దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధాని నగరాల్లో తిరుమల శ్రీవారి ఆలయాలు టీటీడీ ఆధ్వర్యంలో నిర్మిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ హిందువులు అత్యధికంగా ఉన్న విశ్వనగరాల్లో శ్రీవారికి మందిరాలు కడతామని ప్రకటించారు. అలాగే, హిందువులు ఉండే అన్ని దేశాల్లోనూ శ్రీవారి దేవాలయం ఉండాలని ఆశిస్తున్నానన్నారు. తిరుపతిలో జరుగుతున్న ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వైదిక వ్యవహారాల్లో సర్కారు జోక్యం ఉండదని చెప్పారు. అర్చకుల వేతనాలు పెంచామని, ఆలయాల అభివృద్ధికి రూ.138 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ఆలయాల అభివృద్ధికి నిధుల కొరత లేదని, వాటిని వినియోగించి భక్తులకు సరైన వసతులు కల్పించడమే దేవుడికి సేవ చేసే ఉత్తమ మార్గమన్నారు. ఏ ఆలయమైనా, ఏ ప్రభుత్వమైనా భక్తులు ఇచ్చే విరాళాలను వారి మనోభావాలకు అనుగుణంగానే ఖర్చుచేయాల్సి ఉంటుందన్నారు. ప్రయాగరాజ్‌లో మహాకుంభమేళా జరుగుతున్న సమయంలోనే తిరుపతిలో ఆలయాల మహాకుంభ్ ప్రారంభమవుతుండడం అదృష్టమన్నారు.
మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సుకు రాష్ట్రప్రభుత్వం ఆతిథ్యం ఇస్తోంది. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర, గోవా ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడణవీస్, ప్రమోద్ సావంత్, కేంద్ర మంత్రి శ్రీపాద యశోనాయక్ కూడా హాజరయ్యారు. దేశానికి సరైన సమయంలో నరేంద్ర మోదీ వంటి నాయకుడు లభించాడని, వికసిత్ భారత్ లక్ష్యంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రధాని కృషి చేస్తున్నారని చంద్రబాబు ఈ సందర్భంగా ప్రశంసించారు. రాష్ట్రంలోని ఆలయాల రక్షణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామని.. ఇటీవలే దేవదాయ శాఖ చట్టాన్ని సవరించామని చంద్రబాబు తెలిపారు. ప్రతి ఆలయ ట్రస్టు బోర్డులో బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులు సభ్యులుగా ఉండేలా చట్టం తెచ్చామన్నారు. అన్ని గుళ్లలో ఐవీఆర్‌ఎస్ ద్వారా భక్తుల అభిప్రాయాలు సేకరిస్తున్నామని, క్యూఆర్ కోడ్‌తో ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నామన్నారు. ఐటీసీఎక్స్-2025 ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ, సిక్కు, బౌద్ధ, జైన ఆలయాల ట్రస్టులను ఏకం చేస్తోందన్నారు. ఆలయాల ఉత్తమ నిర్వహణ, భద్రత, పారదర్శక ఆర్థిక వ్యవస్థల కోసం కృషి చేస్తోందని చెప్పారు. ఆలయాల యాజమాన్యాలను ఒకే వేదికపైకి తెచ్చి ఆలయాల అభివృద్ధితో పాటు భక్తుల సంక్షేమానికి చర్యలు తీసుకునే లక్ష్యంతో ముందుకు రావడం సంతోషకరమని చెప్పారు. వారాణసీలో తొలి సదస్సు నిర్వహించిన ఐటీసీఎక్స్ రెండో సదస్సును సరైన సమయంలో తిరుపతిలో నిర్వహిస్తోందని, ప్రపంచవ్యాప్తంగా 1,500కు పైగా ఆలయాల కమిటీలు కలుస్తుండడం గొప్ప విషయమన్నారు. వర్చువల్‌గా కూడా ఎంతోమంది ప్రముఖులు పాల్గొంటున్నారని, ప్రత్యక్షంగా 111 మంది వక్తలు పాల్గొని ఆలయాల నిర్వహణపై దిశానిర్దేశం చేస్తుండడం ప్రశంసనీయమన్నారు. 15 వర్క్‌షాపులతో పాటు 60కి పైగా వివిధ స్టాల్స్ ఏర్పాటు ఆలయాల సక్రమ నిర్వహణకు ఉపకరిస్తాయని చంద్రబాబు చెప్పారు. అమరావతి అన్న పేరుకు అర్థం దేవతల రాజధాని అంటూ అలాంటి అమరావతిని రాష్ట్ర రాజధానిగా నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. పవిత్రంగా, ఎంతో పరిశుభ్రంగా, అన్ని అధునాతన సదుపాయాలతో నిర్మాణం చేపట్టామని తెలిపారు. ఈరోజు చెబుతున్నా.. ఏదో ఒక రోజు తిరుమలకు వచ్చే యాత్రికులు తదుపరి అమరావతినీ చూసేందుకు వచ్చే రోజు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
దేశంలో సంస్కృతులు, వేషభాషలు వేర్వేరైనా ఆలయాల సంస్కృతి ద్వారానే ప్రజలంతా కలసి ఉంటున్నారని, అందరం ఒక్కటిగా ఉంటేనే భద్రంగా ఉంటామని గోవా సీఎం సావంత్ తెలిపారు. దేశంలో తరతరాలుగా రాజులు, చక్రవర్తులందరూ దేవుడిని నమ్మి, ధర్మాన్ని పాటించారు. అందుకే ఇప్పటికీ సనాతన ధర్మం కొనసాగుతోందని చెప్పారు. ఇక, వారాణసీలో జరిగిన తొలి సమావేశం తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆలయాలను ఏకం చేయడంలో టెంపుల్ కనెక్ట్ కృషిని ప్రశంసిస్తూ ఆర్‌ఎ్‌సఎస్ ముఖ్యనేత మోహన్ భాగవత్ వర్చువల్ ద్వారా తన సందేశాన్ని ఇచ్చారు. పూర్వకాలంలో దేవాలయాలు భారతీయ సామాజిక కేంద్రాలుగా ఉండేవని, నేడు కూడా వాటి పట్ల అపరిమితమైన విశ్వాసం ఉందని భాగవత్ పేర్కొన్నారు.