ఆంధ్ర ప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఒకటే చర్చ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో, టీడీపీ గ్రూపుల్లో నడుస్తోంది. అదేంటంటే.. కొడాలి నాని అరెస్ట్ ఎప్పుడు అనేది. అటు తెలుగు దేశం క్యాడర్‌తో పాటు.. ఇటు ప్రజల్లో కూడా ఇదే హాట్ టాపిక్ అవుతూ వచ్చింది. ఇదే రోల్‌లో వల్లభనేని వంశీ పేరు కూడా ఎక్కువగానే వినిపిస్తూ వచ్చింది. అయితే, గత నెలలో వల్లభ నేని వంశీని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వంశీ విజయవాడ సబ్ జైలులో ఉన్నారు. ఆ తర్వాత పది రోజుల క్రితం పోసాని కృష్ణమురళిని కూడా హైదరాబాద్‌లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక, అప్పటినుంచీ రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన పలు కేసులకు సంబంధించి పోసానిని వరుస బెట్టి విచారిస్తున్నారు.
అయితే, ఇప్పుడు కొడాలి నాని వంతు వస్తుందంటున్నారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు. కొడాలి నాని అరెస్ట్ ఎప్పుడంటూ టీడీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్, గ్రూపుల్లో పోస్టులతో హోరెత్తిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది నేతలు నోటికి ఎంత వస్తే అంతగా మాట్లాడారని టీడీపీ శ్రేణులు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. గత యేడాది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి.. పవర్‌లోకి వచ్చి దాదాపు యేడాది గడిచినా.. అరెస్టులు స్లోగా సాగుతున్నాయన్న చర్చ టీడీపీ వర్గాల్లో నడుస్తోంది. మరోవైపు.. అరెస్టుల పర్వం మొదలు కావడంతో.. పలువురు నేతలను అరెస్ట్ చేస్తుండటంతో ఎందుకొచ్చిన తంటా అని గతంలో ఇష్టం వచ్చినట్లు దూషణలు చేసిన వాళ్లు.. నోరు మెదపడం లేదు . అయితే, ఇప్పుడు వాళ్లంతా మౌనం దాల్చినప్పటికీ.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన వారిని అసలు వదిలిపెట్టొదని పసుపు పార్టీ క్యాడర్ అధిష్టానం మీద ఒత్తిడి తెస్తోంది. అయితే, టీడీపీ పెద్దలు మాత్రం.. డీటెయిల్స్ అన్నీ రెడ్ బుక్‌లో ఉన్నాయని, దాని ప్రకారమే అంతా జరిగిపోతుందని బుజ్జగిస్తున్నారట. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. ఆయన ఇప్పుడు జైలులో ఉన్నారు. ఆయన మీద బలమైన సెక్షన్లతో కేసులు పెట్టారు. బెయిల్ రావడానికి చాలా సమయం పడుతుందని న్యాయ నిపుణులే చెబుతున్నారు. ఇక, పోసాని కృష్ణమురళి విషయంలోనూ ఇదే పరిస్థితి ఉంది. పోసానిని రాష్ట్రంలోని ఆయా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్ప్పుతున్నారు. కేసులు కూడా లెక్కకు మిక్కిలి నమోదయ్యాయి.
ఇక వీళ్లిద్దరి తర్వాత అరెస్ట్ జాబితాలో ఎవరున్నారంటే.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్‌గా పేరున్న మరో నాయకుడి పేరు కీలకంగా వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వేళ్లన్నీ మాజీ మంత్రి కొడాలి నాని వైపే చూపిస్తున్నాయి. అయితే, అసలు ఆయన ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికీ తెలియడం లేదంటున్నారు. వల్లభనేని వంశీని అరెస్టు చేసినప్పుడు విజయవాడ సబ్ జైలులో జగన్ ములాఖత్‌కు వెళ్తే ఆయనతో పాటు కొడాలి నాని కనిపించారు. ఇప్పుడు నాని మీద కూడా కేసులు నమోదు కావడానికి, అరెస్టు చేయడానికి సిద్ధం అవుతోందన్న చర్చ నడుస్తోంది. మరోవైపు.. కొడాలి నాని కూడా ఒకటి కాకపోతే ఎన్ని కేసులైనా పెట్టుకోనివ్వండి అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారు. అయితే, బయటికి చూడ్డానికి గంభీరంగా కనిపించినప్పటికీ.. కొడాలి నానిని కూడా అరెస్ట్ భయం వెంటాడుతోందని చెబుతున్నారు. తర్వాత తననే అరెస్ట్ చేస్తారని కొడాలి నాని కూడా మానసికంగా సిద్ధమయ్యారని చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎలాగూ అరెస్ట్ తప్పదనే.. నాని తన వాయిస్‌లో బేస్ పెంచారని కూడా అంటున్నారు. కొడాలి నానిని రెండు రకాలుగా రౌండప్ చేస్తారన్న టాక్ వినిపిస్తోంది. అవినీతి కేసులతో పాటు చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అంశాల మీదే కేసులు పెడతారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చంద్రబాబు, లోకేశ్ కుటుంబాన్ని వ్యక్తిగతంగా తిట్టారని విశాఖ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కొడాలి నాని మీద కేసు నమోదయ్యింది. ఆ కేసు లింక్‌తో ఒక దాని తర్వాత ఒకటి అన్నట్లుగా పీటీ వారెంట్లు ఇస్తూ పోతే నాని కూడా ఇబ్బందులు ఫేస్ చేయకతప్పదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో యువగళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ మీద కొడాలి నాని హాట్ కామెంట్స్ చేశారు. దాంతో కొడాలి మీద చర్యలకు టీడీపీ క్యాడర్ పట్టుబడుతుందట. అయితే సమయం చూసి నానిని కూడా అరెస్ట్ చేస్తారన్న విషయం అయితే బలంగా వినిపిస్తోంది.