ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకుపోయిన ఎనిమిది మందిని కాపాడేందుకు రాష్ట్రప్రభుత్వం సీరియస్గా చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు సూచించారు. అవసరం అయితే అదనపు బృందాలను రప్పించి అయినా వేగంగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వేగం పెంచాలని, గడిచిన ఆరు రోజుల్లో తట్టెడు మట్టి మాత్రమే తెచ్చారు తప్ప.. ఏమీ చేయలేదని విమర్శించారు. మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డితో కలిసి ఇవాళ హరీష్రావు.. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు వెళ్లి సహాయక కార్యక్రమాలను పరిశీలించారు.
రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నందున ఆటంకం కలగకుండా కొద్దిరోజులు ఆగి వెళ్లాలని తమ పార్టీ అధినేత కేసీఆర్ సూచించడం వల్లే ఇన్నాళ్లుగా ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు రాలేదని హరీష్రావు చెప్పారు. ఆరు రోజులైనా ప్రభుత్వం చేసిందేమీ లేదని గ్రహించే ఇవాళ ఇక్కడికి వచ్చామన్నారు. బాధితులను పరామర్శించేందుకు, సహాయక చర్యలను పరిశీలించేందుకు వస్తే అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు టన్నెల్ లోపలికి వెళ్తున్నారని, జల వనరుల శాఖ మంత్రిగా పనిచేసిన తనను లోపలికి వెళ్లనీయక పోవడం విడ్డూరమన్నారు. బాధ్యత గల మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వస్తే ఎలా అడ్డుకుంటారన్నారు.
వివిధ బృందాల మధ్య సమన్వయం సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని హరీష్రావు విమర్శించారు. మంత్రులు రోజూ ఉదయం వస్తున్నారు.. సాయంత్రం వెళ్తున్నారని, ఇదేమైనా టూరిస్ట్ ప్లేసా అని ప్రశ్నించారు హరీష్ రావు. 8 మంది ప్రాణాలు కాపాడటం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా? అని సందేహం వ్యక్తం చేశారు. వాళ్ల ప్రాణాలు కాపాడటంలో ప్రభుత్వం వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందన్నారు. టన్నెల్ పనులు తిరిగి ప్రారంభించేటప్పుడు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఇచ్చిందా? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్స్ మెకానిక్ వాళ్ళ ఒపినియన్ తీసుకున్నారా? ఉంటే ఆ రిపోర్టులు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఆదరా బాదరా, ఆగమాగం చేసి ప్రాణాలు బలిగొన్నరని, ఇప్పుడు.. ప్రాజెక్టు కుప్పకూలిపోయే పరిస్థితి తెచ్చారని విమర్శించారు.