోనూ పీటీ వారెంట్ పై ఆయన జైలులోనే ఉన్నారు.
పోసాని కృష్ణ మురళిపై రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 30 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో 16 కేసులు నమోదయ్యాయి. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కల్యాణ్‌లపై అసభ్యకర వ్యాఖ్యలు చేసారంటూ టీడీపీ, జనసేన కార్యకర్తలు చేసిన ఫిర్యాదుల మేరకు పోసానిపై పలు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో.. ఫిబ్రవరి 28వ తేదీన అన్నమయ్య జిల్లా పోలీసులు హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లి పోసానిని అరెస్ట్ చేశారు.