37.2 C
Hyderabad
Wednesday, April 22, 2026

Live Video

spot_img

ఈసారైనా విస్తరేస్తారా…!

  • 38దోస్సారి… శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్న రేవంత్ రెడ్డి
  • ఎమ్మెల్సీ అభ్యర్థులు, క్యాబినెట్ విస్తరణ పై చర్చ
  • ఈ నెలలోనే రాష్ట్ర కార్యవర్గ ఏర్పాటు
  • మంత్రివర్గంలోకి మున్నూరు కాపు వర్గానికి స్థానం
  • పూర్తిస్థాయి క్యాబినెట్ లేకుండా ఎలా అంటున్నా రేవంత్ రెడ్డి

ఎన్నెన్నో అనుకుంటాం… అవన్నీ జరుగుతాయా ఏంటి…? అని నందమూరి బాలకృష్ణ మీమ్‌ ఒకటి ఉంటుంది. సేమ్‌ టు సేమ్‌ అలాగే ఉంది తెలంగాణ కాంగ్రెస్‌ నాయకుల పరిస్ధితి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ గౌడ్‌లు కలసి ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా… వాళ్ళు తిరిగి వచ్చిన వెంటనే పదవుల జాతరే అని గంపెడాశలు పెట్టుకుంటారు టీకాంగ్రెస్‌ నేతలు. అయితే ఈ ముగ్గురు అగ్రనేతలు ఇప్పటి వరకూ అనేక సార్లు ఢిల్లీ వెళ్ళారు… వచ్చారు. కానీ పదవుల పందేరం, క్యాబినేట్‌ విస్తరణ ఫైళ్ళకు మాత్రం ఏమాత్రం కదలిక లేదు. అయితే ఈ సారి… ఈ వారంలో ఎట్టి పరిస్ధితుల్లో నిర్ణయం తీసుకోవాల్సిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఫైలు పట్టుకుని  శుక్రవారం ఉదయమే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ బయలుదేరుతున్నారు. పనిలో పనిగా మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్‌ పోస్టుల భర్తీ, పీసీసీ కార్యవర్గం ప్రకటించడానికి అనుమతులు తెచ్చుకోవాలనే దృఢ సంకల్పంతో ఢిల్లీ వెళుతున్నారు సీయం రేవంత్‌ రెడ్డి.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి రెండు రోజుల పాటు జరిగే ఈసారి ఢిల్లీ టూర్ ఆసక్తికరంగా మారింది. ఈ పర్యటనలో పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యేందుకు రేవంత్ రెడ్డి శుక్ర, శనివారాల్లో రెండు రోజులపాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఇప్పటికే దాదాపు 37 సార్లు ఢిల్లీ పర్యటన చేసిన రేవంత్ రెడ్డి ఈసారి పర్యటన ద్వారా పెండింగ్లో ఉన్న అనేక అంశాలకు క్లారిటీగా తెచ్చుకోవాలని భావిస్తున్నారు.

ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక పై అధిష్టానంతో చర్చలు జరపనున్నారు. తెలంగాణలో ఐదు స్థానాలకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి… నామినేషన్ దాఖలు కొన్ని రోజులే మిగిలి ఉండడంతో ఈ పర్యటనలో అభ్యర్థులను ఖరారు చేయనున్నారు.ఐదు స్థానాల్లో నాలుగు కాంగ్రెస్ పార్టీ ఒకటి బిఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది. అయితే నాలుగు స్థానాల్లో ఒక స్థానాన్ని తమకు కేటాయించాలని సిపిఐ రాష్ట్ర నాయకత్వాన్ని కోరింది.. ఈ విషయంపై కూడా అధిష్టానంతో రేవంత్ రెడ్డి చర్చించనున్నారు ఒకవేళ అధిష్టానం ఓకే చెప్తే ఒక సీటులో సిపిఐ కి కేటాయించనున్నారు..

