బంగారం అక్రమ రవాణా కేసులో నటి రన్యా రావు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై కర్నాటక అసెంబ్లీలో రచ్చ రచ్చ జరిగింది. బంగారం అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడ్డ నటి రన్యా రావు వెనుక ఉన్న మంత్రి ఎవరనే అంశంపై తీవ్ర కలకలం చెలరేగింది. ఆమె వెనుక ఉన్న కన్నడ మంత్రి ఎవరో బహిర్గతం చేయాలంటూ సభలోని బీజేపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. దీంతో, కొద్ది సేపు సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ కేసు గురించి తనకు ఎటువంటి సమాచారం లేదని హోంమంత్రి బదులివ్వడంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలుత నటి రన్యా రావు కేసులో, బంగారం స్మగ్లింగ్ చేయడం వెనుక ఆమెకు అండగా ఉన్న మంత్రి ఎవరు? అని బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ అసెంబ్లీలో ప్రశ్నను లేవనెత్తారు. దీంతో, మంత్రి పరమేశ్వర ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ, తనకు ఆ విషయం తెలియదని వ్యాఖ్యానించారు. దీంతో, ఒక్కసారిగా అసెంబ్లీలో వివాదం చెలరేగింది. అయితే, అసెంబ్లీలో ప్రభుత్వం ఈ విషయంపై ఆమె వెనుక ఉన్న మంత్రి గురించి వస్తున్న ఆరోఫణలపై క్లారిటీ ఇవ్వక పోయినప్పటికీ.. బంగారం అక్రమ రవాణా వ్యవహారంలో మాత్రం రన్యారావు వెనుక బడా నేత ఉన్నట్లు తెలుస్తోంది.
ఆదివారం ఈ కేసు వెనుక ఓ మంత్రి ఉన్నారంటూ భారతీయ జనతా పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపించారు. మరుసటి రోజు సోమవారం కూడా ఇదే అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తారు. దీంతో, సభలో గందరగోళం చోటు చేసుకుంది. అసెంబ్లీ జీరో అవర్ సందర్భంగా ఈ అంశాన్ని లేవనెత్తిన కర్కల బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్, బంగారం అక్రమ రవాణా కోసం పోలీసులే ప్రోటోకాల్ ఇచ్చారని అనుమానం వ్యక్తం చేశారు. దీని వెనుక ఉన్న కన్నడ మంత్రి ఎవరో ప్రభుత్వం చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. అయితే, హోంమంత్రి పరమేశ్వర్ దీనికి ప్రతి స్పందిస్తూ.. ఈ అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తుందని చెప్పారు. ఈ కేసు గురించి మీకు ఎంత తెలుసో, తమకూ అంతే తెలుసని వ్యాఖ్యానించారు. ఆ మంత్రి ఎవరో సీబీఐ కనుక్కోవాల్సి ఉంటుందని హోం మంత్రి వ్యాఖ్యానించారు. హోం మంత్రి సమాధానంతో సంతృప్తి చెందని సునీల్ కుమార్.. ఈ కేసును మీరే సీబీఐకి అప్పగించండి అంటూ డిమాండ్ చేశారు. అయితే, ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని మంత్రి పరమేశ్వర్ వెల్లడించారు. కానీ, బీజేపీ ఎమ్మెల్యే మాత్రం.. ఎవరినో రక్షించడానికి ఇదంతా జరుగుతుందంటూ తీవ్రంగా ఆరోపించారు. ఇక, స్పీకర్ ఖాదర్ జోక్యం చేసుకుని ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. అయితే, బంగారం అక్రమ రవాణా కేసులో రన్యా రావు వెనుక ఒక మంత్రి ఉండి బంగారం అక్రమ రవాణా చేయించారనే ఆరోపణలు కర్నాటక ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి.