అంతర్జాతీయ సంస్థల నుంచి డిమాండ్ పెరుగుతుండడం, పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుతున్న తరుణంలో హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్‌ల కోసం డిమాండ్ అంచనాలకు మించి పెరిగిపోతోంది. ఈమేరకు రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సర్వీసెస్ సంస్థ – సీబీఆర్ఈ తన నివేదికలో వెల్లడించింది. సీబీఆర్‌ఈ, హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్ ప్రైజెస్ అసోషియేషన్ సంయుక్తంగా విడుల చేసిన నివేదికలో.. దేశీయంగా మిగతా నగరాలతో పోల్చితే ఆఫీస్ స్పేస్‌కు హైదరాబాద్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారిందని పేర్కొంది. భవిష్యత్తులో ఈ డిమాండ్ ఇలాగే పెరుగుతూ 2030 నాటికి 20 కోట్ల చదరపు అడుగులకు చేరుకుంటుందని వెల్లడించింది.
ప్రస్తుతం నగరంలో 1.37 కోట్ల చదరపు అడుగుల మేర ఆఫీస్ స్పేస్ వినియోగంలో ఉన్నట్లు తెలిపిన ఈ నివేదిక.. గత పదేళ్లతో పోల్చితే హైదరాబాద్ నగరంలో ఆఫీస్ స్పేస్ దాదాపు మూడు రెట్లు పెరిగిందని స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో ఐటీ సహా ఇతర విభాగాల్లో అనేక సంస్థలు ఉన్న బెంగళూరు, ఢిల్లీ, చెన్నై వంటి నగరాల కంటే హైదరాబాద్ వైపు ఇంటర్నేషనల్ సంస్థలు ఆసక్తి ప్రదర్శిస్తున్నట్లు సీబీఆర్ఈ నివేదిక తెలిపింది. ప్రధాన నగరాల్లో ఉన్న ఆఫీస్ స్పేస్‌లలో హైదరాబాద్ వాటా 15 శాతంగా ఉన్నట్లు వెల్లడించింది. ఇందులో 18శాతం గ్రీన్ సర్టిఫైడ్ ఆఫీస్ స్టాక్‌గా పేర్కొంది.
హైదరాబాద్ నగరంలో 2024లో 1.23 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ బుకింగ్ అయ్యింది. ఇందులో.. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, డాటా అనలటిక్స్ వంటి రంగాలు ఎక్కువగా ఆఫీస్ స్పేస్ రెంట్‌కు తీసుకున్నట్లు వెల్లడైంది. మొత్తంగా టెక్నాలజీ సంస్థల వాటానే 31 శాతంగా ఈ నివేదిక వెల్లడించింది. గతంలో ఐటీ రంగాలకు చెందిన సంస్థల నుంచి 30- 35 శాతం డిమాండ్ ఉండేది. కానీ, ఇప్పుడు ఇతర రంగాల నుంచి సైతం పోటీ ఎక్కువ అవుతుండడం, ఆయా రంగాల సంస్థలు ఎక్కువగా ఆఫీస్ స్పేస్ రెంట్‌కు తీసుకుంటుండడంతో ఐటీ సంస్థల వాటా తగ్గిపోతున్నట్లు నివేదిక తెలిపింది. మొత్తంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బయో టెక్నాలజీ, ఫైనాన్స్ రంగాల సంస్థలు హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు, ఇక్కడ అద్దెలు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.
గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు ఎక్కువగా ఏర్పాటవుతున్నాయి. రెండేళ్ల కాలంలోనే ఈ సంస్థల ఆఫీస్ స్పేస్ వినియోగంలో 12శాతం వృద్ధి రేటు నమోదైంది. గతేడాది ఆఫీస్ స్పేస్ తీసుకున్న మొత్తం సంస్థల్లో బీసీసీల వాటానే 43 శాతంగా ఉండడం ఆశ్చర్యపరుస్తోంది. ఈ సంస్థల ఏర్పాటులో బెంగళూరు మొదటి స్థానంలో ఉండగా, హైదరాబాద్ రెండో స్థానంలో ఉన్నట్లు ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. జీసీసీల్లో బెంగళూరు మొదటి స్థానంలో ఉండగా, హైదరాబాద్ నగరం రెండో స్థానంలో ఉంది. గత ఏడాదిలో 53 లక్షల చదరపు అడుగుల ఆఫీసు స్థలాన్ని జీసీసీలు అద్దెకు తీసుకున్నాయి.
రానున్న ఐదేళ్లల్లో హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ గిరాకీ 1.5 రెట్లు పెరుగుతుందని ఈ నివేదిక అంచనా వేసింది. ఈ స్థాయిలో ఆఫీస్ స్పేస్ పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రధాన కారణమని విశ్లేషించిన నివేదిక.. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చోరవతోనే ఇది సాధ్యపడుతోందని ప్రశంసించింది. మౌలిక సదుపాయాల అభివృద్ధిపై నిరంతరం దృష్టి సారించడంతో పాటు, AI, రోబోటిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలలో పెరుగుతున్న పెట్టుబడులతో హైదరాబాద్‌కు ఈ డిమాండ్ ఏర్పడినట్లు తెలుపుతోంది. అలాగే.. ఇక్కడి బలమైన పర్యావరణ వ్యవస్థ, నైపుణ్యం కలిగిన యువత లభిస్తుండడంతో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ ఏర్పాటు సాధ్యమవుతోందని తెలిపింది. పైగా నగరంలో తక్కువ ధరల్లోనే అద్భుతమైన స్పేస్ అందుబాటులోకి రావడంతో పాటు ఇక్కడి వసతులు, వనరులు పెట్టుబడులను ఆకర్షించడంలో కీలకంగా పనిచేస్తున్నట్లు నివేదిక తెలిపింది.