రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారుల స్ధితిగతులపై తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేషనల్ హైవే అధారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణంలో జాప్యం జరగడానికి గల కారణాలను అధికారులతో చర్చించారు. భూసేకరణ పెద్ద సమస్యగా మారిందని అందువల్ల రహదారుల నిర్మాణం అనున్నంత వేగంగా జరగడం లేదని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. భూసేకరణ సమస్యపై ముఖ్యమంత్రితో చర్చించి త్వరలో కలెక్టర్లతో సమావేశం నిర్వహించి సమస్యను పరిష్కరిస్తామని మంత్రి కోమటిరెడ్డి అధికారులతో చెప్పారు. విజయవాడ – నాగపూర్ ఎన్.హెచ్-163, హైదరాబాద్-డిండి ఎన్.హెచ్-765, ఖమ్మం-దేవరపల్లి ఎన్.హెచ్-365, కర్నూలు-రాయచూరు ఎన్.హెచ్-151, హైదరాబాద్-విజయవాడ ఎన్.హెచ్-65, హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారుల నిర్మాణాలపై మంత్రి సమీక్షించారు.