22.7 C
Hyderabad
Friday, November 27, 2026

Live Video

spot_img

రాజు గారు అడగరు… పార్టీ పిలవదు

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న సీనియర్ నేత అశోక్ గజపతి రాజు ఇక రాజకీయాల నుంచి తప్పుకున్నట్లే కనిపిస్తుంది. ప్రస్తుతమున్న రాజకీయాల్లో తాను పనికి రానని ఆయన డిసైడ్ అయ్యారు. అందుకే తన వారసురాలిని పాలిటిక్స్ లోకి దించారు. అశోక్ గజపతి రాజు చంద్రబాబు నాయుడుతో సమానమైన రాజకీయ అనుభవం ఉన్న నేత. విజయనగరం జిల్లా అంటేనే టీడీపీలో మొదట గుర్తొచ్చేది ఆయన పేరే. అలాంటిది అశోక్ గజపతి రాజు పేరు పూర్తిగా కనుమరుగైంది. ఆయన ఎక్కువ సమయం హైదరాబాద్ లోనే ఉంటున్నారని చెబుతున్నారు. తనకు ఎలాంటి పదవులు వచ్చే అవకాశం లేదని అశోక్ గజపతి రాజు దాదాపు ఫిక్స్ అయినట్లే కనపడుతుంది. ప్రస్తుతం అశోక్ గజపతి రాజును పార్టీ కూడా పట్టించుకోకపోవడం లేదు. ఆయన పేరు కూడా ఎక్కడా నేతల నోటి నుంచి ప్రస్తావనకు రావడం లేదు. ఆయన ఊసే లేదు. రాజ్యసభకు పంపుతారని అనుకున్నా ఆ పేరు కూడా పరిశీలనలోకి తీసుకోవడం లేదు. అశోక్ గజపతి రాజు శకం రాజకీయంగా ముగిసినట్లేనన్నఆయన అభిమానులు భావిస్తున్నారు.

2019 ఎన్నికలలో ఓటమి తర్వాత అశోక్ గజపతి రాజులో కొంత నైరాశ్యం అలుముకుంది. దీంతో పాటు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ట్రస్ట్ విషయంలోనూ జోక్యం చేసుకుంది. న్యాయస్థానాలకు వెళ్లి పోరాడాల్సి వచ్చింది. టీడీపీ ఆ సమయంలో కొంత వరకూ మద్దతుగా ఉన్నప్పటికీ ఎన్నికల తర్వాత మాత్రం ఆయన ఊసే వినిపించడంలేదు విజయనగరంలో మొన్నటి ఎన్నికల్లో తన కుమార్తె ఆదితి గజపతిరాజు గెలవడంతో భవిష్యత్ రాజకీయాలను ఆమెకే అశోక్ గజపతి రాజు అప్పగించినట్లు చెబుతున్నారు. వయసు కూడా మీద పడటంతో పాటు ప్రస్తుతం టీడీపీలో నెలకొన్న పరిస్థితులను బట్టి తమ మాట చెల్లుబాటు కాదని అశోక్ గజపతి రాజు డిసైడ్ అయినట్లే కనిపిస్తుంది. అందుకే ప్రభుత్వం ఏర్పాటయి పదినెలలు గడుస్తున్నా ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసే ప్రయత్నం చేయలేదు. అమరావతికి కూడా రాలేదంటే ఆయన పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకున్నట్లే చెబుతున్నారు.

అప్పుడప్పుడు తన కుమార్తె ఆదితి గజపతిరాజుకు సలహాలు ఇస్తూ కాలం గడుపుతున్నారంటున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అశోక్ గజపతి రాజు పేరు ప్రముఖంగా వినిపించింది. ఆయనకు గవర్నర్ పదవి ఇస్తారన్న ప్రచారం కూడా బాగానే సాగింది. ఇప్పుడు గవర్నర్ పదవి కూడా దక్కే అవకాశం లేదంటున్నారు. భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని టీడీపీ నాయకత్వం నిర్ణయాలు తీసుకుంటుండటంతో సీనియర్ నేత అశోక్ గజపతి రాజును ఇక పట్టించుకునే సమయం, తీరిక పార్టీ నాయకత్వానికి ఉండకపోవచ్చు. 74 ఏళ్ల రాజు గారు కూడా తనకు పదవి కావాలని ప్రయత్నించిన దాఖలాలు లేవు. తనకు పిలిచిపదవి ఇస్తే ఓకే.. అడిగి తెచ్చుకోవడం తన ఇంటా వంటా లేదంటున్నారు. మొత్తం మీద అశోక్ గజపతి రాజు రాజకీయ శకం ముగిసినట్లే కనిపిస్తోందని ఉత్తరాంధ్రలో విశ్లేషణలు జరుగుతున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com