మేమే మ్యాచ్‌లను నిర్వహిస్తాం.. ఎవ్వరైనా మా దేశానికి వచ్చి ఆడాల్సిందే.. అంటూ గొప్పలకు పోయి.. ఈ సారి కూడా కప్పు మాదే అంటూ తొడగొట్టిన పాకిస్థాన్.. ఇప్పుడు తల ఎత్తుకోలేని పరిస్థితి నెలకొంది. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఇప్పుడు అత్యంత అవమానకరమైన పరిస్థితిలో నిష్క్రమించింది. ప్రస్తుతం పాయింట్స్ పట్టికలో ఆ టీమ్ స్థానం అట్టడుగు అని చెప్పాలి. ఈ మొత్తం ట్రోఫీలో కేవలం ఒకటే పాయింట్ దక్కించుకుంది పాకిస్థాన్. అది కూడా బంగ్లాదేశ్-పాక్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు కావడంతో ఆ పాయింట్ వచ్చింది. ఒకవేళ మ్యాచ్ జరిగి మ్యాచ్ గెలిచి ఉంటే కాస్త హుందాగా పక్కకు తప్పుకునేది. కానీ ఓడిపోయి ఉంటే ఆ ఒక్క పాయింట్ కూడా వచ్చేది కాదు.
30 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీకి హోస్ట్‌గా నిలిచింది పాకిస్థాన్. ఈ ట్రోఫీ నిర్వహించేందుకు భారీగా ఖర్చు చేసింది. స్టేడియాలను సిద్ధం చేసింది. అంతేకాదు చివరి సీజన్ అంటే 2017లో ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడిన పాకిస్థాన్.. ఈసారి కూడా టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగింది. కానీ మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో ఏకంగా 60 పరుగుల తేడాతో ఓడింది. ఇక దుబాయ్‌లో భారత్‌తో జరిగిన పోరు గురించి అయితే ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. ఈ రెండు ఓటములతోనే పాకిస్థాన్ ప్రయాణం ముగిసింది.ఇక రావాల్పిండి వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో అయినా గెలిచి పరువు నిలుపుకుంటుంది అనుకుంటే వర్షం అడ్డంకిగా మారింది. నిలకడగా వర్షం కురవడంతో ఈ మ్యాచ్‌ను రద్దు చేయాలని నిర్ణయించారు. అంతేకాదు ఈ ఓటములతో అత్యంత చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ హోస్ట్ చేసిన టీమ్ ఒక్క విజయం సాధించకుండా ట్రోఫీ నుంచి వైదొలగడం గడచిన 23 ఏళ్లలో ఇదే తొలిసారి.
ఈ మ్యాచ్ రద్దు అవ్వడంతో బంగ్లాదేశ్ కూడా ట్రోఫీ నుంచి నిష్క్రమించింది. బంగ్లాదేశ్ కూడా పాయింట్ల పట్టికలో ఒక పాయింట్‌తో నిలిచింది. అయితే పాక్ కంటే కాస్త మెరుగైన రన్ రేట్ ఉండటంతో చివరి నుంచి రెండో స్థానాన్ని దక్కించుకుంది.