పార్టీలకు అతీతంగా పనిచేసి స్పీకర్ పదవికే వన్నె తెచ్చిన మహనీయుడు దుద్దిళ్ల శ్రీపాద రావు అని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. తమ నాన్న గారైన శ్రీపాద రావును 26 సంవత్సరాల క్రితం కోల్పోయామని, కానీ.. ఇప్పటికీ ఆయన ప్రజల గుండెల్లో చిరంజీవిగానే ఉన్నారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో ఆదివారం నిర్వహించిన దుద్దిళ్ల శ్రీపాద రావు 88వ జయంతి వేడుకల్లో.. సభను ప్రారంభించిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు.. అనంతరం ప్రసంగించారు.
తన పనితీరుతో పార్టీలకు అతీతంగా శ్రీపాదరావు అభిమానులను సంపాదించుకున్నారని చెప్పారు. అందర్నీ కలుపుకొని వెళ్ళారని, ప్రజల కోసమే చివరి క్షణం వరకు తపించారని కొనియాడారు. అదే స్ఫూర్తితో ఆయన చూపిన అడుగు జాడల్లోనే తమ కుటుంబ సభ్యులందరం నడుచుకుంటున్నామన్నారు. నాన్న గారు భౌతికంగా తమ నుంచి దూరమైనా.. ఆయన ఆశయాలు, ఆలోచనలు తమతోనే ఉన్నాయని, వాటిని ముందుకు తీసుకెళ్లాల్సిన బృహత్తర బాధ్యత తమపై ఉందని శ్రీపాదరావు అన్నారు.
తాము ప్రజలకు చేయాల్సింది చాలా ఉందని, ప్రజలు తమపై చూపించే అభిమానం, ప్రేమకు సదా కృతజ్ఞులమన్నారు. తమ చివరి శ్వాస వరకు ప్రజల కోసమే పని చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో శ్రీపాద రావు లేని లోటును పూడ్చలేనిదని, తనదైన పని తీరుతో రాష్ట్ర రాజకీయాలపై తనదైన ముద్రను వేసుకున్నారన్నారు.
శ్రీపాద రావు జయంతి వేడుకలను ప్రభుత్వం తరఫున అధికారికంగా నిర్వహించడం ఆయనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. ఇందుకు సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితర ప్రభుత్వ పెద్దలకు తమ కుటుంబం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. దుద్దిళ్ల శ్రీపాద రావుపై అభిమానంతో పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన
బీజేపీ శాసన సభ్యులు పాల్వాయి హరీష్, పైడి రాకేష్ రెడ్డికి ధన్యవాదాలు తెలియ జేశారు మంత్రి శ్రీధర్ బాబు.