ఏదైనా ఎన్నిక వస్తుందంటే చాలు.. హామీల వర్షం కురుస్తుంది. కానీ ఈ మధ్య ఉచిత హామీలు ఎక్కువైపోయాయి. దీనికి ఏ రాష్ట్రం అతీతం కాదు. రోజురోజుకు ఈ ఉచిత హామీలు పెరుగుతున్నాయే తప్ప.. ఎక్కడా తగ్గడం లేదు. అందుకే సుప్రీంకోర్టు ఉన్నతన్యాయస్థానం ఉచిత హామీలపై కీలక వ్యాఖ్యలు చేసింది. పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జస్టిస్ గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్ ధర్మాసనం ఉచితాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచిత పథకాలు మంచివి కావని, దురదృష్టవశాత్తూ వీటి కారణంగా జనం కష్టపడి పని చేసేందుకు ఇష్టపడడం లేదన్నది సుప్రీం కోర్టు. ఉచితంగా రేషన్, డబ్బులు అందుతున్నాయని, దీంతో ఎలాంటి పని చేయకుండానే డబ్బులు వస్తున్నాయన్న విషయాన్ని ప్రస్తావించింది. ప్రజలకు సౌకర్యాలు అందించాలన్న ప్రభుత్వాల ఉద్దేశం మంచిదే అయితే వారిని దేశ అభివృద్ధిలో భాగం చేయాలన్న మాట మాట్లాడింది. అక్కడితో ఆగలేదు సుప్రీంకోర్టు.. ఉచిత పథకాలు లబ్ధిదారులను పరాన్న జీవులుగా మారుస్తున్నాయంటూ కూడా రాజకీయ పార్టీలకు చురకలు అంటించింది సుప్రీంకోర్టు.
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలాంటివి.. కానీ ఇవి చెద్దామంటే ఖాజానాలో డబ్బు లేదు.. అంటూ మన తెలుగు రాష్ట్రాల నేతలు వారానికి రెండు సార్లైన మాట్లాడుతుంటారు. మళ్లీ ఉచిత హామీల అమలు కోసం అప్పులు తీసుకొచ్చి జమ చేస్తూ ఉంటారు. అందుకే అభివృద్ధి తక్కువై, ఆల్ ఫ్రీ సంక్షేమ పథకాల డోసు ఎక్కువైతే చాలా కష్టాలు వస్తాయని చెబుతోంది సుప్రీంకోర్టు. నిజానికి సమాజంలో పేదలకు ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలబడాల్సిందే. వారు నెక్ట్స్ లెవెల్ కు వెళ్లే దాకా సహాయం చేయాల్సిందే. దీన్ని తప్పుబట్టే పరిస్థితి లేదు. అయితే ఎన్నికల్లో గెలిచేందుకు అన్ని పార్టీలూ ఫ్రీ హామీలు ఇస్తున్నాయి. ఇలా పోటీలు పడి ఫ్రీ హామీలు ఇస్తే ముందు ముందు ఆర్థిక వ్యవస్థకు కష్టమవుతుందని ఉన్నతన్యాయస్థానం మాట.
మరి నిజంగా రాజకీయ పార్టీలు ఈ వ్యాఖ్యలను సిరీయస్‌గా తీసుకునే అవకాశం ఉందా? అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే ఓ పార్టీ ఉచిత హామీలు ఇచ్చి.. మనం ఇవ్వకపోతే ఓడిపోతామనే భయం వారిది. అందుకే పోటాపోటిగా ఉచిత హామీలు ఇస్తున్నాయి రాజకీయ పార్టీలు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ బీజేపీనే. నిజానికి బీజేపీ ఉచిత హామీలకు వ్యతిరేకం. ఉచిత హామీలు అభివృద్ధికి విరోధమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా సార్లు చెప్పారు. బీజేపీ నేతలు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేస్తుంటారు. కానీ ఢిల్లీ ఎన్నికలకు వచ్చే సరికి ఈ మాటలను మర్చిపోయింది. కేజ్రీవాల్ అయితే చాలా దారుణమైన ఉచిత హామీలు ప్రకటించారు. ఇంట్లో ఉంటే చాలు.. డబ్బులు మీ దగ్గరికి వస్తాయనేలా ఉన్నాయి ఆయన హామీలు. దీంతో ఓడిపోతామనే భయంతోనే.. లేక ఎలాగైనా అధికారం దక్కించుకోవాలన్న కసితోనే బీజేపీ కూడా ఉచితాలను ప్రకటించేసింది. ప్రజలు ఎక్కువ హామీలిచ్చిన ఆప్‌ను కాదని బీజేపీనే గెలిపించారు. అన్ని మాటలు చెప్పిన బీజేపీకి కూడా ఉచిత ప్రకటనలు తప్పలేదు.
అందుకే సుప్రీంకోర్టు సూచనలను పార్టీలు ఆచరిస్తాయా అనేది ఓ పెద్ద డౌట్. ప్రజలు ఉచితాలను కాదని.. నిఖార్సైన హామీలకు ఓటు వేసే అవకాశం ఉందా? అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి ఉచితాల జోలికి వెళ్లకుండా ఉంటాయా? ఇది ఇప్పట్లో తేలే అంశమైతే కాదు.