తెలంగాణలోని అన్ని పాఠశాలల్లో తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరిగా బోధించాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జిల్లా పరిషత్, మండల పరిషత్, ఎయిడెడ్, ఇతర బోర్డు అనుబంధ పాఠశాలల్లో ఒకటవ తరగతి నుంచి 10వ తరగతుల విద్యార్థులకు తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 9వ తరగతి విద్యార్ధులకు 2025-26 విద్యా సంవత్సరం నుంచి, పదో తరగతి విద్యార్ధులకు 2026-27 నుంచి ఈ నిర్ణయం అమలు చేసేలా చూడాలని విద్యాశాఖకు సూచించింది. కాగా, పాఠశాలల్లో తెలుగును తప్పనిసరిగా బోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం 2018లో తెలంగాణ చట్టాన్ని తీసుకువచ్చింది. అయితే, గత ప్రభుత్వం వివిధ కారణాల వల్ల పాఠశాలల్లో తెలుగు బోధనను పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయింది. రాష్ట్రంలో గతేడాది అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు అమలుకు పూర్తిస్థాయి చర్యలు తీసుకువచ్చింది. తదనుగుణంగా యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి, రాబోయే విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ వంటి ఇతర బోర్డు స్కూళ్లలో కూడా 9, 10 తరగతులకు తెలుగు సబ్జెక్టును బోధించాలనే నిర్ణయాన్ని తాజా ప్రకటన ద్వారా వెల్లడించింది. అయితే, బోర్డు విద్యార్థులకు తెలుగు సబ్జెక్టును సులభంగా బోధించడానికి ‘వెన్నెల’ అనే ‘సరళ తెలుగు’ పాఠ్యపుస్తకాన్ని ఉపయోగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ‘వెన్నెల-సరళ తెలుగు’ పాఠ్యపుస్తకాన్ని అమలు చేయడం వల్ల తెలుగు మాతృభాషగా లేని విద్యార్థులకు, ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
సింగిడి స్థానంలో వెన్నెల :
ఇతర సిలబస్ స్కూళ్లలోనూ 100 శాతం తెలుగు సబ్జెక్ట్ అమలు లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ‘సింగిడి’ పుస్తకాన్ని తీసుకొచ్చిన విషయం తెల్సిందే. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 9, 10 తరగతుల విద్యార్థులకు ‘వెన్నెల’ తెలుగు పుస్తకాన్ని బోధించాలని ప్రభుత్వం తాజాగా తెలిపింది. ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల విద్యార్థులు తెలుగు సబ్జెక్టును సులభంగా అర్థమయ్యేలా ‘వెన్నెల’ విధానాన్ని అమలు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. దీంతో, ఈ విధానాన్ని వచ్చే విద్యా సంవత్సరం 2025–26 నుంచి అమలు చేయాలని విద్యా శాఖ నిర్ణయించింది. వెన్నెల పాఠ్య పుస్తకం ఆధారంగానే తెలుగు పరీక్ష నిర్వహించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం మెమో ద్వారా పాఠశాల యాజమాన్యాలను కూడా ఆదేశించింది. అయితే, ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు చూద్దాం. విద్యార్థుల స్కోర్ కోసం సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ వంటి కొన్ని పాఠశాలలు సంస్కృతం సబ్జెక్ట్ పక్కాగా అమలు చేస్తున్నాయి. దీనివల్ల విద్యార్థులకు మార్కుల శాతం పెరుగుతుందని భావించారు. చాలామంది విద్యార్థులు కూడా దీన్ని ఫాలో అవుతూ వచ్చారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విద్యార్థులు సందిగ్ధంలో పడ్డారు. మధ్యలో తెలుగు సబ్జెక్ట్ అంటే కష్టంగా ఉంటుందని అంటున్నారు. మళ్లీ మొదట నుంచి తెలుగు నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు కొందరు విద్యార్థులు. సంస్కృతం సబ్జెక్ట్ తీసుకున్న విద్యార్థుల సంఖ్య ప్రైవేటు పాఠశాలల్లో ఎక్కువగా ఉందని అంటున్నారు. సాధారణంగా ఇంటర్ మీడియట్‌లో స్కోర్ కోసం సంస్కృతం సబ్జెక్ట్‌ను విద్యార్థులు ఎక్కువగా సెకండ్ లాంగ్వేజ్ సబ్జెక్ట్‌గా తీసుకున్న సందర్భాలు కనిపిస్తాయి. దీనివల్ల చాలా వరకు వందకు వంద స్కోర్ వస్తుందని ప్రైవేటు విద్యా సంస్థల యజమానులు చెబుతున్నారు.