మాములుగా కార్లు, భారీ వాహనాలు యాక్సిడెంట్ల సమయంలో తిరగబడటం చూస్తుంటాం. కానీ ఏకంగా ఓ విమానం తిరగబడితే.. అది కూడా అందులో పూర్తిగా ప్రయాణీకులు ఉన్న సమయంలో. ఈ ఆలోచనే భయంకరంగా ఉంది కదా. కానీ కెనడాలో ఓ విమానం నిజంగానే తిరగబడింది. కానీ అదృష్టవశాత్తు ఎవ్వరూ ఈ ప్రమాదంలో మృతి చెందలేదు. కానీ 18 మందికి మాత్రం గాయాలయ్యాయి.
టొరంటో పియర్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగింది ఈ ఘటన. విమానం ల్యాండ్ అయిన తర్వాత రన్‌వేపై స్లిప్ అయ్యి బోల్తా పడింది. గాయపడిన వరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో 76 మంది ప్రయాణీకులు, నలుగురు సిబ్బందితో కలిపి మొత్తం 80 మంది ఉన్నారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిలో ఓ చిన్నారి కూడా ఉంది.
ప్రస్తుతం కెనడాలో దట్టంగా మంచు కురుస్తోంది. విమానం ల్యాండ్ అయిన తర్వాత రన్‌వేపై విమానం జారుతూ వస్తూ బోల్తాపడింది. ప్రమాద సమయంలో అక్కడి ఉష్ణోగ్రత మైనస్ 8.6 డిగ్రీలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదం కారణంగా విమానంలో మంటలు చెలరేగాయి. అయితే రెస్క్యూ టీమ్స్ వెంటనే స్పందించి మంటలను ఆర్పివేశారు. చిక్కుకున్న ప్రయాణీకులను బయటికి తీసుకొచ్చారు.
ప్రమాదానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. వాటిని చూస్తే ఇందులో నుంచి బతికి బయటపడ్డ వారి అదృష్టం మాములుగా లేదని చెప్పాలి. ఈ ప్రమాదం కారణంగా 40కిపైగా విమానాల రాకపోకలపై ప్రభావం పడింది.