తెలిసీ తెలియని వయసులో చేసిన వాట్సప్ చాటింగ్ ఓ బాలుడి ప్రాణాలు బలిగొంది. ఏడో తరగతి బాలికతో వాట్సప్‌లో చాటింగ్ చేసిన తొమ్మిదో తరగతి చదువుతున్న బాలుడు.. బాలిక కుటుంబ సభ్యుల వార్నింగ్‌తో బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మంచుపల్లి మండలం చుంచుపల్లి తండాలో జరిగిందీ సంఘటన.
చుంచుపల్లి తండాలో నివసించే మనోజ్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అదే తండాలో నివసించే బాలిక ఏడో తరగతి చదువుతోంది. మిగతా విద్యార్థుల మాదిరిగానే ఇద్దరూ రోజూ ఆటోలో స్కూల్‌కు వెళ్లి వస్తుంటారు. ఈ క్రమంలో మనోజ్.. ఆ బాలికతో తరచూ వాట్సప్‌లో చాటింగ్ చేసేవాడు.
మనోజ్ రోజూ వాట్సప్ చాటింగ్ చేయడాన్ని బాలిక కుటుంబ సభ్యులు గమనించారు. బాలికను మందలించడంతో పాటు.. మనోజ్‌కు కాల్ చేసి బెదిరించారు. బాలిక కుటుంబసభ్యులు బెదిరించడంతో మనోజ్ భయపడిపోయాడు. ఏం జరుగుతుందో, ఎవరేమంటారో అని వణికిపోయాడు. ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
మనోజ్.. క్రిమి సంహారక మందు తాగాడని తెలుసుకున్న తల్లి దండ్రులు అతన్ని వెంటనే ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మనోజ్మరణించాడు. ఈ సంఘటన చుంచుపల్లి తండాలో తీవ్ర విషాదం నింపింది.