మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హైదరాబాద్‌లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేయడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. ఎక్స్ వేదికగా సంచలన కామెంట్లు చేశారు. ఏపీ ప్రభుత్వం తీరును దుయ్య బట్టారు.
రాష్ట్రంలో చట్టానికి, న్యాయానికి చోటు లేకుండా పోయిందని, తీవ్ర అధికార దుర్వినియోగంతో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తూ, అసలు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని వైఎస్ జగన్ మండి పడ్డారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో చంద్రబాబు నాయుడు కూటమి సర్కార్ వ్యవహరిస్తున్న తీరు అత్యంత అన్యాయంగా ఉందన్నారు. గన్నవరం కేసులో తనపై టీడీపీ వారు ఒత్తిడి తెచ్చి, తప్పుడు కేసు పెట్టించారంటూ సాక్షాత్తూ జడ్జిగారి ముందు దళిత యువకుడు వాంగ్మూలం ఇచ్చి, అధికారపార్టీ కుట్రను బట్టబయలు చేస్తే, తమ బండారం బయటపడిందని, తమ తప్పులు బయటకు వస్తున్నాయని తట్టుకోలేక, దాన్నికూడా మార్చేయడానికి చంద్రబాబు దుర్మార్గాలు చేస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సత్యానికి కట్టుబడి నిజాలు చెప్పినందుకు దళిత యువకుడిని పోలీసులను పంపించి మరీ వేధించడం ఎంతవరకు కరెక్టు? అని జగన్ ప్రశ్నించారు. వాంగ్మూలం ఇచ్చిన రోజే ఆ దళిత యువకుడి కుటుంబంపైకి పోలీసులు, టీడీపీ కార్యకర్తలు వెళ్లి వారిని బెదిరించి, భయపెట్టడం కరెక్టేనా? ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమేనా? మీ కక్షలు తీర్చుకోవడానికి ఇన్నిరకాలుగా వ్యవస్థలను వాడుకుని దుర్మార్గాలు చేస్తారా? అని కూటమి సర్కారుపై జగన్ ప్రశ్నల వర్షం కురిపించారు. సుప్రీంకోర్టు దృష్టిలో ఉన్న ఈ కేసులో, వారి ఆదేశాలను అనుసరించి దిగువ కోర్టు క్షుణ్నంగా కేసును విచారిస్తుంటే, పెట్టింది తప్పుడు కేసంటూ వాస్తవాలు బయటకు వస్తుంటే మొత్తం దర్యాప్తును, విచారణను, చివరకు జడ్జిగారిని, న్యాయ ప్రక్రియను అపహాస్యం చేయడం, అధికారముందనే అహంకారంతో మీరు చేస్తున్నది అరాచకం కాదా ఇది? అధికార దుర్వినియోగం కాదా? అని నిలదీశారు. వల్లభనేని వంశీ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. వంశీ భద్రతకు ఎలాంటి సమస్య వచ్చినా ఈ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుందని వైఎస్ జగన్ వార్నింగ్ ఇచ్చారు.
మరోవైపు.. దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరిపై తప్పుడు కేసును తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు జగన్. కళ్యాణ మండపం ప్రాంగణంలో అబ్బయ్య చౌదరి డ్రైవర్ టీడీపీ ఎమ్మెల్యే బూతులు తిట్టి, తిరిగి అబ్బయ్య చౌదరిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం దుర్మార్గమన్నారు. టీడీపీ ఎమ్మెల్యే ఏం తిట్టారో ఆ వీడియోను కోట్లమంది ప్రజలు చూశారని స్పష్టం చేశారు. మరి ఎవరిపై చర్యలు తీసుకోవాలని ప్రశ్నించారు. తప్పులు టీడీపీ వారు చేసి, వారిపై చర్య తీసుకోమని కోరితే.. పోలీసులు ఎదురు కేసులు పెట్టి అన్యాయంగా వ్యవహరిస్తున్నారని, అందులోనూ 307, అంటే హత్యాయత్నం కేసులు పెట్టడం ఏంటని, అందులోనూ బాధితులపైనే కేసులు పెడతారా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో దిగజారిన వ్యవస్థలకు ఈ ఘటన నిదర్శనం కాదా? అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.
ఇక, చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన సూపర్-6, సహా ఇచ్చిన 143 హామీలు నిలబెట్టుకోలేక, ఒక్కదాన్నీ కూడా అమలు చేయక, అంతకుముందున్న పథకాలను సైతం రద్దుచేసి, ప్రజలను సంక్షోభంలోకి నెట్టారని ఆరోపించారు వైఎస్ జగన్. ప్రజల దృష్టిని మళ్లించడానికి తమ పార్టీకి చెందిన నాయకులను, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు, తప్పుడు సాక్షులతో అక్రమ అరెస్టులకు దిగుతున్నారని, మీ తప్పులను ప్రజలే తమ డైరీల్లో రికార్డు చేసుకుంటూనే ఉన్నారని, తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నామని జగన్ ఎక్స్‌లో పోస్ట్ చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు.