- బెంగళూరు ఫిలిం ఫెస్టివల్‌కు హాజరవ్వడానికి నిరాకరణ
- తాను హైదరాబాదీనని అవమానించిందంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే
- తనను ఎవరూ ఆహ్వానించలేదంటున్న రష్మిక మందన్న
బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి హాజరు కావాలన్న ఆహ్వానాన్ని తిరస్కరించడమే కాకుండా తాను హైదరాబాద్ కు చెందిన వ్యక్తిగా చెప్పుకున్నందుకు నటి రష్మిక మందన్నపై కాంగ్రెస్ ఎమ్మెల్యే, కన్నడ ఉద్యమ కార్యకర్త రవికుమార్ గౌడ గనిగ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను రష్మికా మందన్న పీఆర్ టీమ్ తవ్రంగా ఖండిస్తోంది. కాంగ్రెస్ శాసనసభ్యుడు రవి గనిగ చేస్తున్నవన్నీ నిరాధార ఆరోపణలు అని ఆ టీమ్ ఎమ్మెల్యే ఆరోపణలను తిప్పికొడుతోంది. రష్మికను బెంగుళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఆహ్వానిస్తే ఆమె నాకూ కన్నడ ఫిలిం ఇండస్ట్రీకి ఏమిటి సంబంధం నేను హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాను తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిని అని రష్మిక కన్నడిగులను అవమానించిందని ఆమెకు గుణపాఠం చెప్పాలని రవి గనిగ విమర్శించారు. అయితే ఎమ్మెల్యే ఆరోపణలు నిరాధారమైనవని, అటువంటి సంఘటన ఏదీ జరగలేదని, ప్రజల్లో అనవసర దురాభిప్రాయాలు కలుగుతాయనే ఉద్దేశంతో ఈ విషయాన్ని ఖండిస్తున్నట్లు రష్మిక పీఆర్ బృందం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనపై కూడా ఎమ్మెల్యే రవి గనిగ సవాల్ చేస్తున్నారు. రష్మికపై వ్యక్తిగతంగా నాకు ఎటువంటి వ్యతిరేకత లేదని మేము శిల్పాశెట్టి, అనుష్కశెట్టి వంటి నటీమణులపై ఇటువంటి ఫిర్యాదులు చెయ్మమని, వారు కర్నాటక రాష్ట్రానికి చెందిన మహిళలైనా వారి సినీ కెరీర్‌ను ఇతర భాషా సినీ పరిశ్రమల్లో ప్రారంభించారని కానీ రష్మిక అలా కాదని ఆమెకు అతిపెద్ద బ్రేక్ ఇచ్చిన కన్నడ సినీ పరిశ్రమ పట్ల చులకన భావం కలిగి ఉండటాన్ని నేను కన్నడ ప్రజల తరపున ప్రశ్నిస్తున్నానని రవి గనిగ అంటున్నారు. రష్మిక బీఐఎఫ్‌ఎఫ్ కి రావడానికి నిరాకరించిందనడానికి తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని రవి గనిగ చెపుతున్నారు.