తెలంగాణలో మార్చి 5వ తేదీ బుధవారం నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షల సమయంలో విద్యార్థులకు ఇంటర్ బోర్డు కీలక సూచనలు చేసింది. ఇంటర్ పరీక్షల్లో ఒక్క నిమిషం నిబంధనను సడలించారు. ఈసారి ‘ఒక్క నిమిషం ఆలస్యం’ నిబంధన వర్తించదు. దీంతో పరీక్ష ప్రారంభమైన తర్వాత 5 నిమిషాల వరకు విద్యార్థులకు పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నారు. అంటే ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభమైతే.. ఉదయం 9.05 గంటల వరకు విద్యార్థులను అనుమతించనున్నారు.
ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ప్రకటించారు. విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకుంటే ఎలాంటి ఆందోళన లేకుండా పరీక్ష రాసుకోవచ్చన్నారు. తల్లిదండ్రులు కూడా విద్యార్థులు ముందుగా చేరుకునేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. నిబంధనల ప్రకారం ఉదయం 8.45 గంటల నుంచి 9 గంటల మధ్యలో ఓఎంఆర్ పత్రాన్ని విద్యార్థులు పూర్తి చేయాలని, ఎవరికి వారు తమకిచ్చిన పత్రంపై తమ వివరాలే ఉన్నాయా? లేవా? అని సరిచూసుకోవాలన్నారు.
హాజరుకానున్న 9.96 లక్షల విద్యార్థులు :
ఈ సారి ఇంటర్మీడియట్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9,96,971 విద్యార్థులు హాజరవుతున్నారు. వీరిలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు 4,88,448 మంది కాగా, ఇంటర్ సెకండియర్ విద్యార్థులు 5,08,523 మంది ఉన్నారు. వీరి కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,532 పరీక్షా కేంద్రాలను ఇంటర్ బోర్డు ఏర్పాటుచేసింది. వీటిలో 49 సెల్ఫ్ సెంటర్లు ఉన్నాయి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల్లో ఈసారి కూడా అమ్మాయిల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈసారి పరీక్షలకు ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు కలుపుకొని అబ్బాయిలు 4,97,528 మంది ఉండగా.. 4,99,443 మంది అమ్మాయిలు ఉన్నారు. అంటే 1,915 మంది అమ్మాయిలు ఎక్కువగా ఉన్నారు. ఏకంగా 27 జిల్లాల్లో బాలికల సంఖ్య అధికంగా ఉండగా.. కేవలం ఆరు అర్బన్ జిల్లాల్లో మాత్రమే బాలురు అధికంగా ఉన్నారు.
విద్యార్థులు, తల్లిదండ్రులు కింది సూచనలు ఫాలో కావాలి :
-
ఈసారి హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్ ముద్రించారు. దాన్ని స్కాన్ చేసి పరీక్షా కేంద్రం లొకేషన్ తెలుసుకోవచ్చు. ఒకరోజు ముందుగానే పరీక్ష కేంద్రాన్ని పరిశీలించి రావడం మంచిది.
-
ప్రశ్నపత్రంపై సీరియల్ నంబరు ముద్రించారు. దీంతో ఏ సంఖ్య పేపర్.. ఏ విద్యార్థికి వెళ్తుందో దీనిద్వారా తెలుసుకోవచ్చు. ప్రశ్నపత్రం ఒకవేళ బయటకు వచ్చినా.. అది ఏ పరీక్షా కేంద్రం, ఏ విద్యార్థిదని వెంటనే తెలుసుకోవచ్చు.
-
ప్రశ్నపత్రంలో ఏమైనా పొరపాట్లు ఉంటే పరీక్ష ప్రారంభమైన తర్వాత సవరించుకోవాలని సమాచారం ఇస్తారు. ఇన్విజిలేటర్లు ఆ విషయాన్ని చెబుతారు. ఆ ప్రకారం విద్యార్థులు సరిచేసుకొని సమాధానాలు రాయాలి.
-
గతేడాది వరకు పరీక్షకు సాధారణ చేతి గడియారాలను అనుమతించేవారు. అయితే, పరీక్షల సమయంలో అధిక సంఖ్యలో విద్యార్థులు ఉంటుండటంతో ఏది అనలాగ్, ఏది స్మార్ట్‌వాచ్ అనేది గుర్తించే పరిస్థితి లేదు. అందుకే ఈసారి ఏ రకమైన చేతిగడియారాలనూ తీసుకెళ్లేందుకు అనుమతి లేదని అధికారులు ప్రకటించారు.