32.2 C
Hyderabad
Thursday, April 23, 2026

Live Video

spot_img

రూ.కోటి విలువైన హెరాయిన్ తో లేడీ డాన్ అరెస్ట్

  • రాజధాని నడిబొడ్డున చీకటి వ్యాపారం
  • భారీ మొత్తంలో డ్రగ్స్ అమ్ముతూ దొరికిన కిలాడీ లేడీ
  • గ్యాంగ్ స్టర్ హషీం బాబా భార్య జోయా ఖాన్
  • సోషల్‌ మీడియాలో వేలమంది ఫాలోయర్లు
  • చేసేవన్నీ చట్టవ్యతిరేక చర్యలే
  • డ్రగ్స్ స్మగ్లింగ్, సరఫరాకు రారాణిగా జోయా
  • దావూద్, లారెన్స్ బిష్ణోయ్ తో లింకులు
  • వేర్వేరు జైళ్లనుంచే హషీం బాబా, బిష్ణోయ్‌ టెలిఫోన్ టాక్స్
  • ఈ క్రిమినల్ జంటది ఒళ్లు గగుర్పొడిచే చరిత్ర

దేశరాజధాని నడిబొడ్డున గుట్టుగా సాగుతున్న డ్రగ్స్ వ్యాపారం బట్టబయలైంది. దీనిని ఓ లేడీ డాన్ నడుపుతుండటం ఆశ్చర్యం గొలుపుతోంది. జోయాఖాన్ అనే 33 ఏళ్ల మహిళ  డ్రగ్స్ వ్యాపారం నిర్వహిస్తోందన్న సమాచారంతో పోలీసులు వలవేసి పట్టుకోగా ఆమె దొరికిపోయింది. ఆమె ఇంట్లో పెద్ద మొత్తంలో దాదాపు కోటి రూపాయల విలువైన 274 గ్రాముల హెరాయిన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

జోయాఖాన్  చాలాకాలంగా పోలీసుల కళ్లు గప్పి ఈ వ్యాపారం నిర్వహిస్తోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు కొన్నాళ్లుగా నిఘా వేసి ఈ లేడీ డాన్ ను పట్టుకున్నారు. జైలు పాలైన మరో డాన్ హషీం బాబా భార్య ఈ జోయాఖాన్. భర్త జైలు ఊచలు లెక్కబెడుతుంటే ఈమె మాత్రం అతని నేర సామ్రాజ్యానికి అధిపతి అయ్యి మాఫియా, అండర్‌వరల్డ్‌ గ్యాంగులను శాసిస్తోంది. తన నేర కార్యకలాపాలకు ఎక్కడా సాక్ష్యాలు లేకుండా జాగ్రత్త పడుతుండటంతో ఇన్నాళ్లూ పోలీసులకు అనుమానం వచ్చినా సరైన అదను కోసం వేచి చూశారు.

దావూద్ తో కలసి వ్యాపారం

నేరగాడు హషీం బాబాపై ఇప్పటికే 12 దాకా కేసులున్నాయి. హత్య, బెదిరింపులు, వసూళ్లు, ఆయుధాల స్మగ్లింగ్‌ లాంటి అనేక కేసులు ఇందులో ఉన్నాయి. పట్టుబడిన లేడీ డాన్ జోయాఖాన్ అతగాడికి మూడవ భార్య. 2017లో హషీం బాబాను పెళ్లి చేసుకున్న జోయాఖాన్ గతంలో మరో వ్యక్తిని పెళ్లాడింది. అతనితో విడాకులు పొందాక  ఈశాన్య ఢిల్లీలో తన పక్క పోర్షన్ లోనే ఉంటున్నహషీం బాబాతో పరిచయం ఏర్పడి అది పెళ్లికి దారి తీసింది.

హషీం బాబా నేర పూరిత కార్యకలాపాల్లో పట్టుబడ్డాక భర్త కార్యకలాపాలన్నీ జోయాఖాన్ చూస్తూ వచ్చింది. అండర్‌వరల్డ్‌ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ తో ఆమెకు సన్నిహిత సంధాలున్నాయి. దావూద్‌ అండర్‌వరల్డ్‌ కార్యకలాపాలు, సంఘ విద్రోహక చర్యలన్ని గతంలో హషీం బాబాయే చూసుకునేవాడు. ఇప్పుడు హషీం జైలు పాలు కావడంతో ఆ వ్యవహారాలన్నీ చూస్తున్న జోయా దావూద్ సోదరితో మంతనాలు మొదలు పెట్టింది. డ్రగ్స్ సరఫరా, బెదిరింపులు, బలవంతపు వసూళ్ల దందాలో జోయాఖాన్ పీకల్లోతు కూరుకుపోయిందని ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం అధికారులు చెబుతున్నారు.

జోయాఖాన్ మహా ఖతర్నాక్ లేడీ… హషీం బాబాలా ఆమె నేర కార్యకలాపాలు మోటుగా ఉండవు. హై ఫై పార్టీలలో తిరుగుతూ, ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటూ, వారికి తన ఇంట్లో పార్టీలిస్తూ హై ప్రొఫైల్‌ సర్కిల్‌ లో తిరుగుతుంది. ఖరీదైన దుస్తులు ధించడం, లగ్జరీ బ్రాండులు వాడటం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. ఈ కారణంగా ఈ క్రిమినల్‌ కి సోషల్‌ మీడియాలో ఫాలోయర్లు కూడా ఎక్కువగానే ఉన్నారు.

జైలునుంచే గైడెన్స్

తీహార్ జైల్లో మగ్గుతున్న భర్తను కలిసేందుకు తరచుగా వచ్చిన జోయాకు అతగాడు వ్యాపారంలో కిటుకులు, చిట్కాలు కోడ్‌ భాషలో చెప్పేవాడు. క్రిమినల్ గ్యాంగుల ఆర్థిక లావాదేవీలు, ఇతర వ్యవహారాలు ఎలా నడపాలో చెప్పేవాడు. జోయా జైలు బయట ఉన్న భర్త సహ నేరస్తులతో కూడా సంబంధాలు నెరపుతూ వ్యాపారాలు కొనసాగించింది. కొన్నేళ్లుగా స్పెషల్ బ్రాంచ్ పోలీసుల కంటికి జోయా కనపడకుండా చాలా గుట్టుగా తన వ్యాపారాలు నిర్వహించింది. చివరకు యూపీలోని ముజఫర్ పూర్ నుంచి తెప్పించిన కోటి రూపాయల విలువైన పెద్ద మొత్తం హెరాయిన్ ను తరలిస్తూ పోలీసులకు పట్టుబడింది. ఢిల్లీ గ్రేటర్ కైలాష్‌ ఏరియాలో ఓ జిమ్ ఓనర్ అయిన నదీర్ షా మర్డర్ కేసులో నిందితులకు జోయా ఆశ్రయం కల్పించిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆకేసులో అనేక మార్లు ఆమెను పోలీసులు ఇంటరాగేట్‌ చేశారు.

కుటుంబమంతా డ్రగ్స్ వ్యాపారంలోనే..

ఈ ఘటికురాలి కుటుంబం అంతా నేర చరిత్ర కలిగినదే. జోయా తల్లి అక్రమంగా సెక్స్ రాకెటింగ్‌ జరుపుతూ అరెస్టయ్యింది. తండ్రి డ్రగ్ సప్లయ్ వ్యాపారం చేసేవాడు. తండ్రి వ్యాపారంలో కూడా జోయా సహకరించేది. ఈశాన్య ఢిల్లీలోని అనేక లొకేషన్లలో జోయా డ్రగ్స్ వ్యాపారం జరిపేది. ప్రత్యేకించి హషీం బాబా చెంచారాయుళ్లు, మద్దతుదారులు నలుగురైదుగురు ఎప్పుడూ ఆమెకు పహారా కాస్తుండేవారు.

ఈశాన్య ఢిల్లీలో అక్రమ డ్రగ్స్ వ్యాపారం చేసే గ్యాంగులు చాలానే ఉన్నాయి. అందులో చెను గ్యాంగ్, నసీర్ పెహల్వాన్ గ్యాంగ్, హషీం బాబా గ్యాంగు ఇలా చాలానే ఉన్నాయి. మొదట్లో ఒకరికొకరు సహకరించుకుంటూ ఉన్న ఈ గ్యాంగులన్నీ వ్యాపారాల్లో స్పర్ధలు రావడంతో విడిపోవడమే కాక హత్యలకు పాల్పడ్డారు. 2007లో ఈ ఏరియాలో వరుస హత్యలు వెలుగు చూశాయి. లెక్కలేనన్ని ఆస్తులు సంపాదించిన హషీం బాబా వాటన్నింటినీ జోయా బ్యాంకు ఎక్కౌంట్లకు తరలించేవాడు.

బాలీవుడ్ నేరాలు, దాడులకూ లింకులు

హషీం బాబా నదీర్ షా మర్డర్ కేసులో గతేడాది అరెస్టయ్యాడు. అయితే పోలీసుల ఇంటరాగేషన్ తో నేరం ఒప్పుకున్న హషీం కరడుగట్టిన మరో గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సహకారంతోనే ఇవన్నీ చేసినట్లు తెలిపాడు. పంజాబ్ పాప్ సింగర్ సిద్దూ మూసేవాలా, ముంబైలో బాలీవుడ్‌ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర కాల్పులు తదితర నేరాలన్నింటిలోనూ హషీం బాబా పాత్ర ఉంది.

జైలు నుంచే అన్నీ ఆపరేషన్స్

హషీం బాబా లారెన్స్ బిష్ణోయ్ ల స్నేహం జైల్లోనే మొగ్గ తొడిగింది. ఇద్దరివి వేర్వేరు జైళ్లే అయినా ల్యాండ్ లైన్ ఫోన్లు, వీడియో కాల్స్ లో ఇద్దరూ తరచుగా సంభాషించుకుంటూ ఉండేవారు. జైల్లో ఉంటూనే పరస్పర సహకారంతో బయట నేర కార్యకలాపాలను సాగించేవారంటే వీరెంత డేంజర్ క్రిమినల్సో అర్ధమవుతుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com