భారతదేశంలోనే అతిపెద్ద అంతర్జాతీయ అరేనా పోలో టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇచ్చే ఘనతను హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్ సొంతం చేసుకుంది. వరల్డ్ అరేనా పోలో ఛాంపియన్‌షిప్ 2025 పేరుతో జరిగే ఈ టోర్నమెంట్.. ఫిబ్రవరి 24వ తేదీన ప్రారంభమై.. మార్చి 2వ తేదీ వరకు జరుగుతుంది.
ఈ వరల్డ్ అరేనా పోలో చాంపియన్ షిప్‌లో రెండు భారతీయ జట్లతో పాటు, మెగా ఈవెంట్‌లో ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, స్పెయిన్, లక్సెంబర్గ్, బ్రిటన్, అమెరికా జట్లు పోటీ పడనున్నాయి.
హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్ కాంప్లెక్స్‌లో ప్రెసిడెంట్ చైతన్య ఆర్.కుమార్, సెక్రటరీ రియాజ్ అహ్మద్, భారత పోలో ప్లేయర్ అర్సలాన్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ.. భారత్‌లోనే అతిపెద్ద ఈ టోర్నమెంట్ కోసం 80 అగ్రశ్రేణి పోలో గుర్రాలను కేటాయించామన్నారు. ఫ్లడ్‌లైట్ల వెలుగులో మ్యాచ్‌లు జరుగుతాయని చెప్పారు. ప్రతి రోజు.. నాలుగు మ్యాచ్‌లు నిర్వహిస్తామని వారు తెలిపారు.
గెలాక్సీ కప్, ఎఎంఆర్ కప్, తెలంగాణ టూరిజం కప్ సహా మూడు విభాగాలలో ఛాంపియన్‌షిప్ కోసం దేశ, విదేశాల జట్లు పోటీ పడుతున్నాయన్నారు. అలాగే, హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్ కొన్ని ప్రత్యేక మ్యాచ్‌లను నిర్వహిస్తుందని, వాటిలో గెలాక్సీ కప్ ఫైనల్‌కు ముందు అంతర్జాతీయ మహిళల అరేనా పోలో మ్యాచ్ జరుగుతుందన్నారు. ఎఎంఆర్ కప్ ఫైనల్‌కు ముందు ‘బెస్ట్ ఆఫ్ బెస్ట్’ మ్యాచ్, తెలంగాణ టూరిజం కప్ ఫైనల్స్‌కు ముందు హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్ కప్ మ్యాచ్ జరుగుతాయన్నారు. ఇక, టోర్నమెంట్స్ ముగింపు రోజు ఫ్యాషన్ షో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుందన్నారు. ఈవెంట్‌కు సంబంధించిన వివరణాత్మక ఇన్‌సైట్స్, మ్యాగజైన్ స్పెషల్ ఎడిషన్, పాల్గొనే జట్ల వివరాలు, ప్లేయర్ ప్రొఫైల్‌లు వంటివి ఫిబ్రవరి 24వ తేదీన టోర్నమెంట్ ప్రారంభానికి ముందు విడుదల చేయనున్నట్లు చైతన్య కుమార్ తెలిపారు. హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్ కార్యకలాపాలకు, ఇక్కడ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ నిర్వహించేందుకు సహకారం అందిస్తున్న తెలంగాణ టూరిజంతో పాటు.. పలు సంస్థలకు ఆర్గనైజింగ్ కమిటీ కృతజ్ఞతలు తెలిపింది.
మరోవైపు.. ఇంటర్నేషనల్ పోలో టోర్నమెంట్‌కు సంబంధించిన జెర్సీని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశంతో హెచ్‌పీఆర్‌సీ ప్రతినిధులు ఆవిష్కరింపజేశారు.