- గతంలో విమర్శించిన వారి అరెస్టులతో దద్దరిల్లుతున్న ఏపీ
- దశాబ్ద కాలంలో ఏపీలో దిగజారిన రాజకీయాలు
- ఆరోపణలు, దూషణల్లో ఒకరిని మించి ఒకరు
- ఇవి డైవర్షన్ పాలిటిక్స్ అంటున్న వైసీపీ
- కూటమి అగ్రనేతల అభిమానుల మనోభావాలు దెబ్బతింటున్నాయి… జాగ్రత్త
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ప్రతీకారేచ్ఛతో ప్రత్యర్థుల వేటను కొనసాగిస్తోంది. ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా ఫ్రంట్ లైన్ ప్లేయర్స్ అందరినీ అరెస్టులు చేసి తిప్పిన పోలీసు స్టేషన్ తిప్పకుండా తిప్పుతోంది. అంతటితో ఆగకుండా వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన మాజీ ఎంపీ నందిగం సురేష్ మాజీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీలను కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. తాజాగా అన్నీ మానుకుని ఇంట్లో కృష్ణా, రామా అనుకుంటున్న పోసాని కృష్ణ మురళిని కూడా కేసేంటో చెప్పకుండా మరుసటి రోజు తేదీ వేసి నోటీసులు ఇచ్చి మరీ అరెస్ట్ చేసి రాయచోటి తీసుకుపోయారు ఆంధ్రా పోలీసులు. ఇవన్నీ కూటమి ప్రముఖుల రివేంజ్ అరెస్టులే అనేది బహిరంగ రహస్యం. ఈలెక్కన చూస్తే సమీప భవిష్యత్తులో వైసీపీ ఫైర్ బ్రాండ్లు, అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుని, నారా లోకేష్‌ని, పవన్ కళ్యాణ్ని విమర్శించిన మాజీ మంత్రులు ఆర్కే రోజా, కొడాలి నాని, జోగి రమేష్, పేర్ని నాని, అంబటిరాంబాబు లాంటి నేతలంతా అరెస్ట్ కాక తప్పదనే ప్రచారం ఊపందుకుంది. వీరితో పాటు ప్రముఖ సినీ దర్శకుడు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌ల క్యారెక్టర్లు పెట్టి సినిమాలు తీయడమే కాకుండా ఆ సినిమాల ప్రచారానికి కూడా ఆ ముగ్గురినీ విచ్చలవిడిగా వాడేశాడు. పరిస్ధితులు చూస్తే ఆర్జీవీకి కూడా అరెస్ట్ తప్పేలా లేదు. వీరందరూ గతంలో ప్రవర్తించిన ప్రవర్తన విషయంలో కూడా త్వరలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ అభిమానుల మనోభావాలు ఇప్పుడు దెబ్బతిని కేసులు పెట్టకపోరు వీరి అరెస్టులు జరగకపోవు.
జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత దూషణలు చేశారంటూ సినీనటుడు, రచయిత పోసాని కృష్ణమురళిని రాజంపేట పోలీసులు నిన్న అరెస్టు చేయడం సినీ, రాజకీయ వర్గాలకు పెద్ద కుదుపు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతోందన్న వైసీపీ ఆరోపణలకు బలం చేకూర్చేలా ప్రత్యర్ధులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. పోసాని అరెస్టుకు కారణం రెండేళ్ల క్రితం ఆయన సోమాజీ గూడా ప్రెస్ క్లబ్‌లో పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత దూషణలు, విమర్శలకు పాల్పడ్డారన్న ఆరోపణలు. పవన్ పై వ్యాఖ్యలు చేసినందుకు ఆయన వీరాభిమాని, జనసేన కార్యకర్త రాయలసీమకు చెందిన మణి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అన్నమయ్య జిల్లా, ఓబుళవారిపల్లెకు చెందిన పోలీసులు ఆయన్ను హైదరాబాద్‌లోని ఆయన అపార్టుమెంటులో అరెస్టు చేశారు. పోసాని అరెస్టుకు పవన్ పై తీవ్ర విమర్శలు చేయడమే. అయితే పోసాని అలా స్పందించడానికో కారణముంది. పవన్ అభిమానులు, జన సైనికులు పోసాని భార్యకు ఫోన్ చేసి రాయడానికి వీల్లేని భాషలో బూతులు తిట్టడం, బెదిరింపులకు పాల్పడటమే. దానికి ప్రతిగానే ఆయన ప్రెస్ క్లబ్‌లో ప్రత్యేక మీటింగ్ పెట్టి నోటికి పని చెప్పి కక్ష తీర్చుకున్నారు. దీనికి జనసేన చెబుతున్నది పవన్ ను దూషిస్తే ఊరుకునేది లేదు ఏమైనా చేస్తాం అని. ఏంత దూరమైనా వెడతాం అనేది. పోసాని మీద వేర్వేరు పోలీస్ స్టేషన్లలో పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.
దిగజారిన పోకడలు..
రాజకీయాల్లో విమర్శలు ఎప్పుడో శృతి మించిపోయాయి. వ్యక్తిగత దూషణల రేంజ్ కూడా దాటిపోయి దిగజారి బూతులు తిట్టుకోడం, వ్యక్తిత్వహననమే పనిగా రాజకీయాల స్థాయి దిగజారిపోయింది. అధినేతలను తిడితే కార్యకర్తల మనోభావాలు దెబ్బ తింటాయి. దెబ్బతింటే వారు చెలరేగుతారు. అధికారం తమదే కాబట్టి అరెస్టులు, రాష్ట్రమంతటా తిప్పడాలు..రచ్చ రచ్చ ..ఇది కూటమి రాజకీయాల పోకడ.. టీడీపీ రెండోసారి అధికారం దక్కించుకున్నాక సంపద సృష్టి, సూపర్ సిక్స్ లూ పక్కన పెట్టేసింది. మళ్లీ అధికారం దక్కుతుందో లేదో.. ఇప్పుడే బదులు తీర్చేసుకోవాలి అన్నట్లుగా ప్రవర్తిస్తోందన్నది చిన్న పిల్లాడికి సైతం అర్ధమవుతుంది. గతంలో చంద్రబాబు, లోకేష్ లను విమర్శించారన్న ఆరోపణలపై ఆర్జీవిని అరెస్టు చేసేందుకు ఒంగోలు పోలీసులు విశ్వ ప్రయత్నంచేసి చివరకు విచారణకు పిలిచి వదిలేశారు. ఆర్జీవి తిక్క తనం, లా టెక్నికాలిటీస్ మీద అవగాహన ఉండటం వల్ల ఆయనపై కక్ష సాధింపు గానీ, అరెస్టుల వరకూ వెళ్లడం పోలీసులకు కత్తి మీద సామె. కూటమి అధికారంలోకి వచ్చాక పాత కక్షలు తీర్చుకోవడమే ఎజెండాగా పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ బదులు తీర్చుకునే పనిలో పడ్డారా? నిజానికి పోసాని ఆ వ్యాఖ్యలు రెండేళ్ల క్రితం చేశారు. అదీ జనసేన నేతలు తన భార్యను తిట్టడం వల్ల..దానికి ముందు ఆయన పవన్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఆ తర్వాత రకరకాల కారణాలతో ఆయన రాజకీయాలకు గుడ్ బై కొట్టి ప్రశాంతంగా బతుకుతున్నారు. ఇప్పుడు అధికారం దక్కాక కూటమి పాత చరిత్రలు తవ్వి తీసి ఒక్కొక్కరిపైనా కేసులు కడుతోంది. ఇప్పటికే మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లాంటి నేతలు కటకటాల పాలయ్యారు.
అధినేతను విమర్శించినా, తిట్టినా, పార్టీ కింది స్థాయి కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటున్నాయి. దాంతో వాళ్లు కేసులు పెడుతున్నారు. దాని ఆధారంగా అరెస్టులు జరుగుతున్నాయి. కక్ష సాధింపు లేదా బదులు తీర్చుకోవడానికి కూటమి మోడస్ ఆపరండీ ఇది. పలుకుబడి, డబ్బు,హోదా కలిగిన రాజకీయ నేతలకు ఇవి పెద్ద సమస్యలు కాకపోవచ్చు కానీ సాధారణ వైసీపీ కార్యకర్తలు మాత్రం ఈ అరెస్టులతో నరకం చవిచూస్తున్నారన్నది చేదు నిజం. గతంలో తెలంగాణలో ఉంటున్న ఏపీకి చెందిన ఒక జంటను ఇలాగే అరెస్టు చేసి రాష్ట్రంలో అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకూ అన్ని పోలీస్ స్టేషన్లకూ తిప్పారు. వారిని కొట్టడం, వేధింపులకు గురిచేయడం, తప్పు చేసినట్లు అంగీకరించమని ఒత్తిడి చేయడం లాంటి చర్యలకు పోలీసులు పాల్పడ్డారని ఆ జంట విడుదలయ్యాక ఆరోపించింది. వారికి చిన్న పిల్లలున్నారన్నా కనికరం లేకుండా మూడు నెలల పాటూ జైలు పాల్జేశారన్న విమర్శలున్నాయి. పంటికి పన్ను..కంటికి కన్ను… రాజకీయాల పోకడ ఏం సందేశం ఇస్తున్నట్లు?