మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన మొదలయ్యింది. కొన్నేళ్లుగా రాష్ట్రంలో అల్లర్లు, హింస చెలరేగడం.. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేందుకు కాంగ్రెస్‌పార్టీ సిద్ధం కావడం.. ఆ వెంటనే ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాజీనామా చేయడం.. ఆ మరుసటిరోజే రాష్ట్రపతి పాలన ఉత్తర్వులు వెలువడటం జరిగిపోయాయి. అయితే, ఈ నిర్ణయం వెనుక భారతీయ జనతాపార్టీ వ్యూహం ఉందన్నది విశ్లేషకుల అభిప్రాయం.
మణిపూర్‌లో రెండు వర్గాలైన కుకి, మైతేయి తెగల మధ్య తీవ్రస్థాయిలో గొడవలు జరుగుతున్నాయి. ఈ రెండు వర్గాలు హింసకు పాల్పడుతుండటంతో వందలాది మంది చనిపోయారు. కోట్ల రూపాయల్లో ఆస్తి నష్టం వాటిల్లింది. కేంద్ర బలగాలు పహారా కాయాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంది. అయినా.. అక్కడ ఇంకా శాంతిభద్రతలు అదుపులోకి రాలేదు. దీంతోపాటు మణిపూర్ రాష్ట్రానికి మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా పనిచేసిన బీరేన్ సింగ్ ఓ వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మణిపూర్ వాసులు ఆరోపిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ చెందిన ఎమ్మెల్యేలు కూడా అదే వాదన అందుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రకటించినట్లు ఒకవేళ విశ్వాస పరీక్ష జరిగితే.. బీజేపీ ఎమ్మెల్యేలు విప్‌ను సైతం ధిక్కరించే ప్రమాదం నెలకొంది. దీంతో, బీజేపీ అధిష్టానం రంగంలోకి దిగింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. బీరేన్ సింగ్‌ను పిలిపించుకున్నారు. దీంతో బీరేన్ సింగ్ రాజీనామా చేయక తప్పలేదు. అమిత్ షాతో భేటీ ముగిసిన తర్వాత బీరేన్ సింగ్ తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కు అందజేశారు. అమిత్ షా సూచనలతోనే బీరెన్ సింగ్ రాజీనామా చేశారని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. విశ్వాస పరీక్ష పెట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసిన ఒకరోజు ముందుగానే.. బీరెన్ సింగ్ ఈ నిర్ణయం తీసుకోవడంతో మణిపూర్ రాజకీయాలలో అనూహ్య మార్పు చోటు చేసుకుంది. ఈ క్రమంలో తదుపరి సీఎం ఎవరు అనే విషయంపై సందిగ్ధత ఏర్పడింది. అయితే, కొత్త ముఖ్యమంత్రిని నియమిస్తారని.. మణిపూర్ రాష్ట్రంలో నెలకొన్న అల్లకల్లోల పరిస్థితులను బీజేపీ అధిష్టానం చక్క దిద్దుతుందని అందరూ భావించారు. కానీ, కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మణిపూర్‌లో రాష్ట్రపతి పరిపాలన విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మణిపూర్ ముఖ్యమంత్రి రాజీనామా చేసిన నేపథ్యంలో.. ఆ రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
వాస్తవానికి 2023 నుంచి మణిపూర్ రాష్ట్రంలో ఘర్షణలు తీవ్రస్థాయిలో జరుగుతున్నాయి. మైతేయి, కుకీ వర్గాలు హోరాహోరీగా ఘర్షణ పడుతున్నాయి. అంతకంతకు హింస పెరుగుతున్న నేపథ్యంలో.. రెండు వర్గాల వారు చనిపోతున్న నేపథ్యంలో.. కేంద్రం రాష్ట్రపతి పరిపాలన విధిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి పరిపాలన విధించాలని గతంలోనే కాంగ్రెస్ డిమాండ్ చేసింది. విపక్షాలు కూడా పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని ఇదే విషయంపై నిలదీశాయి. అయితే, ఇన్ని రోజులకు కేంద్రం మణిపూర్ ప్రాంతంలో రాష్ట్రపతి పరిపాలన విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో, ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వం తీరును స్వాగతిస్తున్నాయి. ఇప్పటికైనా జన బాహుళ్య కోణంలో ఆలోచించారని.. ఇదే ఆలోచన ముందే చేసి ఉంటే మణిపూర్ అలా మండిపోయేది కాదని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ఈశాన్య రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని ప్రతిపక్షాలు విజ్ఞప్తి చేస్తున్నాయి