ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి జ్ఞానోదయమైందా? అమెరికా లేకపోతే రష్యాతో యుద్ధం చేయలేమని క్లారిటీ వచ్చిందా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ పరిణామాలకు ఔననే సమాధానమే వినిపిస్తోంది. ఎందుకంటే అమెరికా అధ్యక్ష భవనంలో డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన వాగ్వాదం తర్వాత కీలక పరిణామాలు జరిగాయి. జెలెన్ స్కీ నేరుగా లండన్ వెళ్లడం.. అక్కడ యూరప్ దేశాధినేతలతో సమావేశం కావడం.. అదే సమయంలో ఉక్రెయిన్‌కు సైనిక సాయం నిలిపివేయాలని ట్రంప్ ఆదేశించడం.. ఇలా వరుస పరిణామాలు జరుగుతూ వెళ్లాయి. దీంతో జెలెన్ స్కీ వెంటనే దిగి వచ్చినట్టు కనిపిస్తోంది.
ట్రంప్‌కు లెటెస్ట్‌గా జెలెన్ స్కీ ఓ లెటర్ రాశారు. తాము అమెరికా చేసిన సాయానికి రుణపడి ఉంటామని.. అదే సమయంలో రష్యాతో యుద్ధం ముగించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని.. ఇక అమెరికా సూచించినట్టుగా మినరల్ డీల్‌కు కూడా అంగీకారం తెలుపుతున్నామని జెలెన్ స్కీ అందులో రాశారని తెలుస్తోంది. ఈ విషయాన్ని యూఎస్ కాంగ్రెస్‌లో ట్రంప్ స్వయంగా ప్రకటించారు.
నిజానికి ట్రంప్‌తో వాగ్వాదం తర్వాత యూరప్ మొత్తం తన వెంటే ఉందని బలప్రదర్శన చేయాలనుకున్నారు జెలెన్ స్కీ. నిజానికి చేశారు కూడా. అందుకే యుద్ధం ఆగిపోయిందేకు చాలా సమయం పడుతుందని ప్రకటించారు కూడా. కానీ బలప్రదర్శన చేయడం వల్ల జరిగేది ఏం లేదని తేలిపోయింది. ట్రంప్ ప్రపంచం దృష్టిలో నెగటివ్‌గా ప్రొజెక్ట్ కాకుండా సాయం అందిస్తారని ఊహించారు. కానీ ట్రంప్ అమెరికా తర్వాతే నాకు ఏదైనా అంటున్నారు. దీంతో సైనిక సాయాన్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు సానుభూతి తప్ప.. సాయం చేసే పరిస్థితిలో యూరప్ దేశాలు లేవు. ఇప్పటికే ఆ దేశాలపై ట్రంప్ టారిఫ్ కత్తి వేలాడుతోంది. దీంతో ఈ వ్యవహారాన్ని మరింత లాగితే అసలుకే మోసమని గ్రహించారో ఏమో వెంటనే జీ హుజూర్ అనేశారు జెలెన్ స్కీ.
నిజానికి ట్రంప్ ప్రస్తుతం తీసుకుంటున్న నిర్ణయాలు.. ఒంటెద్దు పోకడలు ఇప్పడప్పుడే అమెరికాకు పెద్ద నష్టాన్ని చేకూర్చకపోయినా.. అన్ని దేశాల్లో మొత్తం ఓ ఆలోచనను రెకెత్తించాయనడంలో అనుమానాలేం లేవు. ట్రంప్‌కు అమెరికా గొప్ప అయితే.. ఎవరి దేశం వారికి గొప్ప. ప్రస్తుతం ట్రంప్ అహానికి కారణం డాలర్ పెత్తనం. ఇప్పుడు ప్రపంచ దేశాలు ఒక్కసారి దీనిపై ఫోకస్ చేస్తే ఇప్పటికిప్పుడు కాకపోయినా.. భవిష్యత్తులో అమెరికాకు నష్టం తప్పదు.