రెజ్లింగ్ అభిమానులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాపై సుమారు రెండేళ్లుగా ఉన్న సస్పెన్షన్ ఎత్తివేసింది. దేశీయ టోర్నమెంట్ల నిర్వహణ, అంతర్జాతీయ టోర్నమెంట్లకు జాతీయ జట్ల ఎంపికకు అవరోధాలు తొలగాయి. కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయంపై రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా హర్షం వ్యక్తం చేసింది.
WFIకి జరిగిన ఎన్నికల్లో సంజయ్ సింగ్ నేతృత్వంలోని ప్యానెల్ 2023 డిసెంబర్ 21న విజయం సాధించింది. సంజయ్ సింగ్ డబ్ల్యూఎఫ్‌ఐ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత అండర్-15, అండర్-20 జాతీయ పోటీలను ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. రెజ్లర్లు పోటీలకు సిద్ధమయ్యేందుకు సమయం ఇవ్వకుండా ప్రకటన వెలువరించిన కారణంగా కొత్త కార్యవర్గంపై వేటు వేసింది. విధివిధానాల అమలులో విఫలమైందని… తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందని 2023, డిసెంబర్ 24న క్రీడా శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దిద్దిబాటు చర్యలు తీసుకున్న కారణంగా డబ్ల్యూఎఫ్‌ఐపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని నిర్ణయించినట్లు క్రీడా మంత్రిత్వ శాఖ పేర్కొంది.