-
ముదిగొండ, ఎర్రుపాలెం మండల కేంద్రాల్లో 50 పడకల ఆసుపత్రులు మంజూరు
-
మధిర నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకి రానున్న అత్యున్నత వైద్య సేవలు
-
ఒక్కో ఆసుపత్రి నిర్మాణానికి 22 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం
ఏ మాత్రం అనారోగ్యం పాలైనా.. అయితే ఖమ్మం, లేదంటే విజయవాడ పరుగులు పెట్టాల్సిన పరిస్థితి. పదుల కిలోమీటర్లు ప్రయాణించి, లక్షలు ఖర్చు పెడుతున్న దుస్థితి. నిపుణులైన వైద్యులు లేక దశాబ్దాలుగా ఎరుపాలెం, ముదిగొండ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఉన్న ప్రాథమిక వైద్యశాలలో ఒకే ఒక డాక్టర్, ఆస్పత్రులు శిథిలావస్థకు చేరాయి. నియోజకవర్గ ప్రజలకు విద్య, వైద్యం, సాగు రంగాల్లో శాశ్వత పరిష్కారం చూపించాలని నిరంతరం తపించే డిప్యూటీ సీఎం, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మల్లు ప్రజా ప్రభుత్వంలో శరవేగంగా అనుమతులు సాధిస్తున్నారు.
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ప్రణాళిక, ఆర్థిక, ఇంధన శాఖా మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిథ్యం వహిస్తోన్న మధిర నియోజకవర్గంలో మరో కీలక పురోగతికి బీజం పడింది. ప్రజారోగ్యం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం మధిర నియోజకవర్గంలో ఏకంగా రెండు ఆసుపత్రులను మంజూరు చేసింది. సాదా సీదాగా కాదు.. యాభై పడకల ఆసుపత్రులు మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పటిదాకా నియోజకవర్గం పరిధిలో ఎవరికైనా హెల్త్ ఎమర్జెన్సీ ఏర్పడినా, ఎవరైనా తీవ్రమైన అనారోగ్యాలకు గురైనా, అత్యవసర వైద్య చికిత్స కోసం ఉమ్మడి జిల్లా కేంద్రం అయిన ఖమ్మం తీసుకెళ్లాల్సిన అనివార్య పరిస్థితి ఉండేది. అయితే, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. డిప్యూటీ సీఎంగా ఓ వైపు రాష్ట్ర మంతటికీ ప్రాతినిథ్యం వహిస్తూనే.. తన మంత్రిత్వ శాఖలను నిత్యం పర్యవేక్షిస్తూనే.. తన సొంత నియోజకవర్గం మధిరపైనా ప్రత్యేక దృష్టి సారించారు. సందర్భాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ముందడుగు వేస్తున్నారు.
ఈ క్రమంలోనే మధిర నియోజకవర్గంలోని ముదిగొండ, ఎర్రుపాలెం మండల కేంద్రాల్లో 50 పడకల ఆసుపత్రులను ప్రభుత్వం మంజూరు చేసేలా భట్టి విక్రమార్క చొరవ చూపించారు. ఆ కృషి ఫలించింది. మధిర నియోజకవర్గంలోని రెండు మండల కేంద్రాల్లో అత్యాధునిక 50 పడకల ప్రభుత్వాసుపత్రుల నిర్మాణానికి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ముదిగొండ, ఎర్రుపాలెం మండల కేంద్రాల్లో 50 పడకల ఆసుపత్రిలో నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వం రూ. 22 కోట్లు ఖర్చు చేయనుంది.
ఇంతకాలం ప్రాథమిక వైద్యానికే పరిమితమైన ముదిగొండ, ఎర్రుపాలెం మండల కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రజా ప్రభుత్వం తాజా నిర్ణయంతో చిన్నపిల్లల అనారోగ్యం, ఎముకలు సమస్యలు, మహిళల అనారోగ్యం తోపాటు సాధారణ జబ్బులకు ఎండి స్థాయి రైతులు మండల కేంద్రంలోనే మ కాం వేసి వైద్య సేవలు అందించనున్నారు. ఆధునిక భవనం, రోగం నయం అయ్యే వరకు ఆస్పత్రిలోనే ఉండి చికిత్స పొందేందుకు అవసరమైన అన్ని సదుపాయాలు కొత్త ఆసుపత్రిలో అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వం తాజా నిర్ణయంతో రెండు మండలాల్లో లక్షలాదిమంది నిరుపేద, మధ్య తరగతి వర్గాలకు ఉచితంగా మెరుగైన వైద్యం అందుబాటులోకి రానుంది.
మధిర నియోజకవర్గంలోని రెండు మండల కేంద్రాల్లో ఏకంగా 50 పడకల ఆసుపత్రుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో నియోజక వర్గంలో సంతోషం వెల్లి విరుస్తోంది. నియోజక వర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కోట్ల రూపాయల నిధులను వెచ్చిస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కృషిని మరువబోమంటున్నారు నియోజకవర్గ జనం.