26.7 C
Hyderabad
Thursday, April 23, 2026

Live Video

spot_img

ప్రతి నిరుద్యోగికి రూ.72 వేలు బాకీ పడ్డ చంద్రబాబు – వైఎస్‌ జగన్‌ ధ్వజం

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పార్టీలు చెప్పిన మోసపూరిత మాటలు నమ్మి ఓటేసిన నిరుద్యోగులను చంద్రబాబు నిండా ముంచేశారని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగికి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి యేడాది కూడా నిండక ముందే రూ.72వేలు బాకీ పడ్డారని జగన్ లెక్కలతో సహా విమర్శించారు.

నిరుద్యోగులకు మూడు వేల భృతి ఇస్తామని చెప్పి.. అందరినీ చంద్రబాబు మోసం చేశాడన్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు వచ్చే దాకా నిరుద్యోగ భృతి ఇస్తానని చంద్రబాబు చెప్పాడని గుర్తు చేశారు. గత ఏడాది బడ్జెట్‌లో కూడా నిరుద్యోగ భృతి.. దాదాపు రూ.7వేల కోట్లు ప్రస్తావించలేదన్న వైఎస్‌ జగన్‌.. కనీసం ఈ ఏడాది బడ్జెట్‌లో కూడా నిరుద్యోగ భృతి పెట్టలేదని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

రెండో బడ్జెట్‌ సమయంలో 2024-25 సంబంధించి రెండో సోషియో ఎకనామిక్‌ సర్వేలో అన్నీ అబద్దాలు చెప్పారన్నారు. ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌లో 2024-25కు సంబంధించి 27 లక్షల 7 వేల 752 ఉద్యోగాలిచ్చినట్లు ప్రింట్‌ చేసి నిరుద్యోగులను మోసం చేశారన్నారు. నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తామని చెప్పి.. ఇవ్వకుండా.. బడ్జెట్‌లో ప్రతిపాదలు చేయకుండా.. లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పడం దారుణమన్నారు.

చంద్రబాబు ఇంత దారుణంగా నిరుద్యోగులకు గత యేడాది రూ.36వేలు ఇస్తానని చెప్పి ఎగనామం పెట్టాడన్నారు. ఈ సంవత్సరం కూడా మరో రూ.36వేలు ఇవ్వకుండా మోసం చేస్తున్నాడని.. ఇవి మొత్తం లెక్కేస్తే.. ఇప్పటికే చంద్రబాబు నిరుద్యోగులకు రూ.72వేలు మోసం, దగా, వంచన చేశాడన్నారు. ఇటు.. నిరుద్యోగ భృతి లేదు, ఉద్యోగం లేదు.. ఉన్న ఉద్యోగాలు కూడా ఊడబీకే ప్రయత్నం జరుగుతోందన్నారు వైఎస్‌ జగన్‌.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో నిరుద్యోగులకు చేసిన లబ్ది, అమలు చేసిన పథకాల గురించి వైఎస్ జగన్ వివరించారు. వైసీపీ 2019లో అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే లక్ష ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఇది ఎవరూ కాదనలేని సత్యమని చెప్పారు. అప్కాస్‌ ద్వారా 96వేల ఉద్యోగాలు కల్పించామని, పే స్లిప్‌ల ఆధారాలతో చెబుతున్నానన్నారు. 2 లక్షల 66 వేల మంది వాలంటీర్లను రాష్ట్ర వ్యాప్తంగా నియమించామన్నారు. అటు.. ఏపీఎస్‌ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా 56 వేల మందిని రెగ్యులరైజ్‌ చేశామన్నారు. ఐదేళ్లలో వైఎస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వ హయాంలో వివిధ సెక్టార్లలో.. 6 లక్షల 31 వేల 310 ఉద్యోగాలు ఇచ్చామని వైఎస్‌ జగన్ వివరించారు.

అంతేకాదు.. 2023-24 సోషో ఎకనమిక్‌ సర్వే ప్రకారం లార్జ్‌, మెగా ఇండస్ట్రీలో లక్షా 2 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు వైఎస్‌ జగన్‌. ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌లో వైసీపీ పాలనలో 32 లక్షల 79 వేల 770 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రిలీజ్‌ చేసిన సోషియోఎకానమి సర్వే చెప్పిన వివరాలు.. ఏ ప్రభుత్వం ఎంత నిజాయితిగా ఉందని చెప్పడానికి నిదర్శనమన్నారు.

ఓవైపు.. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన చేయకుండా, నిరుద్యోగులకు మొండిచేయి చూపిస్తూనే.. మరోవైపు.. పారిశ్రామిక వేత్తలను బెదిరించి రాష్ట్రం నుంచి పంపిస్తున్నారని వైఎస్‌ జగన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కడపలో స్టీల్‌ ప్లాంట్‌ రాకుండా అడ్డుకున్నారని, అలాగే, అరవిందో సంస్థను కూడా బెదిరించి పంపించే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్‌ జగన్ తీవ్రస్థాయిలో విమర్శించారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com