ఐదుగురు యువకులకు యావజ్జీవ కారాగార శిక్ష
అనంతపురం జిల్లాలో కలకలంరేపిన యువకుని హత్య కేసులో జిల్లా కోర్ట్ సంచలన తీర్పు వెలువరించింది. నార్పలకు చెందిన మట్టి పవన్ కుమార్ 2022 ఏప్రిల్ 12వ తేదిన అతని స్నేహితుల చేతిలోనే దారుణహత్యకు గురయ్యాడు. ఈ హత్య చేసింది పవన్ కుమార్ స్నేహితులేనని పోలీసులు అప్పట్లోనే గుర్తించారు. పవన్ కుమార్, షాజిద్ మంచి స్నేహితులు. అయితే వారి మధ్య విబేధాలు రావడంతో షాజిద్ అతని స్నేహితులు పవన్ ను చంపుతామని బెదిరించారు. 2022 ఏప్రిల్ 12వ తేది మధ్యాహ్నం నార్పలలో వీరి మధ్య గొడవ జరిగింది. దీనిని మనసులో పెట్టుకుని సాజిద్ అతని స్నేహితులు అదే రోజు రాత్రి స్టీల్ రాడ్, రెండు కట్టెలు తీసుకొని పవన్ కుమార్ని దారుణంగా కొట్టి చంపారు. పవన్ ను చంపే సమయంలో వారు వీడియో కూడా తీసుకున్నారు. ఇందులో నాగేంద్ర తన సెల్లో రికార్డ్ చేసి సుధాకర్ సెల్ కు ఫార్వర్డ్ చేశాడు. అందులో సుధాకర్ అంటే ఒక బ్రాండ్ అంటూ రాడ్ తో ఇష్టానుసారంగా కొట్టే దృశ్యాలు ఉన్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఇప్పుడు అదే వీడియో ఐదుగురు నిందితులకు శిక్ష పడేలా చేసింది. ఈ కేసుకు సంబంధించి జిల్లా కోర్టులో విచారణ జరగ్గా ఇవాళ తీర్పు వచ్చింది. హత్య చేసిన ఐదు మంది జీవిత ఖైదుతో పాటు 20వేల జరిమానా విధించింది. ఇందులో ముద్దాయిలందరూ 25 సంవత్సరాల లోపు యువకులు కావడం ఇక్కడ గమనార్హం. మృతుడు పవన్ కుమార్ తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ తన కొడుకుని నిర్ధాక్షణ్యంగా చంపిన ఐదుగురికి శిక్ష పడటం ద్వారా తమకు న్యాయం జరిగిందని అన్నారు.