తెలంగాణలో నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. నేడు బుధవారం ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా పరీక్ష కేంద్రాలకు ఉదయం నుండే చేరుకుంటున్నారు. నలంద స్కూల్, శ్రీ చైతన్య, నారాయణ కళాశాల్లో పరీక్షా కేంద్రాలు ఉండటంతో ఆయా కళాశాలలు ఉన్న ప్రాంతాలన్నీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ఉదయం నుచే రద్దీగా తయారయ్యాయి. ఎస్సార్ నగర్, నారాయణగూడ, కూకట్పల్లి, ఈసీఐఎల్, దిల్షుక్నగర్ తదితర ప్రాంతాల్లో ఉన్న పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు వారి తల్లిదండ్రులతో పాటుగా చేరుకున్నారు. మొదటి పరీక్ష అవ్వడంతో ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు విద్యార్థులు. ఇప్పటికే సెంటర్ల వద్ద విద్యార్థుల పరీక్షలకు అధికారులు తగిన ఏర్పాట్లను చేశారు. పరీక్ష కేంద్రానికి 100 మీటర్ల వరకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో బిఎన్ఎస్ ఆక్ట్ 163 (144)సెక్షన్ అమలు చేస్తున్నారు. ఉదయం 9గంటల నుండి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. నిమిషం నిబంధన ఎత్తివేయడంతో 9 గంటల ఐదు నిమిషాల వరకు కూడా విద్యార్థులను పరీక్షకు అనుమతించనున్నారు.