ఇక ముగ్గురు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విషయానికొస్తే రెడ్డి సామాజిక వర్గం నుంచి వేం నరేందర్ రెడ్డి, ఎస్సీ కోట నుంచి అద్దంకి దయాకర్, ఎస్టి కోట నుంచి ఖమ్మం జిల్లాకు చెందిన బానోత్‌ విజయాబాయి పేర్లు వినిపిస్తున్నాయి. సిపిఐకి ఒక సీటు కేటాయిస్తే ఆ స్థానం నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని ప్రతిపాదించాలని భావిస్తున్నారు. అద్దంకి దయాకర్ విషయంలో అనుమానాలు ఉంటే మరో అభ్యర్థిని కూడా సిద్ధం చేశారు.

మరోవైపు ఇక అత్యంత కీలకమైన క్యాబినెట్ విస్తరణ అంశంపై కూడా రేవంత్ రెడ్డి చర్చలు జరిపే అవకాశం ఉంది. ఖచ్చితంగా క్యాబినెట్ విస్తరణకు అవకాశం కల్పించాలని రేవంత్ రెడ్డి పట్టు పడుతున్నారు. క్యాబినెట్ లోకి ఆరుగురుని తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రాతినిధ్యం లేని జిల్లాలు సామాజిక అంశాలను దృష్టిలో పెట్టుకొని దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఆయన అధిష్టానంను కోరనున్నారు. క్యాబినెట్ విస్తరణ చేయకుండా పాలన సాగించడం ఇబ్బందిగా ఉంది కనుక ఈ విషయంపై త్వరగా తేల్చాలని రేవంత్ రెడ్డి పట్టుపడుతున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌ వద్ద కూడా ఈ అంశంపై రేవంత్ రెడ్డి ఇటీవల చర్చించినట్టుగా తెలిసింది. పూర్తి క్యాబినెట్ లేకుండా ఏ విధంగా పాలన సాగుతుందని ఆయన అభిప్రాయ పడినట్టుగా సమాచారం. క్యాబినెట్ విస్తరణకు సంబంధించి ఆశావాహుల జాబితా ఇప్పటికే అధిష్టానం వద్ద ఉంది. కొత్తగా మరికొందరు పేర్లు కూడా తెరపైకి వచ్చినట్లుగా తెలుస్తోంది. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి క్యాబినెట్లో అవకాశం కల్పించాలని తాజాగా రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇటీవల కొందరు మున్నూరు కాపు నేతలు తమకు క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేకపోవడం సరి అయింది కాదని బలమైన సామాజిక వర్గాన్ని దూరం పెట్టడం పార్టీకి ఇబ్బందిగా మారుతుందని రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. వేములవాడ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఆది శ్రీనివాస్ పేరు తాజాగా తెరపైకి వచ్చింది.

ఈసారి ఢిల్లీ పర్యటనలో ఖచ్చితంగా క్యాబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఖాయమని ఆశావాహులు గంపెడాశలు పెట్టుకున్నారు. ఇక మరో కీలక అంశం పిసిసి రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటు. పిసిసి అధ్యక్షుని నియామకం జరిగినప్పటికీ రాష్ట్ర కార్యవర్గ ఏర్పాటు మాత్రం ఇంత వరకూ చేయలేదు. కార్యవర్గ ఏర్పాటు ఈ నెలలోనే ఉంటుందని పార్టీ నేతలు చెపుతున్నారు. అలాగే నామినేటెడ్ పోస్టుల అంశం కూడా రేవంత్ రెడ్డి అధిష్టానంతో చర్చించనున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థులు, క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టులు, పీసీసీ కార్యవర్గం ఇలా పెండింగ్‌లో ఉన్న పలు అంశాలపై ఈసారి పర్యటనలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి క్లారిటీ తీసుకొని రానున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఈ సారైనా రేవంత్‌రెడ్డి అధిష్టానం ముందు పెట్టే అర్జీలన్నీ క్లియర్‌ అవుతాయా లేక గడచిన 37 ఢిల్లీ పర్యటనలు లాగే ఈ సారి కూడా 38వ పర్యటనగానే మిగిలిపోతుందా… అనుకున్నది సాధించిన పర్యటనగా అవుతుందా అన్నది శనివారం సాయంత్రానికల్లా తేలిపోతుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com