30.2 C
Hyderabad
Thursday, April 23, 2026

Live Video

spot_img

తెలంగాణలో కళలకు ప్రోత్సాహం – డిప్యూటీ సీఎం భట్టి

  • కళల పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్న ప్రజా ప్రభుత్వం

  • రాష్ట్ర ప్రభుత్వం నుంచి కళకారులకు మెండుగా ఆశీస్సులు

  • సినిమా కళాకారులకు ఉగాదిన గద్దర్ ఫిలిం ఆవార్డులు

  • నాటకరంగ కళకారులకు అవార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం

  • తిరువయ్యూర్‌లో జరిగే త్యాగరాజ ఆరాధనోత్సవాల మాదిరిగా భక్తరామదాసు జయంతి ఉత్సవాలు

  • ఎల్బీ స్టేడియంలో భక్త రామదాసు జయంతి ఉత్సవాలు

  • ముఖ్య అతిధిగా పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు

  • హాజరైన మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క

ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో పెద్ద ఎత్తున కళలను ప్రోత్సహిస్తున్నదని, కళాకారులకు ప్రభుత్వం నుంచి మెండుగా ఆశీస్సులు ఉంటాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో కళలను ముందుకు తీసుకువెళ్లే వారికి కావలసిన అన్ని రకాల వసతులు, సౌకర్యాలను ప్రజా ప్రభుత్వం కల్పిస్తున్నదని తెలిపారు.

ఆదివారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియం ఇండోర్ స్టేడీయంలో తెలంగాణ సంగీత నాటక ఆకాడమి ఆధ్వర్యంలో నిర్వహించిన భక్తరామదాసు జయంతి ఉత్సవాల కార్యక్రమానికి భట్టి విక్రమార్క ముఖ్య అతిధిగా హాజరయ్యారు. మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, సీతక్కలతో కలిసి జయంతి ఉత్సవాల సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేశారు. సంగీత విద్వాంసులను ఈ సందర్భంగా పట్టుశాలువా కప్పి, జ్ఞాపికలను అందజేసి ఘనంగా సత్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో సంగీత కళకారులు, వాగ్గేయకారులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి యేటా తమిళనాడు తిరువయ్యూర్‌లో జరిగే త్యాగరాజ ఆరాధనోత్సవాల మాదిరిగా ఇకపై ప్రతియేటా తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా భక్త రామదాసు జయంతి ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు.

భక్త రామదాసు 392 జయంతి ఉత్సవాలను ప్రజా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నదని, హైదరాబాదులో నిర్వహించిన ఈ ఉత్సవాలకు ప్రముఖ సంగీత విద్వాంసులు పద్మశ్రీ డా. యెల్లా వెంకటేశ్వరరావు, పద్మశ్రీ డా. శోభారాజు, కళారత్న పురస్కార గ్రహీతలు హైదరాబాద్ బ్రదర్స్ రాఘవాచారి, హైదరాబాద్ సిస్టర్స్ హరిప్రియ, ప్రేమా రామమూర్తి, కోవెల శాంత, డివి మోహన్ కృష్ణ తదితర ఉద్దండులు పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. శ్రీ భక్త రామదాసు జన్మించిన జిల్లా నుంచి తాను ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు చాలా గర్వంగా ఉందన్నారు. తానిషా పాలనల్లో తహశీల్దారుగా ఉన్న రామదాసు ప్రజల నుంచి వసూలు చేసిన శిస్తు డబ్బులను పాలకులకు పంపించకుండా శిథిలావస్థలో ఉన్న భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని నిర్మించి తానిషా ప్రభువుల ఆగ్రహానికి గురై గోల్కొండ కోటలో ఖైదీగా మారిన చరిత్ర మనకు తెలిసిందేనని అన్నారు. ప్రభుత్వ సొమ్మును రామమందిర నిర్మాణం కోసం దుర్వినియోగం చేశాడన్న అభియోగంతో గోల్కొండ కోటలోని జైలులో ఖైదీగా చేసి, చిత్రహింసలు పెట్టినప్పటికీ తన భక్తిని కోల్పోకుండా కీర్తనలు చేసిన గొప్ప భక్తిపరుడు భక్త రామదాసు అని గుర్తు చేశారు. భక్త రామదాసును స్ఫూర్తిగా తీసుకొని అనేకమంది సంగీత విధ్వాంసులుగా, వాగ్గేయకారులుగా ఎదగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. భక్తిరస వాగ్గేయకారులు కీర్తనలు, సంకీర్తనలను మౌఖికంగా ప్రచారం చేస్తూ భవిష్యత్తు తరాలకు అందించాలన్నారు.

గత దశాబ్ద కాలంగా సినిమా కళాకారులకు ప్రోత్సాహం అందలేదని, ప్రతియేటా వారికి ఇవ్వాల్సిన నంది అవార్డులు ఇవ్వకుండ గత పాలకులు నిర్లక్ష్యం చేశారని ఆవేధన వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే కళాకారులను ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకొని సినిమా కళాకారులకు గద్దర్ పేరిట గద్దర్ ఫిలిం అవార్డులను ఈ ఉగాది పండుగ నుంచి ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అందుకు కావలసిన అన్ని చర్యలు చేపట్టిందని వివరించారు. నాటక రంగంలో రాణిస్తున్న కళాకారులను కూడా ప్రోత్సహించాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. తెలంగాణ నాటక అకాడమీ చైర్మన్ అలేఖ్య పుంజాల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాటక రంగ కళాకారులకు అవార్డులు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా నాటక పోటీలను నిర్వహించి, నాటక పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కళాకారులకు ప్రభుత్వం అవార్డులు ఇస్తుందని వెల్లడించారు. భగవంతుడు అందరికీ కళలను ఇవ్వలేదని, కొంత మందికి మాత్రమే కళలను ఇచ్చాడని, భగవంతుడు ఇచ్చిన ఆ కళను ప్రజలకు పంచి కళకారులు సమాజ వికాసానికి దోహదపడాలని కోరారు.కళకారులకు ప్రభుత్వం నుంచి మెండుగా ఆశీస్సులు ఉంటాయని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని మీ అందరికి చెప్పమని నన్నూ ఇక్కడికి పంపించారని చెప్పారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com