ఏపీలో ఏనుగుల దాడుల్ని నివారించేందుకు కర్ణాటక నుంచి శిక్షణ పొందిన కుంకీ ఏనుగుల్ని తెచ్చేందుకు ఆ రాష్ట్రంతో ఒప్పందం చేసుకుని ఐదు నెలలు దాటింది. గత ఏడాది ఆగస్టు 8న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా బెంగుళూరు వెళ్లి కుంకీ ఏనుగుల కోసం సీఎం సిద్ధరామయ్యను అభ్యర్థించారు.ఆ తర్వాత కర్ణాటక అటవీ శాఖతో గత ఏడాది సెప్టెంబర్ 27న కుంకీ ఏనుగుల కోసం విజయవాడలో ఒప్పందం చేసుకున్నారు. కర్ణాటకలో శిక్షణ పొందిన ఏనుగులతో ఏపీకి చెందిన అటవీ సిబ్బంది శిక్షణ కూడా ఇప్పిస్తున్నట్టు ప్రచారం జరిగింది. ఐదు నెలలు గడిచినా కుంకీ ఏనుగుల జాడ మాత్రం లేదు.
కర్ణాటక నుంచి 8 కుంకీ ఏనుగులను ఆంధ్రప్రదేశ్ పంపేందుకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య సెప్టెంబర్ 27న విజయవాడలో అవగాహన ఒప్పందం జరిగింది. దీంతో కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులు వచ్చేస్తాయని అటవీ శాఖ చెప్పింది. దీంతో చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో తరచూ ఏనుగుల దాడులకు ముగింపు లభిస్తుందని భావించారు.కుంకీ ఏనుగుల కోసం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా చొరవ తీసుకోవడంతో వీలైనంత త్వరగా ఏనుగులు ఏపీకీ వచ్చేస్తాయని భావించారు. అయితే అటవీ శాఖ నియమనిబంధనలు ఏనుగుల తరలింపుకు అడ్డంకిగా మారాయి. వన్య ప్రాణుల తరలింపు, వాటి సంరక్షణ విషయంలో ఉన్న నిబంధనలతో ఏపీకి కుంకీ ఏనుగుల తరలింపు ఆలస్యమైనట్టు తెలుస్తోందిఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, కడప జిల్లాలకు పొరుగు రాష్ట్రాలతో సరిహద్దులు ఉన్నాయి. చిత్తూరు జిల్లాకు తమిళనాడు, కర్ణాటక అటవీ ప్రాంతాల నుంచి వచ్చే ఏనుగులు తరచూ దాడులు చేస్తున్నాయి. ఇటు ఉత్తరాంధ్రలో ఒడిశా అటవీ ప్రాంతం నుంచి వచ్చే ఏనుగులు తరచూ ప్రజలపై దాడులు చేస్తున్నాయి.అటవీ ప్రాంతాలకు దగ్గర్లో ఉన్న గ్రామాల్లోని పంట పొలాలు, ఊళ్లపై ఏనుగుల మందలు తరచుగా దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో ప్రాణ నష్టం జరుగుతోంది. గ్రామస్తులు కొన్ని సార్లు ఏనుగులు అదలించి, శబ్దాలు చేసి తరిమి కొడుతున్నా తరచూ గాయపడటమో, ప్రాణ నష్టమో తప్పడం లేదు.ఏనుగులు గుంపు, గుంపులుగా దాడులు చేస్తే భారీ నష్టం వాటిల్లుతోంది. ఏనుగులు మందలుగా పంటల్ని సర్వనాశనం చేస్తున్నాయి. కనిపించిన మనుషుల్ని తొక్కి చంపేస్తున్నాయి.
ఏపీలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, చిత్తూరు జిల్లాల్లో ఈ పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి.సాధారణంగా వీటిని ఎదుర్కోవడం, వాటిని అడవుల్లోకి తిప్పి పంపడం కష్టం. అదే శిక్షణ పొంన కుంకీలతో వాటిని కట్టడి చేయడం సులువుగా ఉంటుంది. వాటిలో సుశిక్షుతులైన మావటిలు జనావాసాల్లోకి వచ్చిన ఏనుగుల్ని వెనక్కి తరుముతారు.అడవుల్లో ఒంటరిగా తిరిగి మగ ఏనుగుల్ని బంధించి కుంకీ ఏనుగులుగా లొంగదీసుకుంటారు. ఏనుగుల మందల్ని అడవుల్లోకి తరమడంలో ఇవి సమర్ధంగా వ్యవహరిస్తాయి. ఒక్కోసారి వాటితో తలపడతాయి. బలంగా, వయసులో ఉన్న ఏనుగుల్ని పోరాటాల కోసం తయారు చేస్తారు.ఆంధ్రప్రదేశ్లో శిక్షణ పొందిన కుంకీ ఏనుగుల కొరత ఉంది. ప్రస్తుతం ఏపీలో జయంత్, వినాయక్ అనే రెండు కుంకీలు ఉన్నాయి. అయితే అవి వయసు పైబడ్డాయి.
చిత్తూరు జిల్లా కౌండిన్య అడవుల్లో ప్రభుత్వం నిర్వహిస్తున్న ననియాల సంరక్షణ కేంద్రంలో ఈ రెండు ఉన్నాయి. ప్రస్తుతం ఎక్కడకు పడితే అక్కడకు తరలించేందుకు అనువుగా లేవు.తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏనుగులు దాడి జరిగినా వీటినే తీసుకు వెళ్లేవారు. వృద్ధాప్యంలో ఉన్న ఏనుగులతో మందలపై యుద్ధాలకు వెళ్లడం సాధ్యం కాకపోవడంతో కర్ణాటకతో ఒప్పందం చేసుకున్నారు.కర్ణాటకతో చేసుకున్న ఒప్పందం మేరకు ఏపీకి 8 కుంకీ ఏనుగులు రావాల్సి ఉంది. అయితే సాంకేతిక కారణాలతో వీటి రాక ఆలస్యమైనట్టు అటవీ శాఖ చెబుతోంది. ప్రస్తుతం కర్ణాటక అటవీ శాఖ మంత్రి వద్ద కుంకీల బదలాయింపు ఫైల్ పెండింగ్లో ఉంది. అక్కడ నుంచి కర్ణాటక సీఎం అమోదం లభించాల్సి ఉంటుంది. తొలి విడతలో మార్చిలోగా నాలుగు కుంకీ ఏనుగులు ఏపీకి వస్తాయని చెబుతున్నారు.మరోవైపు కర్ణాటక నుంచి వచ్చే ఏనుగుల కోసం మావటిలకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. కొత్త ఏనుగులను అదుపులో ఉంచేందుకు మావటిలను సిద్ధం చేస్తున్నారు. కుంకీల అవసరం, వాటి దాడుల నేపథ్యంలో ఏపీలోనే శాశ్వతంగా కుంకీల ఉత్పత్తి చేపట్టాలని డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్ భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా అటవీ శాఖ సన్నద్ధం అవుతోంది.