26.3 C
Hyderabad
Monday, August 3, 2026

Live Video

spot_img

కాంగ్రెస్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేస్తోన్న షర్మిల!

సాధారణంగా ఎక్కడైనా ప్రతిపక్షాలు అధికార పార్టీ నిర్ణయాలు, ప్రభుత్వంలో లోపాలను విమర్శిస్తాయి. విమర్శలకు తోడు.. అవసరమైన సలహాలు కూడా ఇవ్వడం పరిపాటి. ప్రజల్లో చూసినా.. ఎంతో కొంత అధికార పార్టీపైనే వ్యతిరేకత ఉంటుంది. ప్రతిపక్షాలను పెద్దగా కార్నర్‌ చేయడం ఉండదు. ఏ రాష్ట్రంలో చూసినా, జాతీయ స్థాయిలో చూసినా ఇదే పరిస్థితి ఉంటుంది. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం చిత్రమైన పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్‌ పార్టీ పీసీసీ తరపున మీడియాతో మాట్లాడిందంటే.. అధికార పార్టీని కాకుండా.. మరో ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేసుకుంటుంది. అధికార పార్టీ పట్లగానీ, ప్రభుత్వ నిర్ణయాల పట్ల గానీ ప్రస్తావన ఉండదు. గత కొంత కాలంగా నెలకొన్న ఈ పరిస్థితి రాజకీయ వేత్తలను, విశ్లేషకులను కూడా విస్తుపోయేలా చేస్తోంది. దీనికి కారణం ఏపీసీసీ ప్రెసిడెంట్‌ వైఎస్‌ షర్మిల. షర్మిల మీడియాతో మాట్లాడేందుకు షెడ్యూల్‌ వచ్చిందంటే చాలు.. పొలిటికల్‌ సర్కిల్స్‌లో, జర్నలిస్ట్‌ సర్కిల్స్‌లో ఆసక్తికర చర్చ సాగుతుంది. ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి సంబంధించి ఏ కోణంలో విమర్శలు చేస్తారా? అన్నది హాట్‌ టాపిక్‌ అవుతోంది. సహజంగానే పీసీసీ చీఫ్‌ షర్మిల కూడా తన సోదరుడి పార్టీ అయిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని విమర్శించడం, ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడం సర్వ సాధారణంగా మారిపోయింది.

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల వ్యవహారం ఆ పార్టీకి, పార్టీ సీనియర్‌ నాయకులకు తలనొప్పులు తెస్తోంది. షర్మిల ఎప్పుడు మీడియాతో మాట్లాడినా.. ప్రభుత్వంపై సాఫ్ట్‌ కార్నర్‌ కనిపిస్తుంది. లేదంటే అసలు అధికార పక్షం ప్రస్తావనే ఉండదు. కేవలం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని విమర్శించేందుకు, ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై ఆరోపణలు సంధించేందుకు మాత్రమే మీడియాను ఉపయోగించుకుంటున్నారన్న చర్చ ఏపీలోనే కాదు.. పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా నెలకొంది. షర్మిల ఇదే వైఖరి కొనసాగిస్తే.. కాంగ్రెస్‌ పార్టీ ఏపీలో అస్సలు కోలుకునే పరిస్థితి ఉండదంటున్నారు ఆ పార్టీ సీనియర్లు. ఇలాగే ఉంటే.. ఇప్పటిదాకా తాము కాపాడుకుంటూ వస్తున్న ఆ ఉన్న నాలుగు ఓట్లు కూడా లేకుండా పోతాయంటున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యనేతలు, అప్పటి పీసీసీ అధ్యక్షులుగా వ్యవహరించిన రఘువీరారెడ్డి గానీ, సాకే శైలజానాధ్ గానీ, గిడుగు రుద్రరాజు వంటి వాళ్లు అధికార పార్టీనే లక్ష్యంగా చేసుకుని పోరాడిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలే గుర్తు చేస్తున్నారు. కానీ, వైఎస్ షర్మిల పీసీసీ చీఫ్ అయిన నాటి నుంచి తన సోదరుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ ను మాత్రమే లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడాన్ని తప్పుపడుతున్నారు. జగన్‌పై ఎన్ని విమర్శలు చేసినా.. ఇప్పుడు పెద్దగా ప్రయోజనం లేదు.. పైగా కాంగ్రెస్‌ పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న కాస్త పాజిటివ్‌ వేవ్స్‌ కూడా ఉండకుండా పోతాయంటున్నారు. ఎందుకంటే వైఎస్‌ జగన్ ఇప్పుడు అధికారంలో లేరు. ఆయనను విమర్శించినా జనం పెద్దగా పట్టించుకోరు. ప్రభుత్వ పరంగా గానీ, రాష్ట్రం అభివృద్ధి విషయంలో గానీ ప్రస్తుతం విధాన నిర్ణయాలు తీసుకునే అదికారం కూడా ఆయన చేతుల్లో ఏమీ లేదు. అలాంటి జగన్ మోహన్‌ రెడ్డిపై నిత్యం విమర్శలు చేయడం వల్ల ఏం ప్రయోజనం చెల్లీ! అంటూ హస్తం నేతలు సుతిమెత్తగా ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఎన్నికల సమయంలో ఏవైనా విమర్శలు చేసినా అర్థముంటుంది. కానీ, ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. ఇప్పుడు జగన్ పై చేసే విమర్శలకు, ఆరోపణలకు పార్టీకి గానీ, ప్రజల్లో గానీ ఏమాత్రం విలువ ఉండదన్నది అందరికీ తెలిసిందే.. కానీ, ఈ మాత్రం షర్మిలమ్మకు తెలియదా? అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. కానీ, అవకాశమొచ్చినప్పుడల్లా జగన్‌ను వైఎస్ షర్మిల విమర్శించడాన్ని ప్రజలు కూడా పార్టీ పరంగా చూడటం లేదు. ఇది కేవలం వ్యక్తిగత ద్వేషంతోనే విమర్శలు చేస్తున్నారన్న వాదన బలంగా నాటుకు పోయింది. తన సొంత ఎజెండాను కాంగ్రెస్‌ పార్టీ జెండా నీడన అమలు చేసుకుంటున్నారన్న అభిప్రాయం అందరిలోనూ వచ్చిందంటున్నారు. గత ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తన వల్లనే ఓటమి పాలయ్యారనే భ్రమలోనే షర్మిల ఉందని, ఆ ట్రాన్స్‌లోంచి ఆమె బయటకు వస్తేనే కాంగ్రెస్‌పార్టీతో పాటు.. ఆమెకు కూడా ప్రయోజనంగా ఉంటుందని సలహాలు ఇస్తున్నారు.

రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌ పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క శాతం ఓటు కూడా పెరగలేదు. ఎందరు పీసీసీ చీఫ్‌లు మారినా.. కాంగ్రెస్‌ పార్టీని జనం ఆదరించలేదు. గత మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటును కూడా ఏపీ అసెంబ్లీలో గెలుచుకోలేకపోయింది. పైగా వైఎస్ షర్మిల మిగిలిన పీసీసీ చీఫ్‌లకు భిన్నంగా అధికార పార్టీ పట్ల ఇలాగే, మెతక వైఖరి అవలంబిస్తే.. తగదని సూచిస్తున్నారు. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించకపోగా, ప్రతపక్ష పార్టీపై చిందులు తొక్కడం సొంత పార్టీకే నష్టమని, అంతేకాదు.. కూటమి ప్రభుత్వానికి కూడా నష్టమేనని, ఇలా చేస్తే జగన్‌కే సానుభూతి పెరుగుతుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కానీ, షర్మిల మాత్రం తన తీరును మార్చుకోవడం లేదు. మీడియా సమావేశం పెట్టినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా అది జగన్‌కు వ్యతిరేకంగానే ఉండటంతో.. సొంత ఎజెండా అమలు కోసమే పీసీసీ చీఫ్‌ పదవిని అడ్డు పెట్టుకుంటున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com