30.6 C
Hyderabad
Thursday, June 4, 2026

Live Video

spot_img

చంద్రబాబుకు బీజేపీ చెక్‌ పెడుతోందా?

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీల కూటమి పాలన సాగిస్తోంది. అయితే, జాతీయ స్థాయిలో బీజేపీ లీడ్ కొనసాగుతున్నప్పటికీ, ఆంధ్ర ప్రదేశ్‌కు వచ్చే సరికి చంద్రబాబు ప్రభుత్వాన్ని లీడ్‌ చేస్తున్నారు. దీనికి రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీకి ఎక్కువ సీట్లు రావడం, మాజీ ముఖ్యమంత్రి కావడం వంటి అంశాలున్నాయి. అయితే, చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీ భజన చేస్తున్నప్పటికీ.. రాష్ట్రానికి వచ్చే సరికి బీజేపీకి అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న వాదనలున్నాయి. బీజేపీని రాష్ట్రంలో ఎదగకుండా ఆయనే అడ్డుపడుతున్నారన్న అభిప్రాయంలో బీజేపీ రాష్ట్ర శ్రేణులు ఉన్నాయి. కమలం జాతీయ నాయకత్వానికి కూడా ఇవే సంకేతాలు వెళ్తున్నాయని తెలుస్తోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ ఏపీ పొలిటికల్‌ ఎఫైర్స్‌పై దృష్టి పెట్టిందా? సమయం చూసి చంద్రబాబుకు చెక్‌ పెడుతోందా? ఏపీలో కూటమి సర్కారును తన కనుసన్నల్లో ఉంచుకునే ప్లాన్‌లో బీజేపీ అధిష్టానం ఉందా? సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం దేనికి సంకేతం? ఈ ప్రశ్నలు ఇప్పుడు ఏపీలో హాట్‌ టాపిక్‌ గా మారాయి.

బీజేపీ, తెలుగు దేశం ముఖ్య నాయకులు చెబుతున్న వివరాలను బట్టి.. వాస్తవానికి ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవి అడగలేదని అంటున్నారు. కానీ, తెలుగు దేశం పార్టీ మాత్రం చివరి నిముషంలో ఒక సీటును ఇచ్చేస్తున్నామంటూ ప్రకటించింది. ఈ పరిణామంతో బీజేపీ అధిష్టానం కూడా కాస్త విస్మయం చెందినట్లు సమాచారం. ఎందుకంటే.. పవన్‌ కల్యాణ్ డిమాండ్‌ కారణంగా పిఠాపురం ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మకు ఇవ్వాల్సిన ఎమ్మెల్సీ సీటును తెలుగు దేశం పార్టీ అనివార్య పరిస్థితుల్లో బీజేపీకి కేటాయించిందని తెలుస్తోంది. పవన్‌ కల్యాణ్‌ రూపంలో తమకు కలిసొచ్చిన అవకాశాన్ని వదులు కోలేని బీజేపీ.. ఉదయానికల్లా తన వ్యూహాన్ని బయటకు తీసింది. ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఆ ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించింది.

ఇక్కడే మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. సోము వీర్రాజుకు కూడా తనకు ఎమ్మెల్సీ సీటును కేటాయిస్తున్నట్లు తెలియదట. అసలు తెలుగు దేశం పార్టీ.. బీజేపీకి ఎమ్మెల్సీ సీటు ఇవ్వడం అన్నది ఒక ట్విస్ట్‌ అయితే, ఉదయం పార్టీ సీనియర్‌ నేత సోము వీర్రాజు పేరును డిక్లేర్‌ చేయడం మరో ట్విస్ట్‌. అయితే, సోము వీర్రాజు సోమవారం ఉదయం పార్టీ అధిష్టానం నుంచి ఫోన్‌ వచ్చే సమయానికి రాజమండ్రిలో ఉన్నారు. ఎమ్మెల్సీ పదవిని కేటాయించామని, వెంటనే విజయవాడ వెళ్లి నామినేషన్‌ దాఖలు చేయాల్సిందిగా అధిష్టానం సోము వీర్రాజును ఆదేశించింది. ఊహించని ఈ పరిణామంతో సోము వీర్రాజు విస్తు పోయినట్లు సమాచారం. అప్పటికప్పుడు నామినేషన్‌కు అవసరమైన ఏర్పాట్లు చేసుకొని హుటాహుటిన విజయవాడ బయలు దేరి వెళ్లారు సోము వీర్రాజు.

ఇక, సోము వీర్రాజును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేయడమే బీజేపీ అధిష్టానం చంద్రబాబుకు ఓ వార్నింగ్‌ ఇచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే సోము వీర్రాజు పక్కా బీజేపీ మనిషి. 2014లో తెలుగు దేశం పార్టీ.. బీజేపీకి దూరం కావడం వెనుక సోము వీర్రాజు పాత్ర ప్రధానంగా ఉందని చెప్పుకుంటారు. బీజేపీ, టీడీపీ మధ్య మనస్పర్థలు రావడానికి ఆయనే ప్రధాన కారణమంటారు. ఆ సమయంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఉన్నారు. సోము వీర్రాజుకు, టీడీపీకి పొసగక పోవడమే చంద్రబాబు బీజేపీకి దూరంగా జరగడానికి దారి తీసిందని చెప్పుకుంటారు. పొత్తు ఉన్న సమయంలోనూ, బీజేపీకి దూరమైన తర్వాత కూడా సోము వీర్రాజు తెలుగు దేశం పార్టీ వైఖరిని అప్పట్లో చెండాడారు. తెలుగు దేశం పార్టీ వైఖరిని ఆయన ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంటారు. అలాంటి సోము వీర్రాజుకు ఇప్పుడు ఎమ్మెల్సీ సీటు ఇవ్వడం వెను బీజేపీ వ్యూహం స్పష్టంగా అర్థమవుతోందంటున్నారు విశ్లేషకులు. చంద్రబాబుకు ఒకరకంగా బీజేపీ వార్నింగ్‌ ఇచ్చిందన్న చర్చ ఏపీ రాజకీయాల్లో నడుస్తోంది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com