24 C
Hyderabad
Monday, August 3, 2026

Live Video

spot_img

పోసాని.. తర్వాత లైన్‌లో ఉన్నదెవరు?

కేసుల భయంతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నేతలు వణికిపోతున్నారన్న చర్చ ఏపీలో జోరుగా సాగుతోంది. గత యేడాది ఎన్నికల అనంతరం, ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో మొదలైన అరెస్టుల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పటికే అరెస్ట్‌ అయి జైల్లో ఉన్నారు. అయితే, ఆయనపై వరుసగా కేసులు నమోదవుతున్న పరిస్థితి చూస్తే.. ఆయనకు ఇప్పట్లో బెయిల్ లభించే అవకాశం లేదంటున్నారు. తాజాగా.. సినీ న‌టుడు, వైసీపీ నేత‌, బూతుల సామ్రాట్‌గా వ్యతిరేక వర్గం పిలుచుకునే పోసాని కృష్ణముర‌ళిని హైదరాబాద్‌లో ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రజలు, పార్టీ కేడర్‌ను గత ప్రభుత్వ హయాంలో ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరినీ వదలి పెట్టబోమంటూ శాసనమండలిలో మంత్రి నారా లోకేష్ ప్రకటించగానే పోసాని రూపంలో మరో అరెస్ట్‌ నమోదయ్యింది. ఇప్పుడు.. పోసాని బాటలో నెక్ట్స్ ఎవరనే అంశంపై వైసీపీ నాయకులు బెంబేలెత్తి పోతున్నారని చెబుతున్నారు. మంత్రి నారా లోకేష్ కౌన్సిల్‌లో చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగానే ప్రస్తుతం యాక్షన్ కొనసాగుతోందట. వైఎస్‌ఆర్‌ సీపీ హ‌యాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రజలను, టీడీపీ కార్యకర్తలను ఎవరైతే ఇబ్బంది పెట్టారో.. వారిని వదిలే ప్రసక్తే లేదని నారా లోకేష్‌ వ్యాఖ్యానించారు. సమయం.. తేదీ కూడా రాసుకోండి.. అంటూ నారా లోకేశ్ ప్రతిప‌క్ష స‌భ్యుల‌ను ఉద్దేశించి మండ‌లిలో తాజాగా వ్యాఖ్యానించారు. త‌ద్వారా త్వర‌లో మ‌రికొంత మంది వైఎస్‌ఆర్‌ సీపీ నేత‌లు అరెస్టు కావడం తథ్యమని మంత్రి లోకేష్ క్లియర్ కట్‌గా చెప్పారన్నది దీని అర్థం. దీంతో తమ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం ప్రధానంగా టీడీపీ శ్రేణులను, నాయకులను ఇబ్బంది పెట్టిన వైసీపీ నేత‌లు ఇప్పుడు వ‌ణికిపోతున్నారని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవ‌రు, ఎప్పుడు క‌ట‌క‌టాలు లెక్కించాల్సి వస్తుందో అని భ‌య‌ప‌డుతున్నారట.

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో మొదలైన అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వ‌ల్లభ‌నేని వంశీపై వ‌రుస‌గా కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి. వంశీపై సిట్ విచార‌ణ కొన‌సాగుతోంది. వంశీ బాధితులు ఇప్పుడు ఒక్కొక్కరుగా సిట్ అధికారుల ముందుకు వచ్చి ఫిర్యాదులు చేస్తూ కేసులు పెడుతున్నారు. వల్లభనేని వంశీపై అరెస్ట్‌ కాకముందు నమోదైన కేసులు పక్కన బెడితే.. అరెస్ట్ అయ్యాక కూడా వంశీపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో, ఆయన ఇప్పట్లో జైలు నుంచి బయటకు వ‌చ్చే ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదంటున్నారు.

తాజాగా.. సినీ న‌టుడు, వైసీపీ నేత‌ పోసాని కృష్ణముర‌ళిని హైద‌రాబాద్‌లోని రాయ‌దుర్గం మైహోం భుజా అపార్ట్ మెంట్స్‌ లో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైఎస్‌ఆర్‌ సీపీ హయాంలో పోసాని కృష్ణ మురళి మీడియా ముందు ఇష్టానుసారం చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు టీడీపీ, జనసేన శ్రేణులు నెమరేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రెండు నెల‌ల క్రితం ప్రత్యేకంగా మీడియా స‌మావేశం ఏర్పాటు చేసిన పోసాని.. తనకు జ్ఞానోద‌యం అయ్యిందని, ఇకపై రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటాన‌ని ప్రక‌టించారు. అయితే, అరెస్ట్‌ చేయడానికి పోలీసులు వెళ్లిన సమయంలో పోసాని కృష్ణ మురళి పెద్ద మెలో డ్రామానే నడిపారని చెబుతున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారట. బనియన్‌, నిక్కర్ మీదనే హడావుడి చేశారట. డ్రెస్ వేసుకుని రావాలని పోలీసులు చెప్పినా వినకుండా పోసాని కాస్త ఓవరాక్షన్ చేస్తుండ‌టంతో.. అతి క‌ష్టంమీద పోలీసులు పోసానిని అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. పోసాని గానీ.. నోరు తెరిస్తే బూతు పురాణం వల్లె వేస్తారని పేరు తెచ్చుకున్నారు. పేరుకు ఆయనో సినిమా రచయిత, దర్శకుడు, నటుడు.. సినిమాల్లో ఆయన నీతులు చెబుతుంటారు. కానీ, బయట మైకు దొరికితే చాలు.. పచ్చిబూతులతో చెలరేగిపోతారన్నది అందరూ అంటున్న మాట. ముఖ్యంగా వైఎస్‌ఆర్‌ సీపీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల్లో జగన్‌ను మెప్పించడం కోసం ఆయన ప్రెస్‌మీట్‌లు పెట్టి మరీ.. వాడిన బూతు డైలాగులు ఇప్పటికీ టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తల చెవుల్లో వినిపిస్తున్నాయంటున్నారు. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్, వారి కుటుంబసభ్యులపై పోసాని కృష్ణ మురళి.. పచ్చి బూతులతో చెలరేగిపోయేవారని గుర్తు చేస్తున్నారు. వారిని ఎంతగా తిడితే జగన్‌ దగ్గర అన్ని మార్కులు పడతాయన్న ఉద్దేవ్యంతోనే నోటికి అడ్డూ అదుపూ లేకుండా పోసాని కృష్ణ మురళి విరుచుకుపడ్డారని అంటున్నారు. మీడియా ముందు మాట్లాడుతున్నానన్న సోయి కూడా లేకుండా తనదైన హావ భావాలతో తెగ చెలరేగిపోయేవారని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు ప్రత్యర్థులు. అయితే, పోసాని కృష్ణ మురళిపై గ‌తంలోనే పలు ప్రాంతాల్లో కేసులు న‌మోద‌య్యాయి. అయితే, అధికారం వైఎస్‌ఆర్‌ సీపీదే కావడంతో ఎవరూ చర్యలు తీసుకోవడానికి, కేసులు ముందుకు నడిపించడానికి ధైర్యం చేయలేదు. వైఎస్ఆర్‌ సీపీ ప్రభుత్వంలో ఏపీఎఫ్‌టీవీడీసీ చైర్మన్‌గా కూడా పోసాని కృష్ణ ముర‌ళి ప‌నిచేశారు. ఆ స‌మ‌యంలో చంద్రబాబు నాయుడు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌తోపాటు నారా లోకేశ్‌ను అస‌భ్యక‌రంగా దూషించారని ఆ పార్టీల శ్రేణులు గుర్తు చేసుకుంటున్నారు. దాంతో ఏపీలోని ప‌లు స్టేష‌న్‌ల‌లో ఆయ‌న‌పై కేసులు న‌మోద‌య్యాయి. కూట‌మి ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత కూడా ఆయ‌న ప‌లు సంద‌ర్భాల్లో అభ్యంత‌ర‌క‌ర భాష‌తో కూట‌మి నేత‌ల‌ను దూషించారు. ఇటీవ‌ల కాలంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిపైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆయ‌న‌పై బాప‌ట్ల, అనంత‌పురం, ప‌ల్నాడు జిల్లా న‌ర‌స‌రావుపేట, చిత్తూరు జిల్లా యాద‌మ‌రి, తిరుప‌తి జిల్లా పుత్తూరులో పోలీసుల‌కు ఫిర్యాదులు అందాయి. మొత్తంగా ఏపీ వ్యాప్తంగా ప‌లు అంశాల‌పై పోసానిపై 11 కేసులు న‌మోద‌య్యాయి.

ఇదిలా ఉంటే.. రెండు నెల‌ల క్రితం పోసాని కృష్ణ మురళి మీడియా స‌మావేశం పెట్టి మరీ.. యూ టర్న్‌ తీసుకున్నారు. తనకు ఇప్పటికి జ్ఞానోద‌యం అయ్యిందనీ, ఇకపై రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటాన‌ని ప్రక‌టించారు. దీంతో కూట‌మి ప్రభుత్వం త‌న‌ను వ‌దిలేస్తుంద‌ని పోసాని భావించిన‌ట్లు అనుకుంటున్నారు. కానీ, బండ‌బూతులు తిట్టి రాజ‌కీయాలు వ‌దిలేశానంటే కుదరదని.. కూటమి ప్రభుత్వం ఆచరణలో క్లారిటీ ఇచ్చిందంటున్నారు.

శాసన మండ‌లిలో నారా లోకేశ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత చాలా మంది వైఎస్‌ఆర్‌ సీపీ నేత‌లు ర‌హ‌స్య ప్రాంతాల‌కు వెళ్లి త‌ల‌దాచుకుంటున్నార‌ని ఏపీ పొలిటికల్‌ సర్కిల్స్‌లో చ‌ర్చ జ‌రుగుతోంది. వల్లభనేని వంశీ అరెస్టు త‌రువాత ఎవ‌రిని అరెస్టు చేస్తారోన‌ని వైఎస్‌ఆర్‌ సీపీ నేత‌లు భ‌యంతో వ‌ణికిపోతున్నారు. అయితే, వంశీ తర్వాత పోసాని వంతు వ‌చ్చిందని చెప్పుకుంటున్నారు. పోసాని కృష్ణ మురళిని అరెస్టు చేసిన త‌రువాత నెక్ట్స్ ఎవ‌రు..? అనే చ‌ర్చ ఇప్పుడు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా సాగుతోంది. అయితే, ఈసారి ప‌క్కాగా కొడాలి నాని అరెస్టు ఉంటుంద‌ని వైసీపీ నేత‌లు అంచ‌నా వేస్తున్నారు. ఇప్పటికే కొడాలి నానిపై పోలీసులు దృష్టి సారించిన‌ట్లు తెలుస్తోంది. గ‌తంలో ఆయ‌న‌పై నమోదై ఉన్న కేసులు, ప్రస్తుతం ప‌లు స్టేష‌న్‌ల‌లో ఆయ‌న‌పై న‌మోదైన కేసుల వివ‌రాల‌ను సేక‌రిస్తున్నార‌ట‌. అరెస్ట్ భయంతోనే కొడాలి నాని హైద‌రాబాద్‌తోపాటు బెంగ‌ళూరు వంటి న‌గ‌రాల్లోనే ఎక్కువ‌గా ఉంటున్నార‌ని టాక్ న‌డుస్తోంది. ఇటీవ‌ల వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జ‌గ‌న్.. వంశీని ప‌రామ‌ర్శించేందుకు విజ‌య‌వాడ జైలుకు వెళ్లారు. ఆ స‌మ‌యంలో జ‌గ‌న్ వెంట కొడాలి నాని ఉన్నాడు. మ‌రుస‌టి రోజు గుంటూరు మిర్చి యార్డుకు జ‌గ‌న్ వెళ్లిన స‌మ‌యంలోనూ కొడాలి నాని వెంట ఉన్నాడు. ఆ వెంట‌నే కొడాలి నాని త‌న అనుచ‌రుల‌కు కూడా చెప్పకుండా ర‌హ‌స్య ప్రాంతానికి వెళ్లిపోయారంటున్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com