ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా అమరావతికి సంబంధించి మాజీ మంత్రి, శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌కు మూడు రాజధానులు అనేది అప్పుడున్న పరిస్థితుల్లో తమ ప్రభుత్వం విధానమని చెప్పారు. రాజధాని విషయంలో ఇప్పుడు తమ పార్టీ విధానం ఏమిటనేది పార్టీలో విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకొని చెబుతామన్నారు.
శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ రాజధాని అమరావతి అంశంపై మాట్లాడారు. రాజధానిపై తమ పార్టీ విధానం ఏమిటనే విషయాన్ని డీటెయిల్డ్‌గా డిస్కస్ చేసుకుని చెబుతామన్నారు. అమరావతి స్మశానంలా ఉందని తాను గతంలో వ్యాఖ్యానించిన మాట వాస్తవమే అన్నారు బొత్స. ఆరు సంవత్సరాల క్రితం అప్పటి పరిస్థితులు, సందర్భాన్ని బట్టి ఆ రోజు తాను అలా మాట్లాడానని స్పష్టం చేశారు.
తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం హయాంలో అమరావతి రాజధాని నిర్మాణం కోసం 6 వేల కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదన్నారు. అమరావతి వల్లకాడులా మారిందని, అక్కడికి వెళ్లి ఏం చేస్తామని గతంలో తాను మాట్లాడానని బొత్స సత్యనారాయణ చెప్పారు.
అమరావతి నిర్మాణానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చవుతాయని బొత్స వ్యాఖ్యానించారు. అంత ఖర్చు చేసే స్తోమత అప్పుడు తమ ప్రభుత్వానికి లేదన్నారు. అందుకే అప్పుడు అలా మాట్లాడాల్సి వచ్చిందన్నారు. అప్పటి వ్యాఖ్యల మీద ఎలాంటి వివాదం లేదన్నారు బొత్స. అలాగే, మూడు రాజధానుల వైపు మొగ్గు చూపడానికి కూడా అదే కారణమన్నారు. రాజధాని అంశంలో ఇప్పుడు తమ పార్టీ నిర్ణయం ఏంటనేది పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే, శాసన మండలిలో విపక్ష హోదా స్థాయిలో బొత్స సత్య నారాయణ మండలి వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.