భారత ప్రధాన ఎన్నికల అధికారిగా కేరళ క్యాడర్ విశ్రాంత ఐఏఎస్ అధికారి జ్ఞానేశ్ కుమార్‌ను కేంద్రం నియమించింది. ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ నేడు పదవీ విరమణ చేయనున్నారు. దీంతో సోమవారం కొత్త సీఈసీ ఎంపిక కోసం సమావేశం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో సీఈసీ ఎంపిక కమిటీ సమావేశమైంది. అయితే సీఈసీ ఎంపికను వాయిదా వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కానీ కేంద్రం మాత్రం జ్ఞానేశ్ కుమార్ పేరును ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. అదేవిధంగా ఎలక్షన్ కమిషనర్‌గా వివేక్ జోషి పేరును ఖరారు చేశారు. సీఈసీ, ఈసీ పదవులకు ఎంపిక చేసిన పేర్లను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వెంటనే ఆమోదించారు.
ఇంతకీ ఎవరీ జ్ఞానేశ్ కుమార్.. ?
కేరళ క్యాడర్‌కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి జ్ఞానేశ్ కుమార్. ప్రస్తుతం ఆయన వయసు 61 ఏళ్లు. 2019లో కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్ 370ని రద్దు చేసిన సందర్భంలో ఆయన హోంమంత్రిత్వ శాఖలో సేవలు అందించారు. 370 రద్దు కోసం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లును రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. హోంశాఖలో సంయుక్త కార్యదర్శిగా గతేడాది జనవరి 31న రిటైర్డ్ అయ్యారు. ఆ తర్వాత అదే ఏడాది మార్చిలో ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు.2029 జనవరి 26 వరకు ఆయన సీఈసీగా కొనసాగనున్నారు. ఆయన పర్యవేక్షణలోనే ఈ ఏడాది చివరిలో బిహార్, వచ్చే ఏడాదిలో కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు కూడా ఆయన హయాంలోనే 2027లో జరుగుతాయి.
జ్ఞానేశ్ ఫ్యామిలీలో అందరూ అధికారులే :
జ్ఞానేశ్ కుమార్ కుటుంబంలో నలుగురు ఐఏఎస్ అధికారులు, ఇద్దరు ఐఆర్ఎస్ అధికారులు ఏకంగా 28 మంది వైద్యులు ఉన్నారు. జ్ఞానేశ్ కుమార్తె మేధా రూపం, ఆమె భర్త 2014 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారులు. జ్ఞానేశ్ రెండో కుమార్తె అభిశ్రీ ఐఆర్ఎస్ అధికారిణి. ఆమె భర్త అక్షయ్ లబ్రూ ఐఏఎస్ ఆఫీసర్. జ్ఞానేశ్ సోదరుడు మనీశ్ కుమార్ ఐఆర్ఎస్ అధికారి. చెల్లి భర్త ఉపేంద్ర జైన్ కూడా ఐపీఎస్సే. మనీశ్ సోదరి రోలి ఇండోర్‌లో ఒక స్కూల్ నడుపుతున్నారు.
జ్ఞానేశ్ కుమార్ గుప్తా పుట్టింది యూపీలోని ఆగ్రాలో. ఆయన తండ్రి సుబోధ్ గుప్తా. తల్లి సత్యవతి. సుబోధ్ గుప్తా ఓ ప్రముఖ వైద్యుడు. సుబోధ్‌తో పాటు ఆయన కుటుంబంలో 28 మంది వైద్యులు ఉన్నారని తెలుస్తోంది.
ఫస్ట్ పోస్టింగ్ కేరళ :
1988 బ్యాచ్ కేరళ కేడర్‌కు చెందిన జ్ఞానేశ్ కుమార్ తొలుత తిరువనంతపురంలో జిల్లా కలెక్టర్‌గా ఎంపికయ్యారు. మన్మోహన్ సింగ్ హయాంలో 2007 నుంచి 2012 వరకు.. ఆయన రక్షణ మంత్రిత్వ శాఖలో సంయుక్త రక్షణ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు.