ఉక్రెయిన్ – రష్యా యుద్ధానికి ఎండ్ కార్డ్ పడే విషయంలో మరో కీలక ఘటన జరిగింది. సౌదీలో అమెరికా-రష్యా మధ్య చర్చలు మొదలయ్యాయి. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని దిర్హియా ప్యాలెస్‌లో ఈ చర్చలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎలా ముగించాలన్నదానిపై చర్చలు జరుపుతున్నారు ఇరు దేశాల ప్రతినిధులు.
అమెరికా-రష్యా విదేశాంగ మంత్రులు మార్కో రూబియో, సెర్గీ లవ్రోవ్ ఈ భేటీలో పాల్గొన్నారు. వీరితో పాటు యూఎస్ వెస్ట్రన్ ఏసియా ఆఫీసర్ స్టీవ్ విట్‌కాఫ్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మైక్ వాల్ట్ కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఇక రష్యా తరఫున క్రెమ్లిన్ ప్రతినిధి యూరీ ఉస్కోవ్ కూడా హాజరయ్యారు. ఇక సౌదీ వైపు నుంచి ఆ దేశ మంత్రి ఫైజల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్, జాతీయ భద్రతా సలహాదారు ముసాద్ బిన్ మహమ్మద్ అల్ అబియన్ కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. 2022 జెనీవాలో మీటింగ్ తర్వాత ఇరు దేశాల దౌత్యవేత్తలు భేటీ కావడం ఇదే తొలిసారి.
అయితే ఈ భేటీపై విభిన్న ప్రకటనలు చేశాయి ఇరు దేశాలు. అసలు రష్యా ఈ యుద్ధాన్ని ముగించేందుకు సిద్ధంగా ఉందా? లేదా? అని తెలుసుకోవడానికే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు అమెరికా తెలిపింది. రష్యా మాత్రం తాము అమెరికాతో బంధాలను బలోపేతం చేసుకునేందుకు ఈ భేటీకి హాజరైనట్టు ప్రకటించింది. మరోవైపు ఈ భేటీలో ఉక్రెయిన్ తరపున ప్రతినిధులు పాల్గొనలేదు. అయితే ఈ చర్చలు ప్రారంభమవడానికి ముందు రష్యా కీలక ప్రకటన చేసింది. అవసరమైతే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో పుతిన్ చర్చించేందుకు సిద్ధంగా కూడా ఉన్నారని ప్రకటించింది. కానీ జెలెన్‌స్కీకి ఈ యుద్ధాన్ని ముగించడం ఇష్టం లేదని తెలిపింది